రాజమౌళి కొత్త సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటిష్ భామ.. ఎడ్గర్ జోన్స్‌కు చెందిన ఆసక్తికర వివరాలివే..

బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి.. ఖండాంతరాలుగా ఖ్యాతి గడించారు. ఆ తర్వాత ఆయన ఏం చేసినా హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. తాజాగా ఆయన ఎన్టీర్, రాంచరణ్ కీలక పాత్రలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు. మరోసారి ఫిక్షనల్‌ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ పిల్ల డైసీ ఎడ్గర్ జోన్స్నటించనుంది. ఈ వార్త తెలిసిన వెంటనే నెటిజన్లు ఈ భామ గురించి తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ నటి ఎడ్గర్ జోన్స్‌కు సంబంధించిన వివరాలు.. డైసీ ఎడ్గర్ జోన్స్.. హాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. టీవీ షోల ద్వారా ఆమె మంచి గుర్తింపు సాధించింది. ముఖ్యంగా ‘కోల్డ్ ఫీట్’ టీవీ షోలో జోన్స్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 1997లో మోస్ట్ పాపులర్ అయిన ఈ టీవీ షోకు ఎడ్గర్ జోన్స్ అదనపు ఆకర్షణ తెచ్చింది. 2017లో ఎడ్గర్ జోన్స్ ఎంట్రీతో ‘కోల్డ్ ఫీట్’ టీవీ షో రేటింగ్స్ అమాంతం పెరిగాయి.

కోల్డ్ ఫీట్ టీవీ షోలో ‘ఒలివియా’ అనే సాధారణ యువతి పాత్రలో ఎడ్గర్ జోన్స్ మెప్పించింది. అత్యంత సాధారణ తల్లిదండ్రులకు ముగ్గురు కుమార్తెల్లో ఒక అమ్మాయిగా ఎడ్గర్ నటించింది. ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడటం, అతడితో సాన్నిహిత్యం పెరిగి శారీరక సంబంధం పెట్టుకునే వరకు వెళ్తుంది. దీంతో ఆమె గర్భం దాలుస్తుంది. కెరీర్‌లో నిలదొక్కుకోవాల్సిన స్థితికి తోడు కుటుంబ సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో ఆమెకు ఈ పిడుగు లాంటి వార్త తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలను మరింత ఆసక్తికరంగా చెప్పారు టీవీ షో దర్శకుడు. అందంతో పాటు అద్భుత అభినయంతో ఈ టీవీ షో ద్వారా ఎడ్గర్ జోన్స్ మంచి గుర్తింపు సాధించింది. పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరుకు ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకుంది. ఆ తర్వాత ‘పాండ్ లైఫ్’, ‘వార్ ఆఫ్ ది వరల్డ్స్’ టీవీ షోలతోనూ మంచి గుర్తింపు సాధించింది. ఇవి కూడా 2017, 2018 నుంచి బ్రిటన్‌లో మోస్ట్ పాపులర్ అయిన టీవీ షోలే.

నాలో ఏదో ఉందని అప్పుడే గ్రహించా..

నటనపరంగా మంచి గుర్తింపు సాధించిన ఎడ్గర్ జోన్స్ చదువులో అంతంత మాత్రమేనట. ఈ విషయం తనే వెల్లడించింది. ‘నేను ప్రాథమిక పాఠశాల ఉన్నప్పుడు అన్ని సబ్జెక్టుల్లోనూ యావరేజ్ స్టూడెంట్‌నే. ఏ సబ్జెక్టులోనైనా మెరుగ్గా ఉన్నావా అని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి సిగ్గుగా ఉండేది’ అని ఎడ్గర్ జోన్స్ చెప్పింది. ‘నా ఐదో ఏట ఓ రోజు పాఠశాలలో ప్రదర్శించిన ఓ నాటకంలో నటించా. ఆ ప్రదర్శన చూసిన కొంత మంది నన్ను బాగా మెచ్చుకున్నారు. నాకు తొలిసారిగా అప్పుడు అనిపించింది.. నాలో ఏదో విషయం ఉందని.. నాటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నా’ అని ఎడ్గర్ చెప్పుకొచ్చింది.

అక్కడ నుంచే నా దశ తిరిగింది..
ప్రతిష్టాత్మక నేషనల్ యూత్ థియేటర్ నుంచి ఎడ్గర్ జోన్స్ నటనకు సంబంధించిన కోర్సులు చేసింది. తన 14వ ఏటే ఆ సంస్థలో ప్రవేశం సాధించింది. అక్కడ నుంచే తన దశ తిరిగిందని ఆమె గర్వంగా చెబుతోంది. ‘నేషనల్ యూత్ థియేటర్ సంస్థలో ప్రవేశం పొందటమంటే మాటలు కావు. దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ ఉన్నవాళ్లను కాచి వడబోసి ఎంపిక చేసుకుంటుంది ఆ సంస్థ. కానీ, నేను గట్టిగా ప్రయత్నించా.. మెప్పించా.. ప్రవేశం పొందా’ అని ఎడ్గర్ తెలిపింది. 
నేషనల్ యూత్ థియేటర్‌లో అవకాశం దక్కిందంటే.. నటనకు సంబంధించి మంచి అనుభవం వస్తుందని ఎడ్గర్ జోన్స్ చెప్పింది. తానిప్పుడు ఓ ప్రొఫెషనల్‌ నటిగా నటించడానికి ఆ అనుభవమే కారణమని చెబుతోంది.. టీవీ షోల ద్వారా బాగానే పాపులారిటీ సంపాదించినా.. ఎడ్గర్ జోన్స్‌కు ఇప్పటిదాకా పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఇప్పుడు రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో అవకాశం దక్కడం ఆమె అదృష్టమేనని చెప్పాలి. ‘RRR’ సినిమా ద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ బ్రిటిష్ భామ.. భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు కొల్లగొడుతుందో వేచి చూడాలి మరి!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)