కోహ్లీ తప్పిదాన్ని బయటపెట్టిన ధావన్..!

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పు నిర్ణయం కారణంగానే మొహాలిలో టీమ్ ఓడిపోయిందని ఓపెనర్ శిఖర్ ధావన్ పరోక్షంగా వెల్లడించాడు. ఆదివారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో 359 పరుగుల లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (143: 115 బంతుల్లో 18x4, 3x6), రోహిత్ శర్మ (95: 92 బంతుల్లో 7x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినా.. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా భారత్‌కి ఓటమి తప్పలేదు. అయితే.. రాత్రి 7 గంటల తర్వాత మొహాలిలో అతిగా మంచు కురువడంతో బౌలర్లు, ఫీల్డర్లకి బంతిపై పట్టు చిక్కలేదని ధావన్ వెల్లడించాడు.

‘వాస్తవానికి గత శుక్రవారం ముగిసిన రాంచీ వన్డేలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించాం. అందుకే టాస్ గెలిచి ఛేదనకే మొగ్గు చూపాం. కానీ.. ఆరోజు మంచు ప్రభావమే కనిపించలేదు. దీంతో.. మొహాలీలో కూడా అవే పరిస్థితులు ఉంటాయని భావించి.. ఆస్ట్రేలియాకి ఛేజింగ్ అవకాశం ఇచ్చాం. అయితే.. మొహాలిలో విపరీతంగా మంచు కురిసింది. దీనికి తోడు బ్యాట్‌‌పైకి బంతి చక్కగా రావడంతో.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా హిట్టింగ్ చేయగలిగారు. సాధారణంగా స్కోరు బోర్డుపై భారీ స్కోరు ఉన్నప్పుడు.. ఛేజింగ్ టీమ్‌‌పై ఒత్తిడి ఉంటుంది. భారత్‌ కూడా 38వ ఓవర్ వరకూ మ్యాచ్‌లోనే ఉంది. కానీ.. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతుల్లోకి గేమ్ వెళ్లిపోయింది’ అని ధావన్ వెల్లడించాడు. మొత్తంగా 3, 4వ వన్డేల్లో టాస్ గెలిచిన కోహ్లీ వాతావరణాన్ని అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైనట్లు భారత ఓపెనర్ పరోక్షంగా అంగీకరించాడు. మొహాలి వన్డేలో స్లాగ్ ఓవర్లలో దూకుడుగా ఆడిన టర్నర్ (84 నాటౌట్: 43 బంతుల్లో 5x4, 6x6) ఆస్ట్రేలియాకి అలవోక విజయాన్ని అందించగా.. రాంచీ వన్డేలో 314 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు 48.2 ఓవర్లలో 281 పరుగులకి ఆలౌటైన విషయం తెలిసిందే.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)