బద్దలు కొట్టలేని... రికార్డులేంటో తెలుసా!

క్రికెట్‌ చరిత్రలో ఎందరో రికార్డులు నెలకొల్పారు... మరెందరో వాటిని తిరగరాశారు. కానీ... క్రికెట్‌ చరిత్రలో సమీప భవిష్యత్తులో బద్దలు కొట్టడానికి సాధ్యం కాని రికార్డుల గురించి తెలుకోవాలని ఉందా.... అయితే ఈ కథనం చదవండి.
అత్యధిక ఫస్ట్ క్లాస్ సెంచరీలు
క్రికెట్‌లో ఇంతవరకు ఎవరూ సాధించలేనన్ని ఫస్ట్‌ క్లాస్ సెంచరీలు ఇంగ్లాండ్‌కు చెందిన జాక్‌ హాబ్స్ సాధించాడు. ఈయన అంతర్జాతీయ, జాతీయ మ్యాచ్‌లలో సగటున 50.70 పరుగులతో 199 శతకాలు సాధించాడు. ఇది చిరస్థాయిగా ఉండే రికార్డని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

అత్యధిక అంతర్జాతీయ పరుగులు
అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ తెందుల్కర్‌ చెరగని ముద్ర వేశారు. టెస్ట్, వన్డే మ్యాచ్‌లు కలిపి 34,357 పరుగులు చేశాడు సచిన్‌. టెస్ట్ మ్యాచ్‌లలో 15,921, వన్డే మ్యాచ్‌లలో 18,426 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డుకు చేరువలో ఏ క్రికెటరూ లేడు.
అత్యధిక టెస్ట్ సగటు స్కోర్‌
టెస్ట్ కెరీర్‌లో 99.94 సగటు నమోదు చేశాడు బ్రాడ్‌మన్‌. ఆ తర్వాత వచ్చినవాళ్లెవరూ కనీసం 70 మించి సగటు నమోదు చేయలేకపోయారు. 15 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన సమయంలో ఛతేశ్వర్‌ పుజరా ఒక్కడే బ్రాడ్‌మన్‌కు సమీపంలోకి వచ్చాడు. దీంతో బ్రాడ్‌మన్‌ రికార్డు కలలో కూడా చెరిపేయలేని రికార్డని విశ్లేషకులు అంటుంటారు.
అత్యధిక అంతర్జాతీయ వికెట్లు
ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ ముత్తయ్య మురళీధరన్‌. ఈ శ్రీలంకన్‌ స్పిన్నర్‌ టెస్ట్, వన్డేలలో కలిపి 1,347 వికెట్లు పడగొట్టాడు. వాటిలో 800 వికెట్లు టెస్టుల్లో, 534 వికెట్లు వన్డేల్లో, 13 వికెట్లు టీ20లో తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు మురళీధరన్, షేన్‌వార్న్ మాత్రమే 1000 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఉన్నారు.
ఒకే మ్యాచ్‌లో 19 వికెట్లు
టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన జిమ్‌ లేకర్‌ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 1954లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 19 వికెట్లు తీశాడు. ఇది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రికార్డని క్రికెట్‌ విశ్లేషకుల అభిప్రాయం.
అత్యధిక ఫస్ట్‌ క్లాస్‌ వికెట్లు
ఫస్ట్ క్లాస్‌ మ్యాచుల్లో 4204 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ విల్ఫడ్‌ రోడ్స్‌ రికార్డు సృష్టించారు. అత్యధిక వికెట్లతోపాటు బ్యాటింగ్‌లో 39,969 పరుగులు సాధించాడు. గత 500 మ్యాచ్‌లను గమనిస్తే ఈ రికార్డు ఎప్పటికీ చెరిగిపోదనిపిస్తుందని క్రికెట్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎక్కువ సంవత్సరాలు టెస్ట్‌ క్రికెట్‌ ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పిందీ విల్ఫడ్‌ రోడ్సే. 30 సంవత్సరాలు సుదీర్ఘంగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఘనత ఈయన సొంతం. అన్ని సంవత్సరాలపాటు ఫిట్‌నెస్‌తో ఆటను కొనసాగించడం చాలా కష్టతరమైన విషయం. ఇది కలకాలం చెరిగిపోని రికార్డుగా క్రికెట్‌ ప్రేమికులు భావిస్తుంటారు.
400 పరుగులతో అజేయంగా
ఒకే ఇన్నింగ్స్‌లో 400ల వ్యక్తిగత పరుగులు చేసి అజేయంగా నిలిచి రికార్డు సృష్టించాడు బ్రియన్‌ లారా. ఈ స్కోర్‌ చెయ్యడానికి లారాకి మూడు రోజులు పట్టింది. ప్రస్తుత రోజుల్లో ఏ జట్టు మూడు రోజులపాటు ఇన్నింగ్స్‌ కొనసాగించడం లేదు. కాబట్టి ఈ రికార్డు కూడా దాదాపు అసాధ్యమేనని విశ్లేషకుల అభిప్రాయం. 
వరుసగా మూడుసార్లు
ప్రపంచ కప్‌ టైటిల్‌ని వరుసగా మూడుసార్లు సాధించిన దేశం ఆస్ట్రేలియా. 1999, 2003, 2007లో వరుసగా ప్రపంచ కప్‌ గెలుచుకొంది. ఈ రికార్డును చెరిపేయడం చాలా కష్టమని క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత జట్ల ఆటతీరు చూస్తే ఒక్క టైటిల్‌ గెలవచ్చు. రెండోది కొంచెం కష్టమైనా ప్రయత్నించొచ్చు కానీ.. ఇలా మూడుసార్లు వరుసగా గెలవడం అసాధ్యం అనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. 
పదో ఆటగాడిగా దిగి శతకం
జట్టులో తొమ్మిది మంది వెనుదిరిగిన తర్వాత పదో ఆటగాడిగా దిగిన వ్యక్తి ఒత్తిడి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇంగ్లాండ్‌కు చెందిన వాల్టర్‌ రెడ్‌ అలా పదో స్థానంలో దిగి సెంచరీ కొట్టాడు. 1884లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో వాల్టర్‌ రెడ్‌ 20 బౌండరీలతో 117 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. 
తక్కువ - ఎక్కువ
ఓ బౌలర్‌ 28 పరుగులు ఇచ్చి 9 వికెట్లు పడగొట్టాడు... అద్భుతమైన బౌలింగ్‌ కదా. ఇంగ్లాండ్‌కు చెందిన జార్జ్‌ లోమన్‌ 1896లో జోహనస్‌బర్గ్‌లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ ఫీట్‌ సాధించాడు. ఆయన మొత్తం కెరీర్‌లో 18 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడితే 10.75శాతం బౌలింగ్‌ సగటుతో 112 వికెట్లు తీసి రికార్డు నెలకొల్సారు. ఇప్పటివరకూ ఏ ఒక్క బౌలరూ ఈ రికార్డును తిరగరాయలేకపోయారు.
ఐదు పదుల వయసులో
మొదటి తరం క్రికెట్‌కు చెందిన విలియం గిల్‌బర్ట్‌ గ్రేస్‌ అత్యధిక వయసు గల కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఐదు పదుల వయసులో ఆయన టెస్ట్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 54 వేల పైచిలుకు పరుగులు, 2,800 వికెట్లు తీశారు. అంత వయసులో ఆయన ఆటను కొనసాగించారంటే సామాన్యమైన విషయం కాదని, అంతటి ఫిట్‌నెస్‌ కలిగిన ఆటగాళ్లు ప్రస్తుతం లేరని విశ్లేషకుల అభిప్రాయం.
జట్టు స్కోరు - ఒకరి స్కోరు
ఓ ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి జట్టు సాధించిన పరుగుల కన్నా... ఎక్కువ వ్యక్తిగత పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు రెజినాల్డ్‌ టిప్‌ ఫోస్టర్‌. 1903లో ఆస్ట్రేలియాతో ఓ ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. అనంతరం బరిలో దిగిన ఇంగ్లాండ్‌ జట్టులో టిప్‌ 287 పరుగులు చేశాడు. టిప్‌ ఈ రికార్డు నెలకొల్పి ఇప్పటికి 116 సంవత్సాలైనా అది అలానే కొనసాగతూ ఉండటం విశేషం. 
స్కోరులో సగం ఒకరే...
టెస్ట్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌లో జట్టు సాధించిన మొత్తం పరుగుల్లో 67.34 శాతం పరుగులు ఒకే ఆటగాడు చేశాడంటే పెద్ద విషయమే కదా. ఆస్ట్రేలియాకి చెందిన చార్లెస్‌ బనర్మాన్‌ పేరిట ఈ రికార్డు ఉంది. ఆస్ట్రేలియా మొత్తం 245 పరుగులు చేయగా, చార్లెస్‌ 165 పరుగులు చేశాడు. ఈయన రికార్డును ఇప్పటివరకు ఎవరూ చెరపలేకపోయారు. 1877లో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ మొదటి బంతి ఆడిన ఘనత కూడా ఈయన సొంతం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)