పొలాచ్చిలో మాన‌వ మృగాలు.. 60 మంది మ‌హిళ‌ల‌పై లైంగిక‌వేధింపులు

స్నేహం పేరుతో యువ‌తుల‌ను ఆకర్షించి.. ఏకాంత ప్ర‌దేశానికి పిలిపించుకొని.. లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డి.. అస‌భ్య ఫొటోలు,వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ డ‌బ్బు గుంజుతున్న ఓ ముఠా అరాచ‌కాలు త‌మిళ‌నాడులోని పొలాచ్చిలో వెలుగులోకి వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌నపై రాష్ట్ర‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్య‌మం న‌డుస్తోంది. త‌మిళ‌నాడులోని పొలాచ్చి ప‌ట్ట‌ణంలో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఒక ముఠా దాదాపు ఏడేళ్లుగా మ‌హిళ‌ల‌ను లైంగికంగా వేధిస్తున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ముఠా చేసిన అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ ముఠాలో ఉన్న‌వారంతా యువ‌కులే అయినా.. వారిలో కొంద‌రు రాజ‌కీయ‌, వ్యాపార ప్ర‌ముఖులు ఉండ‌టం, బాధితుల‌ను, పోలీసుల‌ను బెదిరిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ముఠా స‌భ్యుల‌ను క‌ఠినంగా శిక్షించాలంటూ త‌మిళ‌నాడువ్యాప్తంగా ర్యాలీలు, ధ‌ర్నాలు సాగుతున్నాయి. సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ ఆందోళ‌న‌ల్లో పాలుపంచుకుంటున్నారు. వీరు ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 60 మంది మ‌హిళ‌లు, యువ‌తుల‌ను లైంగికంగా వేధించిన‌ట్టు తేలింది.

ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే
పొలాచ్చికి చెందిన ప్రియా అనే కాలేజీ విద్యార్థినికి కొన్నాళ్ల‌కింద‌ట శ‌బ‌రిరాజ‌న్ అనే వ్య‌క్తి ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌యం అయ్యాడు. త‌న‌ను ఓ సివిల్ ఇంజినీర్‌గా ప‌రిచ‌యం చేసుకున్నాడు. త‌రుచూ చాటింగ్ చేస్తుండ‌టంతో వారి మ‌ధ్య స్నేహం బ‌ల‌ప‌డింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 12న కాలేజీ మ‌ధ్య‌లో బంక్ కొట్టి పొలాచ్చిలోని ఓ ఏకాంత ప్ర‌దేశానికి ర‌మ్మ‌న్నాడు. ప్రియా అక్క‌డికి వెళ్లి శ‌బ‌రిరాజ‌న్ ను క‌లుసుకుంది. కాసేపు మాట్లాడిన త‌ర్వాత‌.. వేరే చోటికి వెళ్దామ‌ని చెప్పి కారులోకి ఎక్కించుకున్నాడు. ఆ యువ‌తి ఎక్క‌గానే శ‌బ‌రిరాజ‌న్ స్నేహితులైన తిరున‌వుక్క‌ర‌సు, వ‌సంత‌కుమార్‌, స‌తీష్ కారులోకి ఎక్కారు. ఎంత‌చెప్పినా విన‌కుండా కారును స్టార్ట్ చేశారు. న‌డుస్తున్న కారులోనే.. న‌లుగురు క‌లిసి ప్రియపై లైంగిక వేధింపుల‌కు దిగారు. అస‌భ్యంగా ఫొటోలు, వీడియోలు తీసి.. ఆమెను ఓ నిర్మానుష్య ప్ర‌దేశంలో వ‌దిలిపెట్టి వెళ్లారు.

* ఆ త‌ర్వాత శ‌బ‌రిరాజ‌న్ ఆమెకు ఫోన్ చేసి డ‌బ్బులు డిమాండ్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. అడిగినంత ఇవ్వ‌కుంటే ఫొటోలు, వీడియోల‌ను ఇంట‌ర్నెట్‌లో పెడ‌తామంటూ బెదిరించారు. ప్రియ మొద‌ట్లో డ‌బ్బు ఇచ్చినా, వారి వేధింపులు పెర‌గ‌డంతో విష‌యం మొత్తాన్ని త‌న అన్న సుభాష్‌కు వివ‌రించింది. దీంతో సుభాష్ వెళ్లి శ‌బ‌రిరాజ‌న్‌తో గొడ‌వ‌కు దిగాడు. శ‌బ‌రిరాజ‌న్ అత‌డిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ప్రియ‌, సుభాష్ క‌లిసి ఫిబ్ర‌వ‌రి 25న న‌లుగురిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
* పోలీసులు మొద‌ట శ‌బ‌రిరాజ‌న్, వ‌సంత‌కుమార్‌, స‌తీశ్‌ను అరెస్ట్ చేశారు. తిరున‌వుక్క‌ర‌సును ఆ త‌ర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా మొత్తానికి తిరున‌వుక్క‌ర‌సు నాయ‌కుడ‌ని గుర్తించారు. ఇత‌డే ఫేస్‌బుక్‌లో అమ్మాయిల‌తో స్నేహం చేస్తాడ‌ని, వారు ట్రాప్‌లో ప‌డ్డ త‌ర్వాత శబ‌రిరాజ‌న్‌ను రంగంలోకి దింపుతాడ‌ని తేలింది.
* స‌తీశ్‌కు పొలాచ్చిలో ఒక రెడీమేడ్ బ‌ట్ట‌ల దుకాణం ఉంది. శ‌బ‌రిరాజ‌న్ ఒక ఫైనాన్షియ‌ర్. తిరున‌వుక్క‌ర‌సు, వ‌సంత్‌కుమార్ మ‌హిళ‌లు, యువ‌తులను బెదిరించి డ‌బ్బులు తీసుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు.
* పోలీసులు ఈ న‌లుగురిపై ప‌లు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్ప‌టికే డేటా మొత్తాన్ని డిలీట్ చేసిన‌ట్టు గుర్తించారు. దానిని రిట్రివ్ చేయడానికి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
ఆడియో క్లిప్‌తో బండారం బ‌ట్ట‌బ‌య‌లు

ఈ ముఠాలో కేవ‌లం న‌లుగురే లేర‌ని.. దీనివెనుక అధికార ప‌క్షానికి చెందిన రాజ‌కీయ నాయ‌కులు, ఇత‌రులు కూడా ఉన్నార‌ని ఓ ఆడియో క్లిప్‌తో వెళ్ల‌డైంది. ప్ర‌ధాన నిందితుడైన తిరున‌వుక్క‌ర‌సు మాట్లాడిన ఒక ఆడియో సోష‌ల్‌మీడియాలో విడుద‌లైంది. “ఒక యువ‌తి చెప్పిన మాట‌లు విని మా మీద కేసు పెట్టారు. మీ డిపార్ట్‌మెంట్‌లో 99 మంది మాకోసం ప‌నిచేస్తున్నారు. కాబ‌ట్టి మా వాళ్ల‌ను ఇబ్బంది పెట్టొద్దు. ఈ కేసు హ‌డావుడి ముగిసిన త‌ర్వాత నేను వ‌చ్చి లొంగిపోతా. నా మాట విన‌కుంటే అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల్లో ఉన్న మా పెద్ద‌వాళ్ల‌తో మాట్లాడించాల్సి ఉంటుంది” అని ఆ ఆడియోలో హెచ్చ‌రించాడు. ఈ క్లిప్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేయ‌డంతో రాష్ట్ర‌వ్యాప్తంగా అల‌జ‌డి మొద‌లైంది.

* నిందితుల‌ను ర‌క్షించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, రాజ‌కీయ ఒత్తిడుల కార‌ణంగా కేసు ద‌ర్యాప్తు మెళ్లిగా సాగుతుంద‌ని నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. కేసును సీబీఐకి అప్ప‌గించాల‌నే డిమాండ్లు మొద‌ల‌య్యాయి.
* దీంతో పోలీసులు మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేయ‌గా.. అధికార ఏఐడీఎంకే పార్టీ యువ‌జ‌న విభాగానికి చెందిన ఏ నాగ‌రాజు అనే వ్య‌క్తి ఈ ముఠాకు అండ‌గా ఉన్నట్టు తేలింది.
* ఈ ముఠా ఏడేళ్లుగా ఇలాంటి అరాచ‌కాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, దాదాపు 200 మందిని ఇలా వేధించార‌ని గుర్తించారు. బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాల‌ని కోరారు.

రాజ‌కీయ దుమారం
ఈ కేసు రాజ‌కీయంగా అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టింది. ఈ విష‌యంపై ముందుగా సినీన‌టుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత క‌మ‌ల్‌హాస‌న్ స్పందించారు. ఏఐడీఎంకేకు చెందిన యువ‌జ‌న విభాగం నాయ‌కుడు నాగ‌రాజు ఈ దురాగ‌తాల‌కు స‌పోర్ట్ చేస్తున్నాడ‌ని, అత‌డికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని అభిమానులు, కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చాడు. ఆ త‌ర్వాత డీఎంకే, ఇత‌ర పార్టీలు గొంతు క‌లిపాయి. రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెళ్లువెత్తాయి. దీంతో నాగ‌రాజును పార్టీ నుండి స‌స్పెండ్ చేస్తున్నామ‌ని, స‌భ్య‌త్వాన్ని తొల‌గిస్తున్నామ‌ని త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి, ఏఐడీఎంకే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌న్నీర్ సెల్వం ప్ర‌క‌టించారు. నాగ‌రాజును పోలీసులు అరెస్టు చేశారు. అత‌డితోపాటు మ‌రో ముగ్గురు క‌లిసి బాధితురాలు ప్రియ సోద‌రుడు సుభాష్ పై దాడిచేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. వీరికి నేరుగా లైంగిక వేధింపుల‌తో సంబంధం లేద‌ని, కేవ‌లం బెదిరిస్తుంటార‌ని తేలింది. మొత్తంగా పోలీసులు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారిలో న‌లుగురు బెయిల్‌పై బ‌య‌టికి రాగా.. ప్ర‌ధాన నిందితులు న‌లుగురు క‌స్ట‌డీలో ఉన్నారు. వీరిపై గూండా యాక్ట్ విధించాల‌ని పొలాచ్చి మెజిస్ట్రేట్ కోర్టు పోలీసుల‌కు సూచించింది.
* లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ ఈ కేసు తమ పార్టీకి న‌ష్టం క‌లిగిస్తుంద‌ని ఏఐడీఎంకే భ‌య‌ప‌డుతోంది. ఈ కేసులో ఒక మంత్రిపైనా అభియోగాలు రావ‌డం, అధికార ప‌క్షానికి చెందిన ఇద్ద‌రు సీనియ‌ర్ నాయ‌కుల ప్రమేయం ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో ఆ పార్టీకి నిద్ర ప‌ట్ట‌డం లేదు.
సోష‌ల్ మీడియాలో చ‌ర్చ
ఈ ముఠా అరాచ‌కాల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. పొలాచ్చి గ్యాంగ్‌, ప‌నిష్ పొలాచ్చి గ్యాంగ్‌, సెక్సువ‌ల్ అబ్యూస్ గ్యాంగ్ వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్ అవుతున్నాయి. సిద్ధార్థ్ వంటి హీరోలు వ‌ర‌ల‌క్ష్మి వంటి ప‌లువురు హీరోయిన్లు, న‌టులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, విద్యావేత్త‌లు ఈ ముఠాను శిక్షించాలంటూ ఉద్య‌మిస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)