ఐపీఎల్‌ 2019: సిక్స్‌తో మొదలుపెట్టిన యువరాజ్‌

ముంబయి: క్రికెట్‌లో ఐపీఎల్‌కి ఉన్నంత క్రేజ్‌ మరే ఇతర ఈవెంట్‌లకు లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌, సిక్సర్ల రారాజు యువరాజ్‌సింగ్‌ ఇప్పటికే ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. ఈ సందర్భంగా ప్రాక్టీస్‌సెషన్‌లో తానెదుర్కొన్న మొదటి బంతినే సిక్సుగా మలిచి తన సత్తా చాటాడు యూవీ. ఈ సీజన్‌లో ఎలాగైనా రాణించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు.

ఐపీఎల్‌ మొదటి వేలంలో ఏ జట్టూ యూవీని తీసుకోలేదు. రెండో వేలంలోనూ ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఆఖరికి ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం రెండు కోట్ల ధరకు తీసుకుంది. దీంతో యూవీ ఎలాగైనా జట్టు యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టాలని ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ మేరకు యూవీ ప్రాక్టీస్‌ సెషన్‌లో కొట్టిన సిక్స్‌ వీడియోను ముంబయి ఇండియన్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో యూవీ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. వన్డేల్లో 304 మ్యాచులు, టెస్టుల్లో 40 మ్యాచులు ఆడిన యూవీ ముంబయి ఇండియన్స్‌కు ఎంతో విలువైన ఆటగాడు. తన అనుభవం రీత్యా ఈ సారి జట్టుని ముందుండి నడిపిస్తాడని యాజమాన్యం భావిస్తోంది.

ఇప్పటికే మూడుసార్లు టైటిల్‌ నెగ్గిన ముంబయి ఇండియన్స్‌ మరోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. కాగా మార్చి 23న ప్రారంభంకానున్న ఈ మెగా ఈవెంట్‌లో చెన్నైసూపర్‌కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్ల మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మొదటి మ్యాచ్‌ జరగనుంది. ఆపై మరుసటి రోజే ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ముంబయిలోని వాంఖడే స్టేడియంలో రెండో మ్యాచ్‌ జరగనుంది.

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)