మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టును ఇరగదన్ని పట్టించాడు… కానీ..?

అది బీహార్‌లో గయ… రాజేంద్ర ఆశ్రమ్ ఏరియా… ఆ షాపు పేరు గయ సైబర్ కేఫ్..! దాని ఓనర్ పేరు అనురాగ్ బసు… 29 ఏళ్ల వయస్సు… కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది తనకు… తన కేఫ్‌కు అప్పుడప్పుడూ వచ్చిపోయే ఓ వ్యక్తిని చూస్తుంటే తనకు ఏదో డౌట్… ఎవరబ్బా అతను..? అందరికన్నా భిన్నంగా… సందేహాస్పదంగా.,. తన వెంట పెన్ డ్రైవ్స్ ఉంటాయి… చకచకా అందులో అప్పటికే టైపు చేసి ఉన్న మ్యాటర్ మెయిల్ చేసేస్తాడు… కాస్త మూలకు, దూరంగా ఉండే చోట కంప్యూటర్ ఎంచుకుంటాడు… తను కంప్యూటర్ తెరను చూసిన సమయంకన్నా వెనుకకూ, పక్కలకు అనుమానంతో చూసే సమయమే ఎక్కువ ఉంటుంది… అనేక సైట్లు ఓపెన్ చేస్తాడు… పోయేముందు మొత్తం సెర్చ్ హిస్టరీ కూడా డిలిట్ చేస్తాడు… చాలామంది తమ మెయిల్ ఖాతాల నుంచి లాగవుట్ అవుతారు, కొందరు ఆ పని కూడా చేయరు గానీ, తనొక్కడే బ్రౌజింగు హిస్టరీ మొత్తం డిలిట్ చేస్తుంటాడు… పోలీసు నిబంధనల ప్రకారం కేఫుల్లో ఏదైనా ఐడీ చూపించాలి… అవీ చూపించేవాడు కాదు…

అతను ఆ ఏరియావాడే కాదు… అనురాగ్‌లో డౌట్లు పెరిగిపోతున్నాయి… ఓసారి నెట్‌లో అనుకోకుండా ఢిల్లీ పోలీసుల ప్రెస్ రిలీజ్ చూశాడు… మోస్ట్ వాంటెడ్ నేరస్థుల ఫోటోలతో కూడిన నోట్ అది… అందులో ఒక మొహం తరచూ తన కేఫ్‌కు వచ్చే ఆ అనుమానాస్పద వ్యక్తి మొహంలాగే అనిపించింది… పేరు చూస్తే తౌసీఫ్… గయలోని ముఖ్యమైన పోలీసాఫీసర్ల నంబర్లు సేకరించాడు… అవీ ప్లస్ ఈ వాంటెడ్ నేరస్థుల నోట్ ప్రింటవుట్లు తీసి, తన స్టాఫ్‌కు ఇచ్చాడు… ఓరోజు మధ్యాహ్నం అతను వచ్చాడు కేఫ్‌కు… తనతోపాటు మరో వ్యక్తీ ఉన్నాడు… వాళ్లు అడిగిన కంప్యూటర్ ఇచ్చేసి, నేరుగా ఎస్పీకి కాల్ చేశాడు అనురాగ్…

రెస్పాన్స్ లేదు… షాపు నుంచి బయటికి వచ్చి వేరే పోలీసు అధికారులకు కాల్ చేయటానికి ప్రయత్నించాడు… ఒకరిద్దరికి ఆల్‌రెడీ చెప్పిపెట్టాడు… ఫోన్ చేస్తే వస్తామనీ వాళ్లు చెప్పారు… కానీ డజను కాల్స్ చేసినా తీసుకునేవాళ్లు లేరు, రెస్పాన్సే లేదు… పోలీసుల జాడ లేదు… అయితే అనురాగ్ ఇలా ఫోన్ కాల్స్ కోసం షాపు నుంచి బయటికి వస్తూ పోతున్న తీరు చూసి, కేఫ్‌కు వచ్చిన సదరు వాంటెడ్ పర్సన్స్‌కు డౌటొచ్చింది… హడావుడిగా బయటికి వచ్చి గబగబా వెళ్లిపోయారు… అనురాగ్‌ కేకలు వేశాడు, చుట్టుపక్కల షాపువాళ్లు ఎవరూ పట్టించుకోలేదు… తనలోని బ్లాక్ బెల్ట్ హోల్డర్ బయటికి వచ్చాడు… తనే పరుగులు తీసి, పట్టుకున్నాడు… నేరుగా వాళ్లతో ముఖాముఖి తలపడ్డాడు… ఈ కొట్లాటలో రెండు మొబైల్స్ పగిలిపోయాయి… వాళ్లు తప్పించుకోకుండా జాగ్రత్తపడుతూ కొన్ని పంచెస్ బలంగా ఇచ్చాడు… ఆయువుపట్లలో కొట్టాడు…

అనుకోకుండా అటువైపు వచ్చిన ఓ పెట్రోలింగ్ వెహికల్‌లోకి తోశాడు… ఇక తప్పనిసరై పోలీసులు కాస్త మర్యాద చేసేసరికి కొన్ని వివరాలు బయటపడ్డాయి… నిజంగా అనురాగ్ అనుమానించినట్టు అతను తౌసీఫే… తన వెంట ఉన్న మరొకడు సన్నాఖాన్… వీరి సమాచారం తెలిశాక నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ రంగంలో దిగింది… అప్పుడు మొత్తం వివరాలు తెలిశాయి… ఈ తౌసీఫ్ ఎవరంటే..? అహ్మదాబాద్‌లోని జుహపురవాసి… 2008లో అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లు జరిగి 56 మంది చనిపోయారు… 200కు పైగా గాయపడ్డారు… జస్ట్, ఆ ఆపరేషన్ తనొక్కడే చేశాడు… అంత నోటోరియస్ ఉగ్రవాది…

ఆ ఆపరేషన్ తరువాత 1600 కిలోమీటర్ల దూరం ఉన్న గయకు వచ్చాడు… పేరు మారింది, ఇక్కడ మొహమ్మద్ అతీక్… తను మహారాష్ట్రలోని ఓ కాలేజీలో ఇంజనీరింగు చదివాడు… ఆ జ్ఞానంతో గయ సమీపంలోని కర్నౌని అనే గ్రామంలో లెక్కల టీచరుగా రహస్యంగా బతుకుతున్నాడు… 9 సంవత్సరాల పాటు నిఘా సంస్థల వేట నుంచి తప్పించుకున్నాడు… చివరకు అనురాగ్ కారణంగా పట్టుబడ్డాడు… ఆ ఏరియాలోని కొందరు ముస్లిం యువకులను ఐసిస్‌లోకి రిక్రూట్ చేసే పనిలో పడ్డాడు ఇటీవల… బీహార్‌లో ఐసిస్ ప్లాన్లు, కదలికలు మొదటిసారిగా బయటికొచ్చింది ఇలాగే…

ఇక్కడ సీన్ కట్ చేద్దాం…. ఇది జరిగి చాలా రోజులైంది… అనురాగ్ కేఫ్‌పై ఉగ్రవాదులు ఎప్పుడైనా ప్రతీకారదాడి చేస్తారనే భయంతో కస్టమర్లు రావడం తగ్గించేశారు… తన దగ్గర పనిచేసే స్టాఫ్ ఆ జాబ్స్ వదిలేశారు భయంతో… నెలలుగా అద్దె కట్టకపోవడంతో షాపు ఓనర్ ఖాళీ చేయాలంటూ నోటీసు ఇచ్చాడు… ఇంట్లో ఇద్దరు తల్లిదండ్రులు, భార్య, భర్త, ఓ అబ్బాయి… చివరకు దమ్మిడీ ఆదాయం లేకుండా అయిపోయింది… నెలకు 60 వేల దాకా సంపాదించేవాడు కాస్తా చేతిలో చిల్లిగవ్వ లేకుండా మిగిలాడు… బీహార్ పోలీసు తనవైపు కన్నెత్తి కూడా చూడలేదు… కనీసం తన రక్షణ మాటేమిటో కూడా ఆలోచించలేదు… కాస్త ఆర్థికంగా సాయం చేద్దామనే సోయి కూడా లేదు… చివరకు కేంద్ర హోం శాఖ గత డిసెంబరు(2017)లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ రాస్తే…. ప్రభుత్వం తనకు చేసిన ఆర్థికసాయం అక్షరాలా 3500 రూపాయలు… ఒక పౌరుడు తన నరనరాల్లో దేశభక్తిని నింపుకుని, నేరుగా తలపడి, ఉగ్రవాదులను పట్టిస్తే చివరకు దక్కింది అదీ… అదే సదరు టెర్రరిస్టు ప్రాణాల రక్షణ కోసం ఆ ఉగ్రవాద సంస్థ తనను 1600 కిలోమీటర్ల దూరానికి తరలించి, అన్నిరకాలుగా అండగా నిలబడింది… ఉగ్రవాదుల వేటలో సహకరించాలని పిలుపునిచ్చే నైతికత మన ప్రభుత్వాలకు ఉందా..?!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)