ఆస్ట్రేలియాను గెలిపించిన భారత బౌలింగ్, ఫీల్డింగ్

కొండంత లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది అనే కంటే భారత బౌలర్లు దగ్గరుండి మరీ ఆస్ట్రేలియాను గెలిపించారనడం సమంజసమేమో. భారత బ్యాట్స్‌మెన్ విజయంపై నమ్మకం పెంచగా, బౌలర్లు నీరుగార్చారు. 359 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిందంటే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆడిన తీరుకు అద్దం పడుతోంది.

ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖావాజా (91), పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (117)లు ఆడింది ఒకెత్తు అయితే చివర్లో ఆష్టన్ టర్నర్ (84 నాటౌట్) ఆడిన తీరు ఒకెత్తు. 43 బంతుల్లో 5 ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియా విజయంలో టర్నర్‌దే కీలక పాత్ర అనడం అతిశయోక్తి కాదేమో. ఇక చివర్లో వికెట్ కీపర్ అలెక్స్ కేరీ కూడా విరుచుకుపడ్డాడు. 15 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేశాడు. ఫలితంగా మరో నాలుగు వికెట్లు ఉండగానే 47.5 ఓవర్లలో ఆసీస్ విజయం సాధించి ఐదు వన్డేల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.

ఇక, తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ అద్భుతంగా ఆడింది. రోహిత్ శర్మ (95), శిఖర్ ధవన్ (143)లు చాలా రోజుల తర్వాత బ్యాట్ ఝళిపించారు. రిషబ్ పంత్ 36 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు చేసింది.

అయితే, బ్యాట్స్‌మెన్ నిర్దేశించిన లక్ష్యాన్ని బౌలర్లు నిలుపుకోవడంలో విఫలమయ్యారు. ఆసీస్ ఆటగాళ్ల ముందు భారత బౌలింగ్ వెలవెలబోయింది. వేసిన ప్రతీ బంతీ స్టాండ్స్‌లోకి వెళ్లిందంటే ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఎంత కసిగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఫీల్డింగ్ లోపాలు భారత్‌ను వెక్కిరించాయి. మైదానంలో ఒక్క ఆటగాడు కూడా బాధ్యతగా వ్యవహరించలేదని మ్యాచ్ చూసిన ఏ ఒక్కరైనా చెబుతారు. ఆష్టన్ టర్నర్ మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడంటే భారత బౌలింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జాదవ్ ఓసారి, శిఖర్ ధవన్ ఒకసారి చేతిలో పడిన క్యాచ్‌లను నేలపాలు చేసి ఆసీస్ విజయానికి పరోక్షంగా సహకరించారు.

టీమిండియాలో అత్యుత్తమ బౌలర్లు అనదగిన వారందరూ యథేచ్ఛగా పరుగులు సమర్పించుకున్నారు. వికెట్లు తీసేందుకు చెమటోడ్చారు. యుజ్వేంద్ర చాహల్ పది ఓవర్లు వేసి ఏకంగా 80 పరుగులు సమర్పించుకోగా, కుల్దీప్ 64 పరుగులు ఇచ్చుకున్నాడు. 8.5 ఓవర్లు వేసిన బుమ్రా 63 పరుగులిచ్చి మూడు వికెట్లు నేలకూల్చాడు. బ్యాటింగ్‌లో అద్బుతంగా రాణించిన భారత్.. బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో అత్యంత చెత్త ప్రదర్శనతో చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఇక, సిరీస్‌ను నిర్ణయించే చివరిదైన ఐదో వన్డే ఈ నెల 13న ఢిల్లీలో జరగనుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)