పబ్‌జీపై పోలీసుల ఉక్కుపాదం.. అరెస్టుల పర్వం

 
రాజ్‌కోట్: పబ్‌జీ గేమ్‌కు వెర్రెత్తిపోయిన యువత దాని బారినపడి ప్రాణాలు కోల్పోతుండడంతో చాలా రాష్ట్రాలు ఈ గేమ్‌ను నిషేధించాయి. అలా నిషేధించిన రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి. అయితే, గుజరాత్ పోలీసులు ఈ గేమ్‌ను నిషేధించి తమ పని అయిపోయిందని చేతులు దులిపేసుకోలేదు. రహస్యంగా ఈ గేమ్ ఆడుతున్న వారి పని పడుతున్నారు. దొరికిన వారి తాట తీస్తున్నారు. పబ్‌జీ గేమ్ ఆడుతూ రాజ్‌కోట్‌లో ఇప్పటి వరకు పదిమంది వరకు పోలీసులకు పట్టుబడ్డారు. దర్యాప్తులో భాగంగా వారి నుంచి మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారి పరిస్థితి మరీ ఘోరం. గేమ్‌లో మునిగిపోయిన వారు పోలీసులు వస్తున్న విషయాన్ని కూడా గుర్తించలేని స్థితిలో ఉండడం గమనార్హం.

పబ్‌జీ గేమ్ ఆడుతున్న వారిని పట్టుకునేందుకు ఎస్సై ఎన్‌డీ దామోదర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈక్రమంలో టీస్టాల్, ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ల వద్ద ఈ గేమ్ ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఫోన్లను పరిశీలించగా గేమ్ రన్నింగ్‌లో ఉన్నట్టు గుర్తించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో ప్రవేశపెట్టగా బెయిలుపై విడుదలైనట్టు రాజ్‌కోట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వీఎస్ వంజారా తెలిపారు. ఈ నెల 6న ప్రభుత్వం పబ్‌జీ మొబైల్, మోమో చాలెంజ్‌లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)