‘మహానాయకుడు’ సినిమాను ఫ్రీగా చూపించినా చూడటం లేదు దేనికి..?

కథానాయకుడు సినిమా అట్టర్ ఫ్లాప్… మహానాయకుడు డిజాస్టర్… ఎంత అంటే..? ఫ్రీ షోలు వేస్తున్నా కరడుగట్టిన తెలుగుదేశం అభిమానులు, ఎన్టీయార్ ఫ్యాన్స్ కూడా ఆ థియేటర్ల జోలికి వెళ్లడం లేదు… ఏమిటంతగా ఎదురుతన్నింది…? అంత ఖర్చు పెట్టి, అంత ఎఫర్ట్ పెడితే ఎందుకు ప్రజలు అడ్డంగా తిరస్కరించేశారు..? నిజానికి ఓ సినిమా నటుడిగా, ఓ రాజకీయ నాయకుడిగా ఎన్టీయార్ కథ మామూలు కథ కాదు కదా… కోట్ల మంది అభిమానులు.. కానీ ప్చ్…! అదే వైఎస్ఆర్ చేసిన ఓ పాదయాత్ర బేస్‌గా ‘యాత్ర’ తీస్తే జనం ఎందుకు ఆదరించారు..? ఆ రెండు సినిమాల్లో ఎన్టీయార్‌ ఆహా ఓహో… ఈ సినిమాలోనూ వైఎస్ ఆహా ఓహో… రాంగోపాల్ వర్మ మహానాయకుడి జీవితంలోని మరోకోణం, అసలైన కోణం ఇదీ అంటూ లక్ష్మీస్ ఎన్టీయార్ తీస్తున్నాడు, ఆ పాటలకు, ఆ ట్రెయిలర్లకు బాగా రెస్పాన్స్ వస్తున్నది… సరే, ఆయా వ్యక్తుల నెగెటివ్ కోణాల్ని దాచిపెట్టేసి, వీలయినంతవరకూ హీరోదాత్తంగానే ఆ పాత్రల్ని ఎలివేట్ చేస్తారు… సినిమాటిక్ స్వేచ్ఛ పేరిట కొన్ని నిజాల వక్రీకరణ కూడా తప్పదు… కానీ మరీ ఈ భిన్న ఫలితాలేమిటి..? మహానటి సినిమా సూపర్ హిట్ ఎందుకైందీ అంటే… సావిత్రి ఎదుగుదలనే కాదు, పతనాన్ని, ఆమె వ్యసనాల్ని కూడా బాగా చూపించారు… ప్రజల మనస్సుల్లో ఆయా వ్యక్తుల జీవితాలు, తత్వాల పట్ల ఓ అంచనా ఉంటుంది… దాన్ని కాదని మరీ వక్రీకరణకు పూనుకుంటే మహానాయకుడి రిజల్ట్ ఉంటుంది… కాస్త కీర్తిస్తే పర్లేదు, కానీ కథానాయకుడు సినిమాలో ఎన్టీయార్‌ను ఏకంగా దేవుడిని చేసేశారు… తీపి మరీ ఎక్కువైన వెగటు అది… మహానాయకుడిలో చంద్రబాబును హీరోను చేశారు… జనానికి బాగా తెలిసిన కథను అలా చెబితే జనం ఎలా స్వీకరిస్తారు మరి..? యాత్ర సక్సెస్‌కు కారణం అందులో జనం కన్నీళ్లున్నయ్, ఉద్వేగాలున్నయ్… అందుకే జనం కనెక్టయ్యారు…

ఇవే కాదు… ఈమధ్య పలు భాషల్లో చాలా బయోపిక్స్ వచ్చాయి… నిజానికి ఇవన్నీ ఏకపక్ష బయోపిక్స్… ఆయా వ్యక్తుల జీవితాల్లోని అన్ని పార్శ్వాలనూ నిష్పాక్షికంగా తడిమేవి కావు… కేవలం నాలుగు పాజిటివ్ పాయింట్స్ ఫోకస్ చేస్తున్నారు అంతే… జనానికి తెలియని కొత్త విషయాలేమిటో చెప్పడం గానీ, ఆయా వ్యక్తుల అసలైన తత్వాల్ని ఆవిష్కరించాలనే సోయి గానీ ఉండటం లేదు… ధోని, సచిన్‌లపై వచ్చిన సినిమాల్ని జనం లైట్ తీసుకున్నారు… పరిస్థితులతో ఘర్షణ పడటం, పోరాడటం లేదు వాటిల్లో… కానీ ఒక మేరీకామ్ కథ సక్సెసైంది… ఒక దంగల్ సూపర్ హిట్టయింది… ఒక మిల్కాసింగ్ కథ కూడా జనానికి నచ్చింది… వేదనల నుంచి వచ్చిన విజయానికి విలువ ఎక్కువ…

ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, మహానాయకుడు, థాకరే, యాత్ర… ప్రతి సినిమా నిర్మాణం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నయ్… కానీ ఫలితాలు వేర్వేరుగా ఉన్నయ్… క్రియేటివ్ డిఫెక్టులతోపాటు చాలా కారణాలుంటయ్… మహానాయకుడి విషయానికొస్తే అన్నీ దాచేసి, అందరికీ తెలిసిన విషయాలే చెప్పేసి, పైగా సదరు వ్యక్తి కథలో విలన్ని తెరపై హీరోగా చూపేసరికి అది వికటించింది… సేమ్, థాక్రే… తన తత్వం వేరు, తన పోకడ వేరు… దాన్ని తెరపై సరిగ్గా ఆవిష్కరించలేదు, జస్టిఫై చేయలేదు సరికదా ఆహా ఓహో టైపు భజన మాత్రమే నమ్ముకున్నాడు దర్శకుడు…

తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు బయోపిక్ ‘తెలంగాణ దేవుడు’ పేరిట తీస్తున్నట్టు ఆమధ్య ప్రకటించారు… కానీ చాలా టఫ్ టాస్క్ అది… ఏమైందో తెలియదు కానీ ఎన్టీయార్, మన్మోహన్, థాకరే, వైఎస్ బయోపిక్స్ చూశాక… ఆ ఫలితాల్ని విశ్లేషించాకే తదుపరి అడుగులు వేస్తారేమో మరి… కేవలం వైఎస్ పాదయాత్రను బేస్‌గా తీసుకున్న యాత్ర సినిమాలాగా కేసీయార్ మొత్తం జీవితకథను గాకుండా తెలంగాణ పోరాటాన్ని మాత్రమే ఎఫెక్టివ్‌గా చూపగలిగితే కాస్త బెటరేమో… కానీ ఎన్టీయార్‌ను దేవుడిని చేసినట్టు కేసీయార్‌ను కూడా దేవుడిని చేసేస్తే… కష్టమే… జయలలిత జీవితంపై తలైవి, ది ఐరన్ లేడీ సినిమాలు నిర్మాణంలో ఉన్నయ్… ఆమె జీవితమూ రెండుగా తీయాలేమో బహుశా… కథానాయికగా ఎదిగి, రాజకీయాల్లోకి ఎంట్రీ వరకు ఫస్ట్ పార్ట్… అందులో పెద్ద ఘర్షణ ఉండదు, పెద్ద ఎమోషన్స్ కూడా ఉండవు… మహా అయితే శోభన్ బాబు ఎపిసోడ్స్ ఎలా ఇరికించగలరో చూడాలి… రెండో పార్టులో ఆమె రాజకీయ జీవితం… అందులో పోరాటం ఉంది, అవమానం ఉంది, ఆమె నిలబడిన తీరు ఉంది, ధిక్కారం ఉంది, తెగింపు, తెగువ ఉన్నయ్… కానీ ఆ కథలో శశికళ కూడా ఉంది, ఎంజీఆర్ ఉన్నాడు, విపరీతమైన అవినీతి ఉంది… అంత బతుకు బతికి చివరకు ఎలా మరణించిందో కూడా తెలియని మిస్టరీ చావు ఆమెది… ఏం చూపిస్తారు, ఏం దాచేస్తారు..? అన్నీ దాచి, కేవలం ఓ దేవతగా చిత్రీకరిస్తే జనం మెచ్చుతారా..? ఇలా చెబుతూ పోతే బయోపిక్స్‌పై ఎంత రాసినా ఒడవదు… తెగదు… ఇక్కడ ఆపేద్దాం ఇక…
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)