మసూద్‌ అంతర్జాతీయ ఉగ్రవాదే.. భార‌త్‌కు బాస‌ట‌గా నిలిచిన అమెరికా

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్‌ డిమాండ్‌కు అమెరికా పూర్తిగా బాసటగా నిలిచింది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్‌ను ప్రకటించేందుకు విస్పష్ట ఆధారాలు ఉన్నాయని అగ్రదేశం ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కీలక భేటీకి ఒక రోజు ముందు జైషే చీఫ్‌పై అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ భారత్‌లో పఠాన్‌కోట్‌ వైమానిక స్ధావరంపై దాడి, జమ్మూ, యూరిలో సైనిక పోస్టులపై దాడులు, భారత పార్లమెంట్‌పై దాడి సహా ఇటీవల పుల్వామాలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన ఉగ్రదాడికీ బాధ్యుడని భారత్‌ చెబుతోంది.

కాగా మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మూడు శాశ్వత సభ్య దేశాలు అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు ఇప్పటికే తీర్మానం చేసిన విషయం తెలిసిందే. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని గతంలో ఈ మూడు దేశాలు చేసిన పలు ప్రయత్నాలను చైనా నిలువరించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు సరైన ఆధారాలు లేవంటూ ఈ ప్రతిపాదనను చైనా వీటో చేస్తూ వచ్చింది. కాగా పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇండో-పాక్‌ ఉద్రిక్తతల నడుమ మసూద్‌పై తీవ్ర చర్యలు చేపట్టే ప్రతిపాదనను ఈసారి చైనా అడ్డుకోబోదని అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ భావిస్తున్నాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)