న్యూజిలాండ్‌లో కాల్పులు.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ బంగ్లా క్రికెట‌ర్లు..!

బంగ్లా క్రికెట‌ర్లు తృటిలో ప్రాణాల‌ను ర‌క్షించుకున్నారు. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ సిటీలో ఉన్న‌ స్థానిక మ‌సీదులో ప్రార్థన‌కు వెళ్లిన స‌మ‌యంలో దుండ‌గులు ఒక్క‌సారిగా కాల్పుల జ‌రిపారు. అయితే క్రికెటర్లు సరైన సమయంలో అక్క‌డి నుంచి ప‌రిగెత్తి కాల్పుల నుంచి తప్పించుకున్నారు.నెల రోజులుగా న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బంగ్లా క్రికెటర్ల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం డీన్స్ అవెన్యూలోని మ‌సీదులో వారు ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన స‌మ‌యంలో ఆగంతకులు కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన బంగ్లా ఆట‌గాళ్లు పక్క‌నే ఉన్న పార్కులోకి పరుగులు తీశారు. అక్క‌డ నుంచి త‌ప్పించుకుని ప్రాణాలు ర‌క్షించుకున్నారు.

ఇదే విష‌యాన్ని బంగ్లా ఓపెన‌ర్ త‌మీమ్ ఇక్బాల్ ట్విట్టర్ ద్వారా వెల్ల‌డించాడు. త‌మ జ‌ట్టు స‌భ్యులంతా ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన స‌మ‌యంలో ఆగంత‌కులు కాల్పులు జ‌రిపార‌ని చెప్పాడు. అయితే తాము వెంట‌నే తేరుకుని అక్క‌డ నుంచి ప‌రుగెత్తి ప్రాణాలు ర‌క్షించుకున్నామ‌ని తెలిపాడు. తమ ఆట‌గాళ్లు అంతా క్షేమంగా ఉన్నార‌ని.. ప్ర‌మాదం నుంచి అంద‌రం త‌ప్పించుకున్నామ‌న్నాడు. ఇది భ‌యాన‌క ఘ‌ట‌న అని.. త‌మ కోసం ప్రార్థ‌న చేయాల‌ని కోరాడు. కాల్పులు జ‌రిగిన ఘ‌ట‌న‌కు వెంట‌నే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బంగ్లా క్రికెట‌ర్లు ప్రార్థ‌న‌కు వ‌చ్చిన స‌మ‌యంలో దుండ‌గులు కాల్పుల‌కు తెగ‌బ‌డిన‌ట్లు నిర్ధారించారు. దేశ చ‌రిత్ర‌లో ఇదొక చీక‌టి రోజుగా భావిస్తున్నట్లు న్యూజిలాండ్ ప్ర‌ధాని జసిండా ఆర్డెర్న్ తెలిపారు. కాల్పుల‌పై ఆమె తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మేము చాలా అదృష్ట‌వంతులం. మ‌మ్మ‌ల్ని ఆ అల్లానే ర‌క్షించాడు. జీవితంలో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను చూడ‌ద‌ల్చుకోలేదు..' అంటూ బంగ్లా ఆట‌గాడు ముష్పీక‌ర్ ర‌హీమ్ ట్వీట్ చేశాడు. బంగ్లా జ‌ట్టు కోచ్ మాట్లాడుతూ.. ఈ కాల్పులు జ‌రిగిన ప్రాంతానికి ద‌గ్గ‌ర‌లోనే త‌మ ఆట‌గాళ్లు ఉన్నార‌ని తెలిపారు. అయితే ఆ దేవుడి ద‌య‌తో ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌తో తామంతా భ‌యాందోళ‌న చెందుతున్నామ‌ని చెప్పారు. కాల్పుల విష‌యంపై బంగ్లా బోర్డు ట్విట్టర్ లో స్పందించింది. త‌మ ఆటగాళ్లు సుర‌క్షితంగా హోట‌ల్‌కు చేరుకున్నార‌ని వెల్ల‌డించింది. ఆట‌గాళ్లు, టీమ్ మేనేజ్‌మెంట్‌తో తాము మాట్లాడుతున్నామ‌ని తెలిపింది. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు పేర్కొంది.

ఇప్ప‌టికే కివీస్‌తో మూడు వ‌న్డేలు, రెండు టెస్ట్‌లు ఆడిన బంగ్లాదేశ్ శ‌నివారం జ‌రిగే మూడో టెస్ట్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో క్రైస్ట్ చర్చ్ సిటీలో ప్రార్థ‌న‌ల‌కు వెళ్ల‌గా.. దుండ‌గులు కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. దూరం నుంచే కాల్పుల శ‌బ్దం విని అక్కడి నుంచి ప‌రిగెత్తి బంగ్లా ఆట‌గాళ్లు సుర‌క్షితంగా బ‌య‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌నతో మూడో టెస్ట్‌ ను ఇరు జట్లు పరస్పర అంగీకారంతో రద్దయినట్లు ప్రకటించాయి. అయితే ఈ ఘ‌ట‌న‌లో దాదాపు 40 మంది మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. కాల్పులు జ‌రిపింది మొత్తం న‌లుగురు వ్య‌క్తులుగా న్యూజిలాండ్ పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నారు. ఇందులో ఓ మ‌హిళ కూడా ఉన్న‌ట్లు న్యూజిలాండ్ హెరాల్డ్ తెలిపింది. సిటీ మళ్ళీ సురక్షితంగా ఉందని, స్వేచ్ఛగా బయటకు రావచ్చని న్యూజిలాండ్ పోలీసులు ప్రజలకు భరోసా ఇచ్చారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)