‘మా’ ఎన్నికల్లో ఓటేయని ప్రముఖులు.. అంతమంది హీరోయిన్లలో ఒక్క ప్రియమణి మాత్రమే..

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఫిల్మ్‌ ఛాంబర్‌కి నటీనటులు తరలి వచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్నారు. ‘మా’లో ఓటు హక్కు గల సభ్యులు 745 మంది ఉండగా 473 ఓట్లు పోలైనట్టు తెలిసింది. ‘మా’ ఎన్నికల చరిత్రలో ఇంతమంది కళాకారులు ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ఈ ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి పోటీపడిన శివాజీరాజా, వీకే నరేశ్‌... ఇరువురి ప్యానెల్‌ సభ్యులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాతావరణాన్ని వేడెక్కించారు. ప్రముఖులు, ఇతర నటీనటుల మద్దతు కోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. తొలి ఓటును వీకే నరేశ్‌ వేయగా... చివరి ఓటును హాస్యనటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ జరగాల్సిన పోలింగ్‌, ఎక్కువమంది సభ్యులు రావడంతో 3 గంటల వరకూ పొడిగించారు. సాయంత్రం కౌంటింగ్‌ ప్రారంభం కాగా... అర్ధరాత్రి వరకూ కొనసాగింది. బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలను నిర్వహించారు. సోమవారం ఉదయం ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఎన్నికలకు దూరంగా యువ హీరోలు... హీరోయిన్లు!
సీనియర్‌ స్టార్స్‌ చిరంజీవి, నాగార్జున, రాజశేఖర్‌, శ్రీకాంత్‌ తదితరులు ‘మా’ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహేశ్‌బాబు, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, చిన్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ తదితర యంగ్‌ స్టార్స్‌ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. యువ హీరోల్లో ‘అల్లరి’ నరేశ్‌, నాని, రానా, సాయిధరమ్‌ తేజ్‌, సుధీర్‌ బాబు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ఆది సాయికుమార్‌, సాయిరామ్‌ శంకర్‌ ఎన్నికల్లో ఓటు వేశారు. ఒక్క ప్రియమణి మినహా మిగతా హీరోయిన్ల జాడ ‘మా’ ఎన్నికల్లో కనిపించలేదు.
ఒకే కారులో చిరంజీవి.. నాగార్జున!
‘మా’ ఎన్నికల్లో ఓటు వేయడానికి చిరంజీవి, నాగార్జున ఒకే కారులో రావడం చర్చనీయాంశం అయింది. వీరితో పాటు నాగబాబు ఉన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)