క‌న్న బిడ్డ‌నే నీళ్ల డ్ర‌మ్ములో ప‌డేసి...

ఓ దంప‌తులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట ఓ బిడ్డ పుట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇంకో బిడ్డ పుట్టాడు. అయితే రెండో బిడ్డ పుట్టాక ఆ దంప‌తుల మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. భర్త తనను, రెండో బిడ్డను సరిగా చూసుకోవడం లేదని ఆ ఇల్లాలు తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైంది. తన భర్తకు ఇష్టంలేని ఆ రెండో బిడ్డ తనకూ అవసరం లేదనుకుంది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో బిడ్డను నీళ్ల డ్రమ్ములో పడేసి ప్రాణాలు తీసింది. ఏమీ ఎరుగనట్లు తన బిడ్డనెవరో చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. పోలీసుల విచార‌ణ‌లో తల్లే అసలు హంతకురాలని తేల్చారు.

ఈ ఘోర ఉదంతం ఫిబ్రవరి 26న చిత్తూరు జిల్లాలోని ఎస్‌ఆర్‌పురం మండలం పిల్లిగుండ్లపల్లె ఒంటిల్లు(దళితవాడ)లో జరిగింది. పసికందును హతమార్చింది కన్నతల్లేనని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. చివరికి ఆ తల్లిని కటకటాల వెనక్కి నెట్టారు. ఈ విషయాన్ని కార్వేటినగరం సీఐ చల్లనిదొర బుధవారం ద్రువీకరించారు. సీఐ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం...పిల్లిగుండ్లపల్లెకు చెందిన నాగరాజు, రాజమ్మ దంపతుల కుమార్తె భువనేశ్వరి అదే మండలంలోని ఎగువ మెదవాడ దళితవాడకు చెందిన వై.వినోద్‌కుమార్‌ ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందే వీళ్లిద్దరు ఇష్టపడి కలసి వెళ్లిపోవడంతో భువనేశ్వరి కుటుంబీకులు చిత్తూరు వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో వినోద్‌కుమార్‌పై ఫిర్యాదు కూడా చేశారు. కేసు నమోదై వినోద్‌కుమార్‌ రిమాండ్‌కు సైతం వెళ్లి వచ్చారు. అనంతరం భువనేశ్వరి, వినోద్‌కుమార్‌లు పొదటూరుపేటలో వివాహం చేసుకున్నారు. ఎగువమెదవాడ దళితవాడలో కాపురం పెట్టారు.

వీరికి మొద‌టి సంతానం మగబిడ్డ పుట్టాడు. మొదటి కాన్పుకు భువనేశ్వరి భర్త వినోద్‌కుమార్‌ అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. తర్వాత భువనేశ్వరికి పుట్టింటితో మళ్లీ అనుబంధం ఏర్పడింది. తిరిగి రెండోసారి గర్భం దాల్చింది. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రెండో కాన్పు జరిగింది. రెండో కాన్పులో కూడా మగబిడ్డ పుట్టాడు. ఆ తర్వాత వినోద్‌కుమార్‌ రెండో బిడ్డపై అంత ప్రేమ చూపేవాడు కాదు. ఆ బిడ్డ‌ను స‌రిగ్గా ప‌ట్టించుకునేవాడు కాదు. దీంతో భువనేశ్వరి తీవ్ర ఆందోళన చెందేది. రెండో బిడ్డ పుట్టడం వల్లే భర్త మారిపోయాడని, ఎలాగైనా ఆ బిడ్డని అంతమొందించాలనుకని భువనేశ్వరి నిర్ణయించుకుంది. ఫిబ్రవరి 26న కుటుంబీకులు అంతా పనులకు బయటకు వెళ్లాక భువనేశ్వరే తన రెండవ బిడ్డను ఎత్తుకెళ్లి ఇంటి ఆవరణలోని నీళ్ల డ్రమ్‌లో పడేసి మూత పెట్టి వచ్చేసింది. తీరా ఏమీ తెలియనట్టు ఉండిపోయింది.

త‌న బిడ్డ‌ను ఎవ‌రో చంపేశార‌ని న‌మ్మబ‌లికి...
తన బిడ్డ కనిపించడం లేదని ఏడ్చి చివరికి నీళ్ల డ్రమ్‌లో శవమై కనిపించినట్లు ఇంట్లోవారికి, ఇరుగుపొరుగుకు చెప్పింది. ఎవరో తన బిడ్డను నీటి డ్రమ్ములో పడేసి చంపేశారని ఎస్‌ఆర్‌పురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కార్వేటినగరం సీఐ చల్లనిదొర దర్యాప్తు చేశారు. సీఐ దర్యాప్తులో తల్లే ఈ దురాగతానికి పాల్పడినట్లు తేలింది. ఈనెల 7న ఎస్‌ఆర్‌పురం పోలీస్‌ స్టేషన్‌ వద్ద భువనేశ్వరిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచి, రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)