ఆమెకు 19.. అతడికి 22.. నెల రోజుల క్రితం పెళ్లి.. అంతలోనే ఘోరం

తిరుపతికి చెందిన నలుగురు యువకుల కారు డ్రైవింగు సరదా ఓ యువజంట ప్రాణాలను బలిగొంది.జూపార్క్‌ రోడ్డులో ముందు వెళ్తున్న బస్‌ను ఓవర్‌టేక్‌ చేసిన వీరు ముందు ఓ ఆటో, ద్విచక్రవాహనం వస్తుండడం చూసి కంగారుపడి ఎక్స్‌లేటర్‌ను అదమడంతో ఆ కారు రెట్టించిన వేగంతో దూసుకుపోయి విధ్వంసమే సృష్టించింది.యువ దంపతులను పొట్టనబెట్టుకుని రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

కొందరు యువకుల సరదా నవదంపతులను బలిగొంది. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ రెంటల్‌ కారులో వెళుతూ.. బస్సును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో కారును ఢీకొనడంతో బాలాజీ, కావ్య దంపతులు దుర్మరణం చెందారు. తిరుపతి నగరం జూపార్కు రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంతో.. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. చెట్టు, కరెంటు స్తంభం విరిగిపడి ఆ ప్రాంతం భయానకంగా మారింది. ఈ ప్రమాదానికి సంబంధించి అలిపిరి ఎస్‌ఐ మధు, ప్రమాద కారకులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చంద్రగిరి మండలం కూచువారిపల్లెకు చెందిన శివకుమార్‌, ఉమ దంపతుల కుమార్తె కావ్య (19), తిరుపతి సమీపం తారకరామ నగర్‌కు చెందిన గీత కుమారుడు కె.బాలు అలియాస్‌ బాలాజి (22) కి గతనెల 8వ తేది వివాహమైంది. తిరుపతిలోని ఓ హోటల్‌లో కావ్య, ఓ డిజిటల్‌ షోరూమ్‌లో బాలాజీ పనిచేస్తున్నారు. నూతన దంపతులు 20 రోజుల కిందట లీలామహల్‌ సమీపంలో కాపురం పెట్టారు. వీరిద్దరికీ ఆదివారం సెలవు కావడంతో కూచువారిపల్లెకు వెళ్లి.. సోమవారం ఉదయం ద్విచక్రవాహనంపై తిరుపతికి బయలుదేరారు. వేద వర్సిటీ- సైన్స్‌సెంటర్‌కు మధ్య సుమారు 8.30 గంటల సమయంలో వస్తుండగా.. ఎదురుగా వేగంగా వస్తున్న కారు వీరిని ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిందిలా..
తిరుపతిలోని పరసాలవీధి ప్రాంతానికి చెందిన రవి, రాజు, మహేష్‌, నవీన్‌ తరచూ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ రెంటల్‌ కారును అద్దెకు తీసుకుని సరదాగా తిరుగుతూ.. డ్రైవింగ్‌ సాధన చేస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం వీరు రెవ్‌ కారును అద్దెకు తీసుకున్నారు. జూపార్క్‌ రోడ్డులో వెళ్తుండగా.. ఓ బస్సును ఓవర్‌టేక్‌ చేశారు. ఆ బస్సుకు ఆటో ఉండటం.. అదే సమయంలో ఎదురుగా బాలాజీ, కావ్య ద్విచక్రవాహనంపై వస్తున్నారు. దీంతో డ్రైవింగ్‌లో ఉన్న రాజు కంగారు పడ్డాడు. బ్రేక్‌కు బదులు ఎక్సలేటర్‌ తొక్క డంతో కారు రెట్టించిన వేగంతో దూసుకుపోయింది. అంతటి వేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని.. రోడ్డు రెయిలింగ్‌ దాటుకుని ఓ చెట్టును, కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొని పక్కనున్న చెట్లలో తలకిందులుగా పడి పోయింది. ఈ ఘటనలో నవ దంపతులు బాలాజీ, కావ్య అక్కడిక్కడే దుర్మరణం చెందారు. చెట్లు, కరెంటు స్తంభం విరిగి పడ్డాయి. కారులో ఉన్న నవీన్‌కు తీవ్రగాయాలయ్యాయి.

ప్రమాదంతో కారులో ఎయిర్‌ బెలూన్లు ఓపెన్‌ కావడంతో మిగతా యువకులు కొద్దిపాటి గాయాలతో తప్పించుకున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందగానే అలిపిరి ఎస్‌ఐ మధు ఘటనా స్థలికి చేరు కుని క్షతగాత్రులను రుయాస్పత్రికి తరలిం చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి.. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తు న్నట్టు ఎస్‌ఐ మధు తెలిపారు. క్షతగాత్రుల్లో నవీన్‌ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారన్నారు. పెళ్లయిన 30 రోజులకే దంపతులు మృతిచెందడంతో వారి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, ప్రమా దానికి కారణమైన కారు రాత్రి కాలిపోయింది. ఎవరైనా తగులబెట్టారా లేదా ప్రమాదశాత్తు మంటలు అంటుకున్నాయా అనేది తెలియరాలేదు.

నెలకే నవదంపతుల జీవితం విషాదాంతం
ఒక పాప, ఒక బాబు. సొంతంగా కారు, ఓ ఫ్లాటు. రెండు కుటుంబాలకూ తమ జంట ఆదర్శంగా నిలవాలనుకున్నారు. నెల కిందట పెళ్లయిన తర్వాత బాలాజీ, కావ్య జంట కన్న కలలివి. నిండు నూరేళ్ల జీవితానికి ప్రణాళిక వేసుకున్నారు. వీరి కలలు నెరవేరకనే మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ రెండు కుటుంబాల బంధువులు రోది స్తున్నారు. ఈ నవ వధువులు మహాశివరాత్రికి కోలారు వద్దనున్న కోటి లింగాలకు వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కలలు నెరవేరాలని ఈశ్వరుడిని ప్రార్థించారు. గుడి ఆవరణలో సెల్ఫీ తీసుకున్నారు. ఈ వేసవిలో హనీమూన్‌కు గోవా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చేసుకుంటున్న సమయంలో ఇలా మృత్యువాత పడటం జీర్ణించుకోలేక పోతున్నామని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అన్యోన్యంగా ఉండే ఈ జంటను చూసి విధి వెక్కిరించిందని ఆవేదన చెందుతున్నారు.

కొడుకూ దూరమై..!
బాలాజిది నిరుపేద కుంటుంబం. తండ్రి ప్రకాష్‌ 15 ఏళ్ల కిందటే చనిపోయాడు. దీంతో కుమార్తె పూర్ణ చంద్రిక, బాలాజీని తల్లి గీత కంటికి రెప్పలా కాపాడుకుంటూ చదివించి ప్రయోజకులను చేశారు. ప్రస్తుతం పూర్ణ చంద్రిక ఢిల్లీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. తండ్రి స్థానంలో ఉంటూ ఆమె సంపాదనను ఇంటికి పంపిస్తూ, అమ్మ, తమ్ముడికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. బాలాజి తల్లి గీత కూడా స్థానికంగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ నెల కిందట కొడుక్కి పెళ్లి చేశారు. కుటుంబం కాస్త కుదురుకుంటున్న నేపథ్యంలో ఆ ఇంట విషాదం నెలకొంది. 15 ఏళ్ల కిందట ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న భర్త చనిపోయాడని, ఇప్పుడు వయసు మళ్లిన తనకు బిడ్డ పెద్ద దిక్కుగా ఉంటాడనుకుంటే ఇలా కొడుకు, కోడలు ఒకేసారి మృతి చెందడంతో గీత తల్లడిల్లి పోతున్నారు. ఇక నేనెవరికోసం బతకాలంటూ ఆమె రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తోంది.
ముగిసిన పోస్టుమార్టం
బాలాజి, కావ్య దంపతుల మృతదేహాలను ఎస్వీ వైద్య కళాశాలలో పోస్టుమార్టం పూర్తిచేశారు. సాయంత్రం వారి బంధువులకు మృతదేహాలను అప్పగించడంతో వారు తారకరామ నగర్‌కు తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంలో ఒకే ఇంట్లో కొత్తగా పెళ్లయిన వారు మృతి చెందడంతో తారకరామనగర్‌లో విషాదం నెలకొంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)