లోక్ సభ ఎన్నికల్లో 13 కొత్త రూల్స్.. తెలుసా??

ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో అనేక కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇవి అభ్యర్థులకు మాత్రమే కాదు. పౌరులు, ఓటర్లకు కూడా.. కాబట్టి వీటి గురించి అందరికీ అవగాహన ఉండాలి.2019 సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ సరికొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇందులో కొన్ని టెక్నాలజీ అప్డేట్ అయితే మరికొన్ని అభ్యర్థులకు విధించిన నిబంధనలు. ఇక పౌరులకు, ఓటర్లపైనా పరోక్షంగా ఆంక్షలు విధించారు. ముఖ్యంగా సోషల్ మీడియాపై నిఘా పెంచారు. మొత్తంగా ఈసారి సరికొత్త టెక్నాలజీతో పాటు కొన్ని కొత్త రూల్స్ కూడా కమీషన్ తెచ్చింది. వాటిని తెలుసుకోవడంతోపాటు ఫాలో అవ్వాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

13 కొత్త రూల్స్, అప్ డేట్స్ ఇవే..
1. గతంలో ఈవీఎంలపై, పోస్టల్ బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల పేరు, గుర్తు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అభ్యర్థుల ఫొటోలను కూడా ముద్రిస్తారు.
2. వీవీ ప్యాట్‌లు, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంను ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో వాడుతున్నారు. ఇప్పుడు మొదటిసారిగా లోక్‌ సభ ఎన్నికల్లో వాడబోతున్నారు.
3. అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు అందించాలి.
4. అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలతోపాటు భార్య లేదా భర్త, కుటుంబ సభ్యుల ఆస్తులు కూడా వెల్లడించాలి.
5. పాన్ వివరాలతోపాటు ఐదేళ్ల ఐటీ రిటర్నులు ఇవ్వాలి.
6. విదేశాల్లో ఉన్న ఆస్తులను కూడా ప్రకటించాలి.
7. ఓటు వేయాలంటే ఓటర్ స్లిప్పుతోపాటు 11 రకాల ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి ఉండాలి. పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ప్రభుత్వం జారీ చేసిన సర్వీస్ ఐడెంటిటీ కార్డు, ఫొటోతో ఉన్న పాస్ బుక్, పాన్ కార్డు, రిజిస్టార్ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, ఉపాధి హామీ లేదా జీవిత భీమా కార్డు, పెన్షన్ పత్రం, ప్రజాప్రతినిధులు ధ్రువీకరించిన గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు ఉంటే ఓటు వేసేందుకు అనుమతిస్తారు.
8. ఎన్నికల సందర్బంగా తనిఖీలు చేస్తూ డబ్బు సీజ్ చేస్తారని తెలిసిందే. ఈ విషయంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాకు ముగ్గురు సభ్యులతో కమిటీని వేయబోతున్నారు. ఈ కమిటీ ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా వ్యవహరిస్తుంది. రాజకీయ పార్టీలు, నాయకులతో సంబంధం లేని వ్యక్తుల నుంచి సీజ్ చేసిన డబ్బును పరిశీలించి వెంటనే తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకుంటుంది.
9. అభ్యర్థులు ఆన్ లైన్, సోషల్ మీడియాలో ప్రచారానికి చేసే ఖర్చులను వారి ప్రచార వ్యయంలో కలపాలి.
10. ఆన్‌లైన్‌ పొలిటికల్ యాడ్స్‌కి ముందుగా చెకింగ్ తప్పనిసరి. గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సంస్థలు ముందుగా రాజకీయ ప్రకటనను పూర్తిగా చూసి, నిబంధనల ప్రకారం ఉందని అనిపిస్తేనే అనుమతించాలి.
11. రాజకీయ ప్రకటనలపై ఫిర్యాదుల కోసం ఆయా సంస్థలు గ్రీవెన్స్ ఆఫీసర్‌ను నియమించాలి.
12. ప్రచార ఖర్చుల పరిమితి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. గరిష్టంగా ఒక ఎంపీ అభ్యర్థి రూ. 70 లక్షలవరకు ఖర్చు పెట్టవచ్చు. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి చిన్న రాష్ట్రాల్లో పరిమితి రూ.54 లక్షలుగా నిర్ధారించారు.
13. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంటుంది. కాబట్టి ఇకపై అసత్య ప్రచారాలు చెయ్యకూడదు. వివాదాస్పద పోస్టులకు లైకులు, షేర్లూ కొడితే సమస్యలు తప్పవు.
బాధ్యత గల పౌరులుగా మనం ఇందులో పేర్కొన్న నిబంధనలను పాటిద్దాం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)