హద్దులు దాటిన ఆర్కే అత్యుత్సాహం… రాజును మించిన రాజభక్తి..!

రాజును మించిన రాజభక్తి… ఈరోజు ఈనాడు చూశారా..? ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి కవరేజీ… దాదాపు ముప్పావు పేజీ… 14 కలర్ ఫోటోలు… ‘తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే వినాలి, కంటే అంబానీ ఇంట పెళ్లినే కనాలి’ అట… హహహ… వేల కోట్లను ఇచ్చి, ఈనాడును కాపాడినందుకు మరి స్వామిభక్తిని ప్రదర్శించుకోవాలిగా… ముఖేష్‌కు సొంత పత్రిక ఉన్నా, మరీ ఇంత అతి కవరేజీ ఉండదేమో… (హైదరాబాద్ తెలంగాణలోనే ఉందా..? ఎందుకంటే..? మోదుగుల వైసీపీలో చేరితే ఐటం ఉండదు, బుగ్గన ప్రెస్ మీట ఐటమ్ ఉండదు, గౌరు దంపతులు టీడీపీలో చేరిన వార్త మాత్రం ఉంటుంది, బాబు ప్రెస్ మీట్ ఇస్తారు… ఏం పైత్యం బాసూ..?) సేమ్, ఆంధ్రజ్యోతి… వందల కోట్లను చంద్రబాబు ఆంధ్రజ్యోతికి సమర్పిస్తున్నందుకు రాధాకృష్ణ ప్రదర్శించే స్వామిభక్తి కూడా సేమ్… అది అక్షరాలా తెలుగుదేశం పత్రికే… కానీ మరీ రాజభక్తి ఎక్కువై, రాధాకృష్ణ మరీ మరీ శివాజీ స్థాయికి పడిపోవాల్సిన అవసరం ఉందా..? అదీ ప్రశ్న… ఈరోజు తను రాసుకున్న కొత్త పలుకులో లాజిక్కులు కాదు కదా… చంద్రబాబును మించిన ఏడుపు… ఆ కన్నీళ్లతో ఆంధ్రజ్యోతి ఈరోజు మరింత ఎక్కువ ‘తడితడిగా’ కనిపిస్తున్నది… దీన్నే రాధాకృష్ణ భాషలో ‘హద్దులు దాటిన అత్యుత్సాహం’ అంటారు… ఓసారి తన వ్యాఖ్యల్ని చూద్దాం…

…. నేరం జరిగిన ప్రదేశం ఎక్కడవుంటే అక్కడి పోలీసులే కేసులు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తుంటారు. డేటాచోరీ జరిగి ఉంటే అది ఎక్కడ? ఏపీలో కదా? మరి ఏపీలో జరిగిన దానిపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేయడం ఏమిటి? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ విజయవాడకు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో దొంగతనం చేసి విజయవాడ వెళ్లిపోయినా కేసు హైదరాబాద్‌లోనే పెడతారు కదా? అని ప్రశ్నించారు. అలాంటప్పుడు ఆయన మాటల ప్రకారం డేటాచోరీ జరిగితే గిరిగితే ఏపీలో కదా కేసు పెట్టాల్సింది! ఘనత వహించిన తెలంగాణ పోలీసులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది తమ పరిధిలోకి రాకపోయినా తామే దర్యాప్తు చేస్తామని ప్రకటించుకున్నారు… ఇదీ ఆర్కే వాదన…

అయ్యా, సారూ… ఐటీ గ్రిడ్స్ కంపెనీ ఉంది హైదరాబాదులో, చోరీ జరిగిందీ ఇక్కడే, సర్వర్లు ఇక్కడే, ఉద్యోగులు ఇక్కడే, నేరం ఏపీలో జరిగిందీ అంటావేమిటి..? హైదరాబాదులో నేరం జరిగితే తెలంగాణ పోలీసులు గాకుండా ఇంకెవరు దర్యాప్తు చేయాలి..? అవును సార్… హైదరాబాదులో చోరీ చేసి బీహార్ పారిపోయినా సరే, ఆ బీహార్ ముఠాపై హైదరాబాదులోనే కేసు పెడతారు… ఇక్కడా జరిగింది అదే… దొంగ విజయవాడు వెళ్లి రక్షణ తీసుకున్నా సరే, హైదరాబాదులోనే కేసు పెట్టారు… ప్చ్, ఆర్కే ఏం మాట్లాడుతున్నాడో ఏమో…

విజయవాడలో ఎవరి ఓటైనా అక్రమంగా తొలగించివుంటే ఆ విషయాన్ని పరిష్కరించడానికి అక్కడొక ప్రధాన ఎన్నికల అధికారి ఉన్నారు. తమ పరిధిలో లేని రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌ అధికారాలను తామే సంక్రమింపజేసుకుంటామని అంజనీకుమార్‌ అంటున్నారు. ఈ చర్యను ఆయన ఎలా సమర్థించుకుంటారో తెలియదు! మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో కాస్తంత గుజ్జు ఉన్నవాళ్లెవరూ ఇలాంటి కేసులు టేకప్‌ చెయ్యరు. ఇవ్వాళ కాకపోయినా రేపు అయినా తెలంగాణ పోలీసుల తీరు న్యాయసమీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐటీగ్రిడ్స్‌ కంపెనీ హైదరాబాద్‌లో ఉంది కనుక కేసు మా పరిధిలోకే వస్తుందంటున్న తెలంగాణ పోలీసుల వాదన న్యాయసమీక్షలో నిలబడదు… ఇదీ ఆర్కే వాదన…

తమ పరిధిలో జరిగిన ఏ నేరంపైనయినా హైదరాబాద్ పోలీసులు జోక్యం చేసుకునే అధికారం ఉంది, దర్యాప్తు చేయవచ్చు… ఇందులో న్యాయసమీక్ష దాకా ఎందుకు..? ఈమాత్రం కామన్ సెన్సుకు మెడకాయ మీద తలకాయ, ఆ తలకాయలో కాస్తంత గుజ్జు దాకా అవసరం లేదు… అవునూ ఈ మెడకాయ, తలకాయ, గుజ్జు అని ఎవరి గురించి చెబుతున్నారు లేదా చెప్పుకుంటున్నారు..?

ఎన్నికల కమిషన్‌ వద్ద భద్రంగా ఉండాల్సిన వివరాలన్నీ భద్రంగానే ఉన్నాయనీ, ఇక ప్రభుత్వం వద్ద సురక్షితంగా ఉండాల్సిన డేటా కూడా నిక్షేపంగానే ఉందనీ ఏపీ ఐటీ కార్యదర్శి విజయానంద్‌ ఇచ్చిన వివరణను కూడా జోడించి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ఎలక్షన్‌ కమిషన్‌కు నివేదిక పంపారు. దీంతో లోకేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్లుగా ఏ డేటా కూడా చోరీకి గురికాలేదని స్పష్టమవుతోంది. మా సమాచారం ఏదీ పోలేదు బాబోయ్‌ అని ఎన్నికల ప్రధానాధికారి, ఐటీశాఖ కార్యదర్శి చెబుతున్నా తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడానికి కారణం ఏమిటో అర్థంకావడం లేదు.. వైసీపీ నాయకులు గానీ, తెలంగాణ పోలీసులు గానీ ఆరోపిస్తున్నట్లుగా ఏపీ ప్రజల బ్యాంక్‌ ఖాతాల వివరాలు ఆ యాప్‌లో లేవని తెలుగుదేశం పార్టీ ఘంటాపథంగా చెబుతోంది… ఇదీ ఆర్కే వాదన…

దీన్నే మరి శివాజీ భాష అంటారు… ఏ లొసుగూ లేకపోతే ఆ యాప్‌లోని ఏ సమాచారం డిలిట్ చేశారు, ఎందుకు మోడిఫై చేశారు..? చోరీ జరగలేదు అని గాకుండా మొదట్లో మీరెందుకు కేసు పెడతారు..? ఏపీ పోలీసులు కదా చేయాల్సింది అని కదా టీడీపీ ఎదురుదాడికి దిగింది..? మరి ఈ డౌట్లన్నీ తేర్చాలంటే అసలు నిజాలు బయటపడాలి కదా… పడనివ్వండి, తప్పే జరగనప్పుడు, చోరీయే జరగనప్పుడు, డేటా దుర్వినియోగమే లేనప్పుడు… ఎందుకు ఇంతగా ఉలిక్కిపడటం..?

ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న జగన్‌కు ఆంధ్రా పోలీసులపై మాత్రం నమ్మకం ఉండదు. అందుకే తెలంగాణ పోలీసులను ఆశ్రయించడమే కాకుండా పొగడుతుంటారు. ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయితే ఆంధ్రా పోలీసులను తొలగించి ఏపీలో శాంతిభద్రతల బాధ్యతను కూడా తెలంగాణ పోలీసులకే అప్పగిస్తారేమో? ఆర్కే మార్కు ప్రశ్న…

కేసీయార్ చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీయటానికి హైటెక్ సిటీని కూల్చేస్తాడు అన్న శివాజీ మాటలకూ, రాధాకృష్ణ రాతలకూ నడుమ వీసమెత్తు తేడా కనిపించడం లేదు…రెండు రోజుల క్రితం సినీనటి జయసుధ వైసీపీలో చేరారు. నిజానికి ఆమెకు జగన్‌ పార్టీలో చేరాలన్న ఆలోచన లేదు. తెలంగాణ యువరాజు కేటీఆర్‌ కొద్దిరోజుల క్రితం జయసుధకు ఫోన్‌ చేసి జగన్‌ను కలిసి వైసీపీలో చేరాలని కోరారట. తొలుత అందుకు నిరాకరించిన జయసుధ చివరకు ఒత్తిళ్లకు తలవంచక తప్పలేదంటున్నారు. ఇది నిజం కాదని కేటీఆర్‌ చెప్పగలరా?

సరే, కేటీయార్ చెప్పగానే, ఏదో బెదిరించగానే జయసుధ వైసీపీలో చేరింది..? నిజమే అనుకుందాం… ఆమెను బెదిరించటానికి ఆమె అక్రమ వ్యాపారాలు ఏమున్నయ్..? అయితే గియితే అలా బెదిరించాలంటే సీమ, కోస్తాలకు చెందిన టీడీపీ నేతలంతా హైదరాబాదులోనే కదా ఉండేది, ఇక్కడే కదా ఆఫీసులు, యవ్వారాలు… చేయాలనుకుంటే పెద్ద పెద్ద నేతల్ని బెదిరించలేడా కేటీయార్..? మరీ జయసుధను బెదిరించడం అవసరమా..?

గ్రహచారం కొద్దీ ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఆత్మరక్షణలో పడిన చంద్రబాబు కొంత కాలంపాటు తగ్గి ఉన్నప్పటికీ, సామంత రాజులా పడిఉండటం ఇష్టంలేక ఇప్పుడు ‘‘ఏమి చేసుకుంటావో చేసుకో..’’ అని ఎదురు తిరగడాన్ని సహించలేని కేసీఆర్‌కు జగన్మోహన్‌రెడ్డి అయాచిత వరంగా లభించారు…. ఇదీ ఆర్కే విశ్లేషణ…వోటుకునోటు కేసులో ఆత్మరక్షణలో పడి, తగ్గి ఉంటూ, సామంతరాజులా పడి ఉన్నాడని చివరకు ఆర్కే కూడా అంగీకరిస్తున్నట్టేనా..? హహహ… (నిజంగా జగన్, కేసీయార్‌లను తిట్టాలంటే బోలెడు అంశాలు దొరుకుతయ్… వాటిని పట్టుకొండి ఆర్కే గారూ…)

తమకు గిట్టని పత్రికలకు కులం ఆపాదించడానికి కూడా విజయసాయిరెడ్డి వెనుకాడటం లేదు. జగన్‌ మీడియాలో వివిధ శాఖాధిపతులు, విభాగాల అధిపతులు ఏ కులానికి చెందినవారో విజయసాయిరెడ్డి బయటపెడితే ఎవరిది ఏ కులపత్రికో ప్రజలకు తెలుస్తుంది. విజయసాయిరెడ్డి అందుకు సిద్ధమైతే మేం కూడా సిద్ధమే..! బాబ్బాబు, ఆ పనిచేయండి బాసూ… మీడియాలో మరీ కులపైత్యం ఎక్కువైపోయింది… మీ రెండు పత్రికలే కాదు, ఈనాడులోనూ ఏయే పోస్టుల్లో ఏ ప్రాంతం, ఏ కులమే రాజ్యమేలుతున్నదో లెక్కలు తీయండి… లేదంటే మూడు ప్రధాన మీడియా హౌజుల్లో ఈ కులరాజ్యం గుట్టు తేల్చటానికి నిష్పాక్షిక జర్నలిస్టులతో ఓ కమిటీ వేయండి… మీకు పుణ్యముంటుంది ఆర్కే సాబ్…
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)