పెళ్లి చేసుకోవాలి అనిపించింది: రానా

తన సహ నటుడు ప్రభాస్‌కు ఓపిక ఎక్కువని, ఆయనలో తనకు అది చాలా ఇష్టమని నటుడు రానా అన్నారు. రానా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన ‘యన్‌.టి.ఆర్‌- మహానాయకుడు’ సినిమా ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ఆయన ‘హాథీ మేరే సాథీ’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ సెలబ్రిటీ టాక్‌ షోలో రానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు. చదువులో ముందుండాలని ఎప్పుడూ అనుకోలేదని, తనకు ఫిల్మ్‌మేకింగ్‌ మీద ఆసక్తి ఎక్కువని అన్నారు.

పది ఫెయిల్‌ అయ్యా..
‘మా తాతయ్య రామానాయుడు గారు నా చదువు గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదు. ఎందుకంటే.. నాకు ఎడిటింగ్‌ అంటే ఇష్టమని, దాన్ని నేర్చుకుంటున్నానని ఆయనకు తెలుసు. అందుకే నాకు ఆసక్తి ఉన్న రంగంలో రాణిస్తే మంచిది అనుకున్నారు. పదో తరగతి ఫెయిల్‌ అయ్యా. తర్వాత పాస్‌ అవడానికి పలు పాఠశాలలు మారా. అప్పుడే రామ్‌ చరణ్‌ స్నేహితుడయ్యాడు. సినిమా సెట్‌లో నా బాల్యం గడిచింది, అక్కడే పెరిగా. పై అంతస్థులో నేను ఉంటే, కింద అంతస్థులో షూటింగ్‌ జరుగుతుండేది. బ్రేక్‌ఫాస్ట్‌ సెట్‌లో చేసి పాఠశాలకు వెళ్తుండేవాడ్ని’.

ఐదేళ్లలో ప్రభాస్‌ ఎన్ని చేసుండొచ్చో..!

‘ప్రభాస్‌ నుంచి నేను నేర్చుకున్న తొలి విషయం సహనంగా ఉండటం. అతడి దగ్గర లెక్కలేనంత ఓపిక ఉంది. ‘బాహుబలి’ సినిమాకు ప్రభాస్‌ ఎంతో శ్రమించాడు, అతడే వెన్నెముక అయ్యాడు. ప్రభాస్‌ అప్పట్లో వరుస విజయాలు సాధించాడు. ‘డార్లింగ్‌’, ‘మిర్చి’ వంటి హిట్స్‌ వచ్చాయి. ‘బాహుబలి’ సినిమాల కోసం కేటాయించిన ఐదేళ్లలో అతడు ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చు, ఎంత సంపాదించి ఉండొచ్చో ఊహించండి. కానీ అతడు ఇవేవీ పట్టించుకోలేదు. సహనంగా, అంకితభావంతో ‘బాహుబలి’ కోసం పనిచేశాడు. అది నాకు చాలా నచ్చింది’.

అదృష్టవంతుడ్ని
‘మా తాతగారు నిర్మాత కావడంతో చిత్ర పరిశ్రమలో రాణించేందుకు నాకు సులభంగా మార్గం దొరికింది. అంతేకాదు నాకు నచ్చిన కథను ఎంచుకునే అవకాశం దక్కింది. మా తాత వల్లే ఇది సాధ్యమైంది. ఈ విషయంలో నేను అదృష్టవంతుడ్ని’.

బన్నీ అడిగే ఒకేఒక్క ప్రశ్న
‘నా స్నేహితులు రామ్‌చరణ్‌, బన్నీ త్వరగా పెళ్లి చేసుకున్నారు. అప్పుడు నాకూ పెళ్లి చేసుకోవాలి అనిపించింది. వాళ్లిద్దరికి భార్యలు ఉన్నందుకు వాళ్లని చాలా ఏడిపించా (సరదాగా). ఇక్కడ నాకు కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. నేనూ పెళ్లి చేసుకోవాలి, లేదా రామ్‌, బన్నీని మార్చేయాలి. తర్వాత ఇలా కాదని నాగచైతన్య, అఖిల్‌తో ఎక్కువ సమయం గడిపేవాడ్ని. బన్నీ నన్ను ఎప్పుడూ అడిగే ఒకేఒక్క ప్రశ్న ఏంటంటే.. ‘ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు రా?’ అని. ప్రస్తుతానికి కెరీర్‌పైనే నా దృష్టి ఉంది. పెళ్లి చేసుకోవాలి అనిపించినప్పుడు కచ్చితంగా చేసుకుంటా’.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)