వివాదాస్పదంగా సర్ఫ్‌ఎక్సెల్ ప్రకటన.... ఇంతకీ ఏముంది?

హోలీ రాకకు కొద్దిరోజుల సమయమే ఉంది. దీంతో మార్కెట్లో ఎక్కడ చూసినా హోలీ రంగుల విక్రయాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరోవైపు హోలీతో ముడిపడిన ప్రకటనలు టీవీలో ప్రసారమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే వచ్చిన సర్ఫ్‌ఎక్సెల్ ప్రకటన సోషల్ మీడియాలో విమర్శలకు గురవుతోంది. మతసామరస్యాన్ని చాటిచెప్పేలా రూపొందిన ఈ ప్రకటన అందుకు భిన్నమైన ప్రభావాన్ని చూపుతున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనలో ఒక హిందూ బాలిక, ముస్లిం బాలుని మధ్య నడిచే సన్నివేశం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో దీనిపై వ్యతిరేకత పెల్లుబుకుతోంది. సోషల్ మీడియా యూజర్లు బాయ్‌కట్ సర్ఫ్ఎక్సెల్ అనే హ్యాష్ ట్యాగ్‌తో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే సర్ఫ్‌ఎక్సెల్ ‘రంగ్ లాయే సంగ్‘ పేరిట చేపట్టిన ప్రచారంలో హోలీ సందర్భంగా హిందూ-ముస్లింల సామరస్య భావనను చూపించే ప్రయత్నం చేసింది. ఒక నిముషం పాటు సాగిన ఈ ప్రకటనలో తెల్లని టీ షర్టు ధరించిన హిందూ బాలిక సైకిల్ మీద తిరుగుతుంటుంది. అప్పుడు బాల్కనీలలో ఉన్న చిన్నారులు ఆమెపై రంగులు వెదజల్లుతారు. తరువాత ఆ బాలిక తన ముస్లిం స్నేహితుని దగ్గరకు వెళ్లి రంగులు అయిపోయాయి అని చెబుతుంది. దీంతో తెల్లని కుర్తా, పైజమా ధరించిన ఆ బాలుడు బయటకు వస్తాడు. ఆ బాలిక తన స్నేహితుణ్ణి సైకిల్ మీద మసీదు ద్వారం దగ్గర వరకూ తీసుకు వెళ్లి విడిచిపెడుతుంది. ఆ బాలుడు నమాజ్ అయ్యాక వస్తానని చెబుతాడు. దీనికి ఆ బాలిక... అప్పడు రంగు పడుతుందని అంటుంది. బాలుడు చిరునవ్వులు చిందిస్తాడు. ప్రకటన చివరలో ‘మరక మంచిదే’ అనే సందేశం వినిపిస్తుంది. ఫిబ్రవరి 27న విడుదలైన ఈ ప్రకటనను ఇప్పటివరకూ 8,109,648 మంది వీక్షించారు. తాజాగా ఈ ప్రకటనపై రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ మనం అన్ని మతాలను గౌరవిస్తాం, ఎవరినీ వ్యతిరేకించం. అయితే ఈ విషయంలో సీరియస్‌గా ఆలో చించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకూ మన దుస్తులను ఉతికేందుకు వినియోగమైన విదేశీ సర్ఫ్‌ను ఇప్పుడు మనం ఉతకాల్సిన రోజు వచ్చినట్లుందన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)