"జగన్‌కు కేసీఆర్ మద్దతిస్తే ఏంటి, బాబుకు అధికారం ఉంటే ఏంటి.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ!!"

ఆంధ్రప్రదేశ్‌లో లోకసభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్‌గా దృష్టి సారించారు. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధినేతలు ఓ వైపు అభ్యర్థుల ఖరారుపై దృష్టి సారిస్తూనే మరోవైపు సమయం చిక్కినప్పుడు ప్రచార పర్వంలోను నిమగ్నమయ్యారు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్, అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఏపీలో పవన్ అభిమానులు తమకు తోచిన మార్గాల్లో జనసేనను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన సోషల్ మీడియా కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. ఓ వైపు టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక విషయమై ఎక్కువ మంది కార్యకర్తలు వేచి చూసే పరిస్థితి ఉంటుంది. కానీ జనసైనికులు మాత్రం అభ్యర్థుల అంశాన్ని పక్కన పెట్టి అప్పుడే పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం ప్రారంభించారు.

ఏపీతో పాటు తెలంగాణలోని పవన్ కళ్యాణ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. కేవలం లోకసభ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జనసేనానిని, పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తెలంగాణకు చెందిన పవన్ ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారట. సాధ్యమైనంత వరకు అక్కడే ఉండి ప్రచారం చేయనున్నారట. అంతేకాదు, జనసేనానికి మద్దతివ్వాలని, చంద్రబాబు, జగన్ దొందూ దొందేనని, పవన్‌కు అవకాశమివ్వమని చెబుతున్నారట. ఎన్నికల్లో జనసేన గెలుపుపై అభిమానులు స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ అధికారం కోసం అర్రులు చాచడం లేదని, ప్రజలకు ఏదో చేయాలని భావిస్తున్నారని, అందుకు అందరి సహకారం కావాలని చెబుతున్నారు. టీడీపీకి అధికారం ఉండవచ్చునని, జగన్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ఉండవచ్చునని, కానీ జనసేనానికి అభిమాన గణం ఉందని చెబుతున్నారట.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)