వివాహేతర బంధమే ప్రాణం తీసింది..ప్రియుడు అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు...

వివాహేతర సంబంధం దారుణ హత్యకు దారితీసింది. చేసిన తప్పును తెలుసుకుని భర్త వద్దకు తిరిగి చేరుకోవాలన్న మహిళ చివరకు ప్రియుడి చేతిలో హత్యకు గురైంది. ప్రియుడు అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన చిత్తూరు నగరం చెన్నమ్మగుడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు నగరం చెన్నమ్మగుడిపల్లికి చెందిన హరికృష్ణ, కనకదుర్గ(36)లకు 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఇటీవల అదే గ్రామానికి చెందిన త్యాగరాజు అనే వ్యక్తితో కనకదుర్గకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో భర్త హరికృష్ణ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కారణంతో ఇద్దరూ విడిపోయారు. కనకదుర్గ పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు ఇద్దరు హరికృష్ణ దగ్గరే ఉంటున్నారు.

కాగా, చివరకు చేసిన తప్పును తెలుసుకున్న కనకదుర్గ భర్తకు దగ్గర కావాలనుకుంది. గత మూడు రోజులుగా తన పిల్లలతో పాటు భర్తను కలుసుకుని కాపురం కాపురం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు త్యాగరాజు జీర్ణించుకోలేకపోయాడు. శనివారం కనకదుర్గ పుట్టింట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు 100కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని త్యాగరాజుని మందలించారు. దీంతో కనకదుర్గపై కక్ష పెంచుకున్న త్యాగరాజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై మరోమారు దాడికి దిగాడు. చీరతో గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. స్థానికులు సమాచారంతో డీఎస్పీ రామాంజనేయులు, సీఐ శ్రీధర్, ఎస్‌ఐ పురుషోత్తంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదివారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)