కొలిక్కిరాని తల్లీకూతుళ్ల మృతి కేసు.. పోలీసుల తీరుపై అనుమానాలు!

గత నెల 18న మొగల్తూరులో అనుమానాస్పదంగా మృతి చెందిన తల్లీకూతుళ్లు లక్ష్మీ ప్రసన్న (28) కుమార్తెలు రోజా శ్రీలక్ష్మి(7) జాహ్నవి(5) మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన 20 రోజుల తర్వాత లక్ష్మీప్రసన్న తమ చావుకు కారణం ఆడపడుచులు, వారి భర్తలే కారణమంటూ సెల్‌ఫోన్‌లో మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు అంటున్నారు. ఘటన జరిగిన రోజున మృతురాలి భర్త నల్లిమిల్లి వెంకట రామాంజనేయరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకూ మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు.

మృతురాలి మాట్లాడిన మాటలు ద్వారా ఆడపడుచు కర్రి పద్మ, ఆమె భర్త రామకృష్టారెడ్డి, మరో ఆడపడుచు గుడిమెట్ల లక్ష్మీకుమారి ఆమె భర్త వీరారెడ్డిపై సీపీసీ 306 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఈవిషయం కూడా మీడియాకు తెలపకుండా ఎందుకు గోప్యత పాటిస్తున్నారో అర్థంకావడం లేదు. ఘటన జరిగిన గంట ముందు తాను బయటకు వెళ్లి తిరిగివచ్చేసరికి తన భార్యా బిడ్డలు మృతి చెంది ఉన్నారని భర్త వెంకట రామాంజనేయరెడ్డి పోలీసులకు తెలిపినట్టు తెలిసింది. అయితే మృతురాలు ఫోన్‌లో మాట్లాడిన మాటలు పరిగణనలోకి తీసుకున్న పోలీసులు సంఘటనలో భర్త పాత్రపై విచారణలో ఏమి తేలిందో చెప్పడం లేదు. అసలు మీడియాకు ఏవిషయం తెలపకుండా ఎందుకు గోప్యత పాటిస్తున్నారో అర్థం కావడం లేదు. కేసును విచారిస్తున్న సీఐ బి. కృష్టకుమార్‌ ఇరగవరం మండలం ఏలేటిపాడుకు చెందిన గుడిమెట్ల వీరారెడ్డిని అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపర్చినట్టు తెలిసింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)