సార్వత్రిక ఎన్నికలు.. అభ్యర్థుల నామినేషన్లో కఠినమైన నిబంధనలు..

మహా సంగ్రామానికి తెరలేచింది. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కోట్లాది మంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబందించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 543 స్థానాలకు గాను 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 23 కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు. ఇక తెలుగు రాష్ట్రాలకు ఏప్రిల్ 11 న పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణాలో 17 స్థానాలకు ఏప్రిల్ 11 ఒకే విడతలో ఎన్నికలు నిర్వ హించనున్నారు. దశల వారీగా చూస్తే ఏప్రిల్-11న తొలివిడత పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 20 రాష్ట్రాల్లోని 91 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక ఏప్రిల్-18న రెండో విడత, ఏప్రిల్-23న మూడో విడత, ఏప్రిల్-29న నాలుగో విడత, మే-6న ఐదో విడత, మే-12 ఆరో విడత, మే-19న ఏడో విడత పోలింగ్ నిర్వహిస్తారు. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 97 స్థానాలకు, మూడో దశలో 14 రాష్ట్రాల్లోని 115 సీట్లు, నాలుగో దశలో 9 రాష్ట్రాల్లో 71 స్థానాలు, ఐదో విడతలో 7 రాష్ట్రాల్లోని 51 సీట్లు, ఆరో దశలో 8 రాష్ట్రాల్లోని 91 స్థానాలు, ఏడో దశలో 8 రాష్ట్రాల్లోని 59 స్థానాలకు పోలింగ్ జరగుతుంది. షెడ్యూల్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లైంది.

లోక్ సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా శాసనసభలకు ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఏప్రిల్-11న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. మొత్తం 90కోట్ల మంది ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించు కోనున్నారు. ఇందులో 18-19 మధ్య వయసు ఉన్న ఓటర్లు కోటి 50 లక్షలు. కొత్తగా ఓటు హక్కు కోసం ధరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 8.4 కోట్లు. ఇక, ఓటర్ల కోసం 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయను న్నారు. గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి లక్ష పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లతో కూడిన ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు ఈవీఎంల పై అభ్యర్థుల ఫోటోలను కూడా ముద్రించనున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పారామిలటరీ బలగాలను మోహరించింది. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు రంగంలోకి దింపనున్నారు. ఎలక్షన్స్ ప్రశాంతంగా, స్వేచ్చగా జరిగేలా చూస్తామని, ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ కోరింది. ఇక ఎన్నికల కోడ్-అభ్యర్థుల నామినేషన్ల విషయంలో ఈసారి నిబంధనలు కఠినతరం చేశారు. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రాల్లో తమ పాన్ నెంబర్ ను తప్పనిసరిగా వెల్లడించాలి. గత ఐదేళ్ల కాలంలో ఆదాయ వివరాలను కూడా పొందుపరచాలి. సోషల్ మీడియా అకౌంట్ల వివ రాలను కూడా తెలియచేయాల్సి ఉంటుంది. నాయకులు ఎవరైనా కోడ్ ఉల్లంఘిస్తే ప్రజలే నేరుగా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికలకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ 1950ని ఏర్పాటు చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)