నన్ను దూషించడం మరీ దారుణం: రేణు

‘నెటిజన్లు దూషిస్తున్నా సెలబ్రిటీలు మౌనంగా భరించాలా? ఇదేం దారుణం’అని నటి రేణూ దేశాయ్‌ అంటున్నారు. ఇటీవల ఆమె ఓ టీవీ ఛానెల్‌తో కలిసి రైతుల సమస్యల్ని తెలుసుకోవడానికి పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు ఆమె అనుచిత సందేశాలు పంపారు. ‘నేను ఓ రైతు కొడుకును. దాదాపు 20 ఏళ్లుగా మేం వ్యవసాయం చేస్తున్నాం. రైతుల కోసం మీరేం చేశారు? (అసభ్యకర భాషలో..) ఏమీ చేయలేదు. డబ్బుల కోసం మేకప్‌ వేసుకుని కెమెరా ముందు డ్రామా చేశారంతే’ అని ఓ నెటిజన్‌, ‘పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్యవి కాబట్టి మీకు ఈ మాత్రం గౌరవం ఇస్తున్నాం. లేకపోతే మీకు ఎటువంటి గుర్తింపు లేదు’ అని మరో నెటిజన్‌ రేణుకు సందేశాలు పంపారు. వీటికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ను ఆమె మంగళవారం పోస్ట్‌ చేశారు. అదే ఓ సెలబ్రిటీ ఇలా మాట్లాడి ఉంటే చాలా హంగామా చేసేవారు కదా అని ప్రశ్నించారు.

‘ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా ఇలాంటి (నెటిజన్‌లా) పదాల్ని సోషల్‌మీడియాలో ఒక అభిమాని మీద వాడితే ఏం జరుగుతుందో మీ అందరికీ బాగా తెలుసు. అది ఒక బ్రేకింగ్‌ న్యూస్‌ అవుతుంది. నిర్దయగా చాలా దారుణంగా ఆ సెలబ్రిటీని విమర్శిస్తూ దూషిస్తారు. కానీ అదే పదం ఒక మామూలు మనిషి ఒక సెలబ్రిటీ మీద వాడితే వాళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్పందించకూడదు. ఏంటి ఇది?అంటే ఓ సెలబ్రిటీని ఎవరు పడితే వాళ్లు, ఏది పడితే అది అనొచ్చు, దూషించొచ్చు. అవన్నీ ఆ సెలబ్రిటీ భరించాలి, సహించాలి. ఎలాంటి భావోద్వేగానికి గురి కాకూడదు. అంటే మామూలు మనుషులకు మాత్రమే భావాలు, భావోద్వేగాలు ఉంటాయి. సెలబ్రిటీలకు ఉండకూడదు. ప్రతిరోజు మీ సోషల్‌మీడియాలో ఎవరో ఒకరు ఏదో రకంగా మిమ్మల్ని దూషిస్తూ ఏవేవో పోస్ట్‌లు పెడుతూ ఉంటే వాటిని చదువుతున్నప్పుడల్లా మీకు ఎలా ఉంటుంటో ఒక్కసారి ఊహించుకోండి’.

‘అది కూడా రైతులకు ఏదో రకంగా సాయపడాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని విమర్శిస్తూ నన్ను దూషించడం మరీ దారుణం. నేను డబ్బు కోసం చేస్తున్నానా, పేరు కోసం చేస్తున్నానా, ఇంకేదైనా కారణం కోసం చేస్తున్నానా అన్నది ముఖ్యం కాదు. దాని వల్ల మన రైతుల సమస్యలు ఎంత వరకూ బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు పెడుతున్నాం అన్నది ముఖ్యం. ఏదో ఒక రోజు ఈ ఊరూపేరూ లేని ఈ విమర్శకులు తప్పు తెలుసుకుని వారి శక్తి సామర్థ్యాల్ని ఇలా అనవసరంగా సెలబ్రిటీలను దూషించడం కోసం పెట్టకుండా ఏదో మంచి పనిపై దృష్టి పెడితే మంచిది’ అంటూ రేణు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)