అసలు సిసలు సర్టికల్ స్ట్రయిక్స్ తెలుసా..? ఓ ఖతర్నాక్ రియల్ స్టోరీ..!

సర్జికల్ స్ట్రయిక్స్… సైన్యానికి పూర్తి స్వేచ్ఛ… ఈమధ్యకాలంలో దేశంలో బాగా బాగా వినిపిస్తున్న పదాలు… అసలు ఇలాంటి దాడులకు ఇజ్రాయిల్ సీక్రెట్ సర్వీసు మొసాద్ పెట్టింది పేరు… మనం మొన్నటి సర్జికల్ ఎయిర్ స్ట్రయిక్స్‌కే ఛాతీలు పొంగేలా గొప్పలు చెప్పుకుంటున్నాం గానీ, కొన్ని ఇజ్రాయిలీ సర్జికల్ స్ట్రయిక్స్ గురించి చెప్పుకోవాలి ముందు… తమ దేశానికి ప్రమాదంగా భావిస్తే చాలు, మొసాద్ ఏ స్థాయిలోనైనా సరే, ఏ దేశానికి వెళ్లయినా సరే దాడులు చేస్తుంది… ఈ మొసాద్ ప్రపంచంలోకెల్లా డెడ్లీ ఆర్గనైజేషన్… మన గూఢచర్య సంస్థ రా ప్రతినిధులకు కూడా అది శిక్షణ ఇస్తున్నది… అనేక సందర్భాలలో ఇండియా కోరిన ప్రతి అసైన్‌మెంట్‌లోనూ సాయం చేసింది… ప్రపంచం మొత్తాన్ని వణికించే ఐసిస్ ఈ మొసాద్ జోలికి మాత్రం పోదు… సో, ఈ మొసాద్ గురించిన ఓ కథ చెప్పుకుందాం… నిజానికి కథ కాదు, ఒళ్లు గగుర్పొడిచే రియల్ స్టోరీ… తొలుత ఓసారి ఉత్తర కొరియాకు వెళ్లొద్దాం…

2004… ఏప్రిల్ 22… ఇప్పుడు అమెరికాను గంగవెర్రులెత్తిస్తున్న ఉత్తర కొరియాలోని ఉత్తర ప్రాంతం అది… ఒక రైలు పేలిపోయింది… అది ఎంత భారీ పేలుడు అంటే రిక్టర్ స్కేల్‌పై 3.6 సూచించింది… అంటే ఓ భూకంపం స్థాయి… దాదాపు పదివేల మంది నివసించే ఓ సమీప పట్టణం ధ్వంసమైపోయింది… అనేకమంది మరణించారు… ప్రపంచంలోని ఏ న్యూస్ ఏజెన్సీని కూడా అక్కడికి అనుమతించలేదు… ఉత్తర కొరియా బయట ప్రపంచానికి ఏం చెప్పిందో తెలుసా..? ‘‘ఆ రైలులో ద్రవీకృత పెట్రోలియం ఉంది… అది పేలింది…’’ కానీ ఏదో మిస్టరీ ఉంది… కానీ ఏమిటది..? మొసాద్‌కు డౌటొచ్చింది… తవ్వడం మొదలుపెట్టింది… సిరియాకూ ఉత్తర కొరియాకూ నడుమ ఏదో ఉంది అని మొసాద్ డౌట్… సిరియా అంటే తనకు ఎగువన ఉండే దేశం కాబట్టి ఏం జరిగిందో, అక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోక తప్పదు…

ఈ పేలుడు జరిగిన తరువాత ఓ సిరియన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉత్తర కొరియాలో ల్యాండైంది… సహాయక చర్యల కోసం వచ్చి ఉంటుందిలే అనుకున్నారు మొదట్లో… కానీ శవపేటికల్లో కొన్ని మృతదేహాలను తీసుకుపోవటానికి వచ్చింది అది… అణుధార్మిక దుస్తులు ధరించిన కొందరు 12 శవాలను తీసుకుపోయారు… ఇది మరో మిస్టరీగా మారింది… ఆ శవాలు ఎవరివీ…? సిరియన్ అణుశాస్త్రవేత్తలవి… ఆ ప్రభుత్వం రహస్యంగా ఉంచే ఓ సంస్థకు చెందినవాళ్లు… అంటే న్యూక్లియర్ రియాక్టర్ ఏర్పాటుకు ఉత్తర కొరియా సిరియాకు రహస్యంగా సాయం చేస్తున్నదా..? ఇదీ ప్రశ్న…

రెండేళ్లు గడిచిపోయాయి… ఓ సిరియా అణుశాస్త్రవేత్త ఓ బారులో దూరాడు… తాగుతున్నాడు… లోపలికి వచ్చిన ఓ యువతి మీద తన కన్నుపడింది… మాటాముచ్చట కలిపాడు… ఇంకేం, ఆ రాత్రి తనకు స్వర్గమే అనుకుని ఆనందపడ్డాడు… కానీ అదొక వల… ఆమె మొసాద్ మనిషి… వీలైనంతసేపు ఆమె తనతో మాట్లాడుతూ ఉండాలి… ఈలోపు మొసాద్ ఇతర ఏజెంట్లు తన గదిలోకి వెళ్లి సెర్చ్ చేయాలి… అదీ ప్లాన్… మొసాద్ ఏజెంట్లకు తాళాలు తీయడం ఓ లెక్కా..? లక్కీగా వాళ్లకు ఓ ల్యాప్ టాప్ కనిపించింది… తన గదిలోకి ఎవడొస్తాడులే అనే నిర్లక్ష్యంతో హడావుడిగా దాన్ని వదిలేసి వెళ్లాడు ఆ శాస్త్రవేత్త… అందులో నుంచి సమాచారాన్ని కాపీ చేసుకుని, మొసాద్ ఏజెంట్లు వెళ్లిపోయారు… వాళ్ల కనుసైగతో విషయం అర్థం చేసుకుని ఆ లేడీ బై బై చెప్పి బార్ నుంచి నిష్క్రమించింది…

ఆ సమాచారాన్ని విశ్లేషించే పనిలో పడ్డ మొసాద్ ఏజెంట్లకు అన్నీ అసాధారణ అంశాలు తెలిసొచ్చాయి… నిర్మాణంలో ఉన్న ఓ భవనం తాలూకు మ్యాపులు, పిక్చర్లు కనిపించాయి… అది తప్పకుండా న్యూక్లియర్ రియాక్టర్‌కు సంబంధించినవే అని కన్‌ఫరమ్ చేసుకున్నారు… సేమ్ ఉత్తర కొరియాలో ఉన్న రియాక్టర్‌కు నకలు అది… ఊహించిన ప్రమాదం నిజమని తేలింది… అణ్వాయుధాల కోసం ప్లుటోనియమ్ ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు…

ఆపరేషన్ మొదలైంది… ఉపగ్రహాల ద్వారా నిఘా అనేది ఇజ్రాయిల్ ఏనాటి నుంచో చేస్తున్నదే… ఈ రియాక్టర్ ఉనికి గురించి ట్రాకింగ్ స్టార్ట్ చేశారు… ప్రత్యేకంగా కొందరు ఏజెంట్లను సిరియాకు పంపించారు… వాళ్లు పంపిన సమాచారం ప్లస్ ఉపగ్రహాల సాయంతో ఆ రియాక్టర్ ఉనికిని కనిపెట్టారు.,. ప్రధాని ఎదుట రిపోర్టు… ఉన్నత సమావేశం జరిగింది… మొసాద్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు… ఎయిర్ ఫోర్స్ సాయం తీసుకోవాలని చెప్పారు… అసలు ముందుగా అది న్యూక్లియర్ రియాక్టరేనా..? అయితే ఏ స్టేజీలో ఉంది..? మరోసారి కన్‌ఫరమ్ చేసుకోవాలి… ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారం, పిక్చర్లు పాతవి… ఇప్పటికే చాలా అడ్వాన్స్‌డ్ స్టేజీలో నిర్మాణం జరుగుతూ ఉండవచ్చు… ఆగస్టు 2007 లోపు దాన్ని ప్రారంభించాలని సిరియా ప్లాన్… అప్పటికే ఆ గడువు దాటిపోయింది… మరి దాన్ని ధ్వంసం చేస్తే పర్యావరణపరంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయి… ఆపరేషన్‌లో ఉన్న ఒక అణు రియాక్టర్‌ను ధ్వంసం చేయడమంటే మాటలా..? చాలా రిస్కీ…

సర్జికల్ స్ట్రయిక్స్ తరహాలో ఓ వేసవి రాత్రి, ఒక ప్రత్యేక విమానం కొందరు కమెండోలను సదరు రియాక్టర్‌కు కిలోమీటర్ దూరంలో దింపింది… వాళ్లకు అప్పగించిన పనేమిటంటే ఆ రియాక్టర్ చుట్టుపక్కల ఉండే నీటిని, మట్టిని తీసుకురావాలి… తెచ్చారు… ఫోటోలు తీశారు… ఉపగ్రహం కూడా కొన్ని ఫోటోలు పంపింది… అది న్యూక్లియర్ రియాక్టర్ కోసం నిర్మిస్తున్న భవనమే…, కానీ ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు… రేడియా ధార్మికత ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు… అంటే రియాక్టర్ నిర్మాణం పూర్తి కాలేదన్నమాట… సో, ప్రమాదం లేదు, ఎలాగూ ఎడారి ప్రాంతమే… ఇక దాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించారు… చర్చలు, దౌత్యాలు, సంప్రదింపులతో పనికాదని తెలుసు… 2007… సెప్టెంబరు 5… ఎనిమిది ప్రత్యేక యుద్ధవిమానాలు ఇజ్రాయిల్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి బయల్దేరాయి… సిరియన్ రాడార్లను తప్పుదోవ పట్టించేలా ఎటో వెళ్లిపోతున్నట్టుగా విమానాలను నడిపించి, అకస్మాత్తుగా సిరియా వైపు తిప్పారు… ఇజ్రాయిల్ రాజధానిలో ‘ది పిట్’‌గా పేర్కొనే ఓ అండర్ గ్రౌండ్ స్థావరంలో ఉన్నతాధికారుల భేటీ… అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండాలని సైన్యానికి ఆదేశాలు…

అర్ధరాత్రి 12.40 నుంచి 12.53 నడుమ… ఓ సంకేతపదం అరిజోనా అని ‘ది పిట్’కు చేరింది… అంటే మేం రెడీ అన్నట్టు..! వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు… ఏకంగా పదిహేడు క్వింటాళ్ల పేలుడు పదార్థాలను ఆ భవనంపై వదిలారు… తమకు వీసమెత్తు నష్టం లేకుండానే, రియాక్టర్‌ను ధ్వంసం చేసి వెళ్లిపోయాయి విమానాలు… మరుసటిరోజు సిరియన్ అరబ్ న్యూస్ ఏజెన్సీ ఓ వార్తను ప్రచురించింది.,. ‘‘ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు సిరియా ఎయిర్ స్పేస్‌లోకి ప్రవేశించాయి… జనావాసం లేని ఎడారి ప్రాంతంలో కొంత పేలుడుపదార్థాన్ని జారవిడిచాయి… సిరియా ఎయిర్ ఫోర్స్ ప్రతిఘటించింది… ఎదురుదాడికి దిగింది… దీంతో ఇజ్రాయిల్ విమానాలు తోకముడిచాయి…’’ అని ఆ వార్త సారాంశం… ఓ ఏజెంట్ ఆ వార్త చదివాక… ‘ది పిట్’ నవ్వులతో మారుమోగిపోయింది..!! (మొన్నటి సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత పాకిస్థాన్ స్పందించిన తీరులో ఉంది కదూ…)
తరువాత సిరియా ఏం చేసింది..? ధ్వంసం కాగా మిగిలిన భవనాన్ని తనే సంపూర్ణంగా కూల్చేసి, ఆ శిథిలాలు కనబడకుండా కవర్ చేసింది… అది పోతేపోయింది, మరొకటి నిర్మించుకుంటారు కదా, దానికేం చేయాలి..? ఇజ్రాయిల్ మరో ఆపరేషన్ కూడా చేసింది… ఆ అణు కార్యక్రమానికి బ్యాక్ బోన్ వంటి వ్యక్తిని వేసేసింది… అది మరోసారి చెప్పుకుందాం… కానీ, ఒక్కసారి ఆలోచించండి… పాకిస్థాన్ రియాక్టర్ కహుటాలో జోరుగా నిర్మాణంలో ఉందని తెలిసినప్పుడు… మన గూఢచారులు ప్రాణాలకు తెగించి, ఆ సమాచారమంతా సేకరించి, కన్‌ఫరమ్ చేసినప్పుడు… ఇదంతా తెలుసుకున్న ఇజ్రాయిల్ మనకన్నా ముందు స్పందించింది.,. మీకు చేతకాకపోతే ఆ టాస్క్ మాకప్పగించండి, మీ భూభాగంలోకి వచ్చాక కాస్త ఫ్యుయల్ పోయండి చాలు, మా యుద్ధవిమానాలు వచ్చి, దాన్ని పేల్చేసి పోతాయని ఇండియాకు చెప్పింది… కానీ ఏం జరిగింది..? ఢిల్లీలో ఉన్న పెద్దలకు వణుకు… వదిలేశారు… ఫలితంగా ఇప్పుడు పాకిస్థాన్ ‘కొరకరాని కొయ్య’గా మారి, మనకు పక్కలో అణుబాంబులా మారింది… సో, మొదట్లోనే తుంచకపోతే ఇదీ జరిగే నష్టం…
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)