స్నేహితులే మృగాలు: బలైన ఆడబిడ్డ

ఓ ఫ్రెండ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యంత పాశవికంగా బ్లేడ్ తో హింసించి దాడి చేశాడు. ఆ బాధలో ఉన్న ఆమెకు.. సాయం చేస్తామన్న ఫ్రెండ్స్​ రూపంలో మరో బాధ ఎదురైంది. సాయం మాటున వీడియోలను పంపించుకుని సోషల్ మీడియాలో పోస్ట్​ చేసి ఆమెపై మానసికంగా దాడి చేశారు. ఇదీ, నగరం నడిబొడ్డున రెండు రోజుల క్రితం అత్యాచారానికి గురైన 16 ఏళ్ల బాలికకు ఎదురైన ఘోరం. బ్లేడ్లతో దాడి చేసి దారుణానికి ఒడిగట్టిన నిందితుడు నాగరాజు (19)ను పోలీసులు అరెస్ట్​ చేశారు. సాయం చేస్తామని నమ్మించి మోసం చేసిన ఆమె స్నేహితులు మరో 8 మందిపైనా కేసులు పెట్టారు. శనివారం కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్​ వెల్లడించారు.

ఆయన చెప్పినదాని ప్రకారం..గురువారం అర్ధరాత్రి లోయర్ ట్యాంక్ బండ్ లోని డీబీఆర్ మిల్స్​లో బాలికపై బ్లేడ్లతో దాడి చేసి నాగరాజు పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. స్నేహితులను కలిసొస్తానని చెప్పి ఆమె తిరిగి రాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను నెక్లెస్ రోడ్డులో ఉన్నానని శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసింది. దీంతో మహిళా పోలీసులతో కలిసి వెళ్లి ఆమెను తీసుకొచ్చారు. భరోసా సెంటర్ కు తరలించి మహిళా పోలీసులతో స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఏడాది నుంచి బషీర్ బాగ్​కు చెందిన నాగరాజుతో పరిచయం ఉందని చెప్పింది. అయితే, వేరే స్నేహితులతోనూ ఆమె మాట్లాడడం నచ్చని నాగరాజు.. కక్ష పెంచుకున్నాడు.

ఈ నెల 2న డీబీఆర్ మిల్స్​కు పిలిపించి ఆమెను కొట్టి వీడియో తీశాడు. అలా చేయొద్దని ఆమె బతిమాలినా నాగరాజు వినలేదు. ఆ వీడియోలను బాధితురాలు ఉండే ప్రాంతంలో ఆమె ఫ్రెండ్స్​కు చూపించాడు. ఆ విషయం తెలిసి వీడియోలను డిలీట్ చేయిస్తామని ఆమె ఫ్రెండ్స్​ ప్లాన్ వేశారు. డీబీఆర్ మిల్స్​కు రావాలని నాగరాజు చెప్పడంతో.. ఈనెల 6న ప్లాన్ ప్రకారం ఆమెతో కలిసి 8 మంది యువకులు వెళ్లారు. వీడియోలను వాళ్ల ఫోన్లలోకి పంపించుకుని.. నాగరాజు ఫోన్లో డిలీట్ చేశారు. అతడిని చితగ్గొట్టి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ విషయం అందరికీ తెలిసిపోవడంతో ఇద్దరూ (నాగరాజు, బాధితురాలు) పెళ్లి చేసుకోవాలనుకున్నారు. 7న ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆ రోజూ ఆమెపై పాశవికంగా అత్యా చారానికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి ఎంతకీ రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం నాగరాజును అరెస్ట్​ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి వీడియోలను తమ ఫోన్లలోకి పంపించుకుని, సోషల్ మీడియాలో పోస్ట్​ చేసిన 8 మందిపైనా కేసులు పెట్టారు. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)