గసగసాలకు నల్ల ముందుకు లింక్ ఏంటి? గసగసాల సాగుపై నిషేధం ఎందుకో తెలుసా... 10 ఆస‌క్తిక‌ర అంశాలు

మ‌నం త‌రుచూ వంట‌ల్లో వాడే గ‌స‌గ‌సాల సాగుపై నిషేధం ఎందుకు విధించారు? ఉల్లంఘిస్తే వేసే శిక్ష ఏంటి? ఎవ‌రు సాగు చేయొచ్చు వంటి 10 ఆస‌క్తిక‌ర అంశాలు చూద్దాం.మ‌న దేశంలో దొరికే సుగంధ ద్ర‌వ్యాల్లో గ‌స‌గ‌సాలు ఒక‌టి. దీనిని అనేక ర‌కాలుగా ఉప‌యోగిస్తుంటారు. మ‌న ఆయుర్వేద విజ్ఞానం ప్ర‌కారం ఇదొక ఔష‌ధ మొక్క. ఆకులు, పువ్వులు, కాయ‌లు, గింజ‌ల్లో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. మ‌న దేశంలో వేల సంవ‌త్స‌రాలుగా గ‌స‌గ‌సాల‌ను వంటింట్లో వాడుతున్నారు. కానీ.. ప్ర‌స్తుతం గ‌స‌గ‌సాల సాగుపై నిషేదం ఉంది. ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో ఈ పంట సాగుచేయ‌డం చ‌ట్ట‌రిత్యా నేరం. అయితే మ‌న దేశంలో అయితే వైద్య, శాస్త్రీయ, గృహ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొంత మినహాయింపు ఇచ్చింది. ఇందుకు గ‌ల కార‌ణాలు ఏంటో ఒక‌సారి చూద్దాం.

1. గసగసాల కాయల నుండి నల్లమందు (ఓపియం) ఉత్పత్తి అవుతుంది. ఓపియం అనేది ఒక మాదకద్రవ్యం.
2. ఈ నల్లమందు మనిషి కేంద్ర నాడీవ్యవస్థపై ప్ర‌భావం చూపుతుంది. శ‌రీరానికి మత్తు కలిగించడం, నొప్పి తెలియకుండా చేయడం ఓపియం ముఖ్య లక్షణం. రోజంతా ప‌నిచేసి తీవ్రమైన ఒళ్లు నొప్పులతో బాధపడేవారు ఉప‌శ‌మ‌నం కోసం దీనిని వాడేవారు.
3. గ‌స‌గ‌సాల‌ను ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి మందుల్లో వాడుతారు. దగ్గు మందులు, నొప్పి తెలియకుండా చేసే మందుల తయారీలో వీటిని వాడుతారు. ముఖ్యంగా క్యాన్సర్ ఔషదాల్లో గ‌స‌గ‌సాల‌ను ఎక్కువగా వినియోగిస్తారు.
4. పంజాబ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేనీటి త‌యారీలో నల్ల మందు వాడుతారు. వేల సంవ‌త్స‌రాలుగా అది వారి సంప్ర‌దాయంగా కొన‌సాగుతోంది.
5. మ‌రోవైపు.. కొకైన్, హెరాయిన్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాల త‌యారీలో ఈ ఓపియంను ఉప‌యోగిస్తున్నారు. ఈ మ‌త్తుప‌దార్థాల వ‌ల్ల అనేకమంది చ‌నిపోతుండ‌టంతో గసగసాల సాగుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేర‌కు 1985లో నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ తీసుకొచ్చింది.
6. అయితే దేశీయ అవ‌స‌రాల కోసం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లో ఎంపికచేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాగుకు మిన‌హాయింపు ఇచ్చారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కొటిక్స్ (సీబీఎన్) అధికారుల పర్యవేక్షణలో మాత్ర‌మే సాగు చేయాల్సి ఉంటుంది. సాగుచేసే రైతులు త‌ప్ప‌నిస‌రిగా లైసెన్స్ తీసుకోవాలి.
7. గసగసాల కాయ గుండ్రంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిలోపల గసగసాలు ఉంటాయి. వీటిని ఎండ‌బెట్టి ప‌గ‌ల‌గొట్టి గస‌గ‌సాలు బ‌య‌టికి తీస్తారు. న‌ల్ల‌మందు కావాలంటే.. కాయలు మొక్క‌పై ఉండ‌గానే.. పైభాగం మీద చిన్న గాటు పెడ‌తారు. వెంట‌నే తెల్ల‌గా, చిక్క‌గా ఉండే ద్రవం బ‌య‌టికి వ‌స్తుంది. ఇది గ‌ట్టిప‌డి కాయపై ఉండిపోతుంది. ఈ ద్ర‌వం ఆరిన త‌ర్వాత ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. దానిని జాగ్రత్త‌గా సేక‌రిస్తారు. దీనినే న‌ల్ల‌మందు అని పిలుస్తారు.
8. గ‌స‌గ‌సాల దిగుబడిని ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ అమ్మ‌డానికి, ఇంట్లో నిల్వ ఉంచుకోవ‌డానికి వీలులేదు. మెుత్తం పంట‌ను తప్పనిసరిగా సీబీఎన్ ఏర్పాటు చేసిన కేంద్రాలలోనే అమ్మాలి.
9. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఎవ‌రైనా అక్ర‌మంగా గ‌స‌గ‌సాల‌ను సాగుచేసినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా, అమ్మినా.. వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తారు. దోషులుగా తేలితే 10 ఏళ్ల‌కుపైగా జైలుశిక్ష, రూ.1.5 ల‌క్ష‌ల వరకు జరిమానా విధిస్తారు.
10. గసగసాల సాగుపై నిషేదం ఎత్తివేయాలన్న డిమాండ్ ఎన్నాళ్లుగానో ఉంది. కొకైన్, హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలతో పోల్చితే ఓపియం ప్రమాదకరమైనది కాద‌ని వారు చెప్తున్నారు. అంతేకాకుండా గ‌స‌గ‌సాలు మ‌న దేశ సంప్ర‌దాయంలోనే ఇమిడి ఉంద‌ని, నిషేదం ఎత్తివేయాల‌ని ఎంతో మంది కోరుతున్నారు.
* పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ సైతం నిషేధాన్ని ఎత్తివేయాలని ఎన్నాళ్లుగానో పోరాడుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఒళ్లునొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న త‌మ సమీప బంధువు ఒకరు రోజూ ఓపియం తీసుకోవడం వ‌ల్ల నొప్పులు త‌గ్గి.. జీవిత‌కాలం పెరిగింద‌ని చెప్పారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)