RRR: భేషజాలు లేకుండా చరణ్ ఒప్పుకున్నాడు, స్నేహం మరో లెవల్‌కు వెళ్లిందన్న జూ ఎన్టీఆర్

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మల్టీ స్టారర్ మూవీ 'ఆర్ఆర్ఆర్' సినిమా విషయంలో ప్రచారంలోకి వచ్చిన రూమర్స్, అభిమానుల్లో అనుమానాలకు చెక్ పెట్టడంతో పాటు సినిమా కాన్సెప్టు ఏమిటనేది వివరించేందుకు రాజమౌళి అండ్ టీమ్ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళితో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత డివివి దానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ... 'ఎప్పుడు ప్రెస్ మీట్ జరిగినా నేను కాన్ఫిడెంట్‌గా వస్తాను. ఈ సారి మాత్రం ఎందుకో నర్వస్‌గా ఉంది. చాలా ఓవర్ హెల్మింగ్‌గా ఉంది. ఇది జక్కన్నతో నేను చేస్తున్న 4వ చిత్రం. జక్కన్నతో పని చేయడం, రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కెరీర్‌లో మిగిలిపోతుంది' అన్నారు.

‘‘చరణ్‌తో నా బాండింగ్ కేవలం ఈ చిత్రంతో మొదలవ్వలేదు. అంతకు ముందే నాకు మంచి మిత్రుడు. నా కష్ట సుఖాలు పంచుకునే స్నేహితుడు. మేము కలిసి ఒకే మూవీలో నటించడంతో మా స్నేహం మరో లెవల్ కు వెళ్లిపోయింది. ఈ స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. మంచి బంధాలు ఏర్పడినపుడు దిష్టి తగులుతుందని మా అమ్మ చెబుతుంది. ఆ దిష్టి తగలకూడదనే ఈ మాట చెబుతున్నట్లు'' తారక్ స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ అనేది యాక్టర్స్ నుంచి చాలా డిమాండ్ చేసే సినిమా. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం కలిసి ఉంటే ఏం జరిగి ఉండేది? అనే ఒక తాపత్రయాన్ని దర్శకుడు సినిమాలోకి తీసుకురావడం గొప్పగా ఉంది. నేను ఎప్పుడూ ఒక నటుడికి ఇన్ఫర్మేషన్ ఎంత తక్కువగా ఉంటే అంత ఎఫర్ట్ బయటకు వస్తుంది అని నమ్మే వ్యక్తిని. ఈ చిత్రం నాకు, చరణ్‌కు నటులుగా ఎదగడానికి ఎంతో దోహద పడుతుందన్నారు.

ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడానికి ముందు మేము చేసిన వర్క్ షాప్స్, మాకు ఇచ్చిన ట్రైనింగ్ పెంటాస్టిక్. ఇప్పటి వరకు చేసిన 28 చిత్రాల కంటే ఈ చిత్రంలో నేర్చుకున్న విషయాలు, తీసుకున్న శిక్షణ మా ఫ్యూచర్ ఫిల్మ్స్‌కు కూడా హెల్ఫ్ ఫుల్‌గా ఉంటుందని ఎన్టీఆర్ తెలిపారు. జక్కన్న బ్రెయిన్లో నుంచి వచ్చిన ఈ థాట్... 100 శాతం గొప్ప చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో మాకు అవకాశం దక్కడం మా అదృష్టం. ఈ అవకాశాన్ని కల్పించిన జక్కన్నకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ చిత్రంలో ఆయన అడిగిన వెంటనే నాతో ఏకీభవించి ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఎటువంటి భేషజాలు లేకుండా స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునేందుకు చరణ్ ఒప్పుకున్నందుకు నిజంగా హాట్సాఫ్ టు యూ బ్రదర్. మా జనరేషన్లో ఇది జరుగడం, అది జక్కన్న ద్వారా జరుగడంతో మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ కాన్ఫిడెన్స్ రేపు ఈ చిత్రానికి పాజిటివిటీగా మారి ఒక అద్భుతమైన ఎక్స్ పీరియన్స్‌కు ప్రేక్షకదేవుళ్లు లోనవుతారని మనసా వాచా కర్మనా నమ్ముతున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)