సైకిల్ తొక్కితే డబ్బులిస్తారు.. కిలోమీటర్‌కు రూ.16.. ఎక్కడో తెలుసా?

సైకిల్ తొక్కితే డబ్బులు ఇస్తారు... ఇది నిజం. నెదర్లాండ్స్‌లో ఈ విధానం అమల్లో ఉంది. ఈ ఒక్కటే కాదు ఇంకా ఎన్నో దేశాలు సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తున్నాయి.జిమ్‌లో కాకుండా రోడ్లమీద మీరు సైకిల్ తొక్కి ఎన్నిరోజులైంది?.. అబ్బో చాలా రోజులే అయ్యిందండీ.. అప్పుడెపుడో స్కూల్‌లో ఉండగా రోజూ తొక్కేవాళ్లం. ఆ తర్వాత ఒకటి రెండుసార్లు తొక్కినట్టు గుర్తు అంతే. ఇప్పుడైతే జిమ్‌లో ఉన్న సైకిల్ తొక్కడమే. బయటికి వెళ్తే మా బైక్ లేదా కార్‌లో వెళ్తాం... పట్టణాల్లో వందకు 95 మంది ఇచ్చే సమాధానం ఇదే ఉంటుంది. గ్రామాల్లోనూ సైకిల్ తొక్కే సంస్కృతి క్రమంగా దూరమైపోతోంది. స్కూల్ విద్యార్థులకే పరిమితమైపోతోంది. కానీ.. విదేశాల్లో అలాకాదు. చాలాదేశాల్లో ప్రజలు సైక్లింగ్‌ను ఒక అలవాటుగా మార్చుకున్నారు. దీనికి తగ్గట్టే ప్రభుత్వాలు సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహిస్తాయి. వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి.

నెదర్లాండ్స్ రూటేవేరు..
సైకిల్ వినియోగం విషయంలో ప్రపంచంలో ఎవరైనా నెదర్లాండ్స్ ప్రజలకన్నా వెనుకే. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న జనాభా కంటే సైకిళ్లే ఎక్కువట. అక్కడి ప్రజలకు సైకిల్ తొక్కడమంటే మహా సరదా. ఆఫీస్‌కు, పక్క ఊర్లో ఉన్న చుట్టాల ఇళ్లకు.. ఇలా సమీప ప్రాంతాలకు సైకిల్‌పై రయ్యిన వెళ్లిపోతుంటారు. కార్లు, బైక్‌ల కన్నా సైకిల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.
* ప్రభుత్వం కూడా సైకిల్ తొక్కడాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తుంది. సైకిలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుంది.
* మన దగ్గర రోడ్లపై బస్సుల కోసం బస్‌బే లు ఉన్నట్టు.. నెదర్లాండ్స్‌లో రోడ్లపై సైకిళ్ల కోసం ప్రత్యేకంగా దారులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కేవలం సైకిళ్లనే అనుమతి ఇస్తారు. వేరే వాహనాలకు అనుమతి ఉండదు.
* సైకిళ్లకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కూడా ఉంటుంది.
* నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో పనిచేసే ఉద్యోగులు సైకిల్‌పై ఆఫీస్‌కు వెళ్లడానికే ఇష్టపడతారు. స్థానికంగా నివాసం ఉండేవారిలో అత్యధికశాతం మంది సైకిల్ సవారీ చేస్తారు. రాజధాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేవారు కూడా తమ ప్రయాణాలను సగం సైకిల్‌పైనే చేస్తారట.
* అందుకే నెదర్లాండ్స్‌ను నంబర్‌వన్ బైస్కిలింగ్ నేషన్ అని పిలుస్తుంటారు.
సైకిల్ తొక్కండి డబ్బులిస్తాం..
సైకిల్ తొక్కడాన్ని మరింత ప్రోత్సహించే చర్యల్లో భాగంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగులు ఒక కిలోమీటర్ సైకిల్ తొక్కితే రూ.16 (0.22 డాలర్లు) చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఈ మొత్తం ఆదాయపన్ను నుంచి మినహాయింపు రూపంలో అందుతుంది. అంటే ఏడాదికి ఒక వంద కిలోమీటర్లు సైకిల్ తొక్కితే రూ.1600 మేర ఆదాయపన్ను తగ్గుతుందన్నమాట.
* ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లే సమయంలో సైకిల్ ఉపయోగిస్తేనే ఈ వెసులుబాటు కలుగుతుంది. వ్యక్తిగత అవసరాలకు సైకిల్ తొక్కితే ఇవ్వరు.
* ఒక ఉద్యోగి ఎన్ని కిలోమీటర్లు తొక్కారో కంపెనీ గుర్తించి.. ఆ మొత్తాన్ని కంపెనీ నే చెల్లిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి క్లయిమ్ చేసుకుంటుంది.
* ఈ విషయంలో ఉద్యోగులను ప్రోత్సహించాలని, వారు ఎంతమేర సైకిల్ ప్రయాణం చేస్తున్నారో గుర్తించి పన్ను మినహాయింపు ఇప్పించాలని ప్రభుత్వం దేశంలోని కంపెనీలన్నింటికీ విజ్ఞప్తి చేసింది.
ఇతర దేశాల్లోనూ..
సైకిల్ తొక్కడాన్ని ప్రోత్సహించే సంప్రదాయం ఇతర దేశాల్లోనూ ఉంది. బ్రిటన్‌లో ఆఫీస్‌కు సైకిల్‌పై వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఉంటాయి. కంపెనీలు డిస్కౌంట్‌పై సైకిళ్లు, ఇతర వస్తువులను అందిస్తాయి.
* బెల్జియంలో నెదర్లాండ్స్ తరహాలో ఆదాయపన్ను తగ్గింపు స్కీమ్ అమల్లో ఉంది.
* యూరప్‌లోని పలు దేశాలు సైతం టాక్స్ తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)