చెప్పుచేతల్లో ఉండాలనే నగ్న వీడియో.. బయటపెడతానంటూ బాలికకు బ్లాక్‌మెయిల్‌.. వీడియో తీయొద్దన్నందుకు నెత్తురొచ్చేలా దాడి..

ఆ యువకుడికి ఆ బాలిక ప్రేయసి! ఇద్దరూ చాలాసార్లు శారీరకంగా కలుసుకున్నారు కూడా. చెప్పిన చోటుకు అతడెప్పుడు పిలిచినా ఆమె వెళ్లేది. అతడితో సన్నిహితంగా గడిపేది. అలాంటిది... అదే యువకుడు.. ఓ అర్ధరాత్రి బాలికను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి వివస్త్రను చేసి.. రక్తాలొచ్చేలా ఎందుకు కొట్టాడు? నగ్నంగా ఉన్న ఆ బాలిక వద్దు వద్దంటూ ప్రాధేయపడుతున్నా ఆమెను సెల్‌ఫోన్లో ఎందుకు చిత్రీకరించాడు? తనతో తప్ప ఆమె ఎవ్వరితోనూ మాట్లాడకూడదు.. చనువుగా ఉండకూడదు అన్నకసే ఆ యువకుడిని ఇంతటి ఉన్మాదానికి ప్రేరేపించింది. ఇతరులతో చనువుగా ఉంటున్నందుకు బ్లాక్‌మెయిల్‌ చేసేందుకే ఆమెను వివస్త్రను చేసి వీడియో తీశాడు! లోయర్‌ ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో ఓ బాలిక పట్ల అమానవీయంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బషీర్‌బాగ్‌కు చెందిన నాగరాజు (19). గాంధీనగర్‌ ఠాణాలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ వెల్లడించిన వివరాల ప్రకారం నాగరాజు, దోమల్‌గూడకు చెందిన బాలిక (16) ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. నాగరాజు ఇంటర్‌, ఆ బాలిక పాలిటెక్నిక్‌ చదువుతోంది. 8నెలలుగా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉంది. ఇద్దరూ లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని డీబీఆర్‌ మిల్‌లో గుట్టుగా కలుసుకునేవారు.

రక్తమొచ్చేలా కొట్టాడు
తాను ప్రేమించిన బాలిక ఇతరులతో చనువుగా ఉంటోందనే అనుమానంతో ఆమెపై కసి పెంచుకున్నాడు నాగరాజు. ఆమె తన చెప్పుచేతల్లోనే ఉండేందుకు పథకం వేసుకున్నాడు. ఈ నెల 2న రాత్రి ఆమెను లోయర్‌ ట్యాంక్‌బండ్‌ డీబీఆర్‌ మిల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బలవంతంగా ఆమె బట్టలన్నీ విప్పదీశాడు. ఆమె వివస్త్రగా ఉండగా సెల్‌ఫోన్లో చిత్రీకరించాడు. ఒకదశలో సెల్‌ఫోన్‌ లాక్కునేందుకు ప్రయత్నించిన ఆమెను ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. దీంతో ఆమె నోటివద్ద గాయమై తీవ్ర రక్తస్రావమైంది. గొడవ ముగిశాక ఇద్దరూ ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. ఈనెల 6న రాత్రి నాగరాజు మరోసారి ఆ బాలికను డీబీఆర్‌ మిల్‌లో కలుద్దామని పిలిచాడు. అయితే ఆ బాలిక తన స్నేహితులకు 2న జరిగిన విషయాన్ని, వీడియో రికార్డింగ్‌ గురించి చెప్పుకొని భోరుమంది. 6న రాత్రి ఆమెను అనుసరిస్తూ 8 మంది యువకులు డీబీఆర్‌ మిల్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడున్న నాగరాజును వారు పట్టుకొని చితకబాదారు. అతడి సెల్‌ఫోన్‌ లాక్కుని బాలిక నగ్న దృశ్యాల రికార్డింగ్‌ను తమ సెల్‌ఫోన్లలోకి బదిలీ చేసుకొని.. అతడి ఫోన్లో నుంచి డిలీట్‌ చేశారు.

పెళ్లి చేసుకోవాలనుకొని..
ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలియడంతో నాగరాజు, ఆ బాలిక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ఈనెల 7న ఇంటినుంచి వెళ్లి పోయారు. రాత్రి కూతురు ఇంటికి రాకపోవడంతో బాలిక తండ్రి 8న గాంధీనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సెల్‌ఫోన్‌ ఆధారంగా బాలిక నెక్లె్‌సరోడ్‌లో ఉన్నట్లు గుర్తించి గాంధీనగర్‌ ఠాణాకు తీసుకొచ్చి విచారించారు. తన పట్ల నాగరాజు ప్రవర్తించిన తీరును ఆ బాలిక రోదిస్తూ చెప్పింది. ఆమె వాంగ్మూలం ఆధారంగా నాగరాజును అరెస్టు చేశారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కౌన్సెలింగ్‌ కూడా ఇప్పించారు.

విచారణలో నాగరాజు.. బాలిక ఇతరులతో చనువుగా ఉండడం తనకు ఇబ్బందిగా మారిందని, ఆమె తనకు దక్కకుండా పోతుందనే భయంతోనే సెల్‌ఫోన్‌లో ఆమె నగ్నంగా ఉన్న దృశ్యాలను చిత్రీ కరించానని చెప్పాడు. ఎవరితోనైనా చనువుగా ఉంటే ఈ వీడియో బయటపెడతానని ఆమెను నాగరాజు బ్లాక్‌మెయిల్‌ చేశాడని డీసీపీ తెలిపారు. డీబీఆర్‌ మిల్‌లో ఈనెల 2న వీడియో తీసిన సమయంలో బాలికపై లైంగికదాడి చేశాడని చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ గంజాయి, వైట్‌నర్‌లాంటి పదార్థాలు తీసు కోలేదన్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరూ డీబీఆర్‌ మిల్‌లో కలుసుకుంటున్నారని చెప్పారు. బాలిక తండ్రి ఫిర్యాదు, బాలిక ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా నాగరాజుపై పోక్సోతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)