కాలం వెనక్కి: సెకెనులో పదోవంతు సమయాన్ని వెనక్కి తిప్పిన శాస్త్రవేత్తలు!

మాస్కో: కాలం ముందుకే పరుగెడుతుంది తప్ప వెనక్కి తిరిగి చూడదనే విషయం మనకు తెలుసు. అందుకే-కాలంతో పోటీ పడాలని పెద్దలు చెబుతుంటారు. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లటం అసాధ్యం. కాలాన్ని వెనక్కి మళ్లించడం అంటే.. భూ పరిభ్రమణాన్ని వెనక్కి తిప్పినట్టే. భూత, భవిష్యత్ కాలాల్లో ప్రయాణించడం, కాలాన్ని వెనక్కి తీసుకెళ్లడం వంటి కథాంశాలతో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీస్ చాలానే ఉన్నాయి. ఇలాంటి అసాధ్యమైన విషయాలన్నింటినీ వెండితెరపై చూసి ఎంజాయ్ చేయగలం తప్ప, దాన్ని అనుభవించలేం.

తాజాగా- మాస్కో శాస్త్రవేత్తలు చేసిన ఓ ప్రకటన.. సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. తాము కాలాన్ని, సమయాన్ని వెనక్కి తీసుకెళ్లగలిగామంటూ మాస్కో శాస్త్రవేత్తలు ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా ఇది సాధ్యపడిందని వెల్లడించారు. ఎలా తీసుకెళ్లామనే విషయంపై ఓ ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ విషయంపై `సైంటిఫిక్ రిపోర్ట్స్` జర్నల్ ను ఉటంకిస్తూ `న్యూస్ వీక్` ఓ కథనాన్ని ప్రచురించింది. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధాంతాన్ని అనుసరించి.. మూడు క్యూబిట్ల ద్వారా సెకనులో పదో వంతు కాలాన్ని వెనక్కి మళ్లించామని మాస్కో ఇన్సిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. క్యూబిక్ అంటే.. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ కు సంబంధించిన ప్రాథమిక సూత్రం. దీన్ని ఉపయోగించి సెకెనులో పదోవంత కాలాన్ని వెనక్కి తిప్పగలిగామని అన్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేయగలిగితే.. కాలాన్ని వెనక్కి మళ్లించడం సాధ్యపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ అల్గోరిథమ్ ను వినియోగించినట్లు చెప్పారు.

ఈ సూత్రాన్ని అనుసరించడం వల్ల సాధారణ ప్రజలకు సులభంగా ఈ ప్రయోగం గురించి వివరించవచ్చని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ గోర్డీ లెసోవిక్ అన్నారు. మాస్కో ఇన్ స్టిట్యూట్ లాబొరేటరీ విభాగాధిపతిగా ఆయన పని చేస్తున్నారు. తాము చేసిన కృత్రిమ ప్రయోగం వల్ల గడియారంలోని థర్మో డైనమిక్ ముల్లు సెకెనులో పదోవంతు మేర వ్యతిరేక దిశలో ప్రయాణం చేసిందని గోర్డీ లెసోవిక్ తెలిపారు. క్వాంటమ్ సిద్ధాంతం, దాని ప్రాథమిక సూత్రాల వల్ల ఇది సాధ్యపడిందని అన్నారు. దీని ఆధారంగా అద్భుతాలను సృష్టించవచ్చని ఆండ్రీ లెబడీవ్ అనే మరో శాస్త్రవేత్త వెల్లడించారు. ఒక్కసారి కాలాన్ని వెనక్కి తిప్పగలిగే సూత్రాన్ని కనుగొన్నట్టయితే.. దాన్ని మరింత పురోభివృద్ధి చేయడం కష్టతరమేమీ కాదని ఆయన చెప్పారు. గడియారంలో ఒకటిని చూపించిన థర్మో డైనమిక్ ముల్లు.. తాము చేసిన ప్రయోగం అనంతరం సున్నా వద్దకు చేరిందని అన్నారు. దీన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకుని రావడానికి మరో ప్రయోగం చేశామని అన్నారు. క్వాంటమ్ సిద్ధాంతానికి ప్రాథమిక సూత్రంగా చెప్పుకొనే క్యూబిట్స్ వల్లే ఈ ప్రయోగం విజయవంతమైనట్లు అభిప్రాయపడుతున్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)