సైకిల్ ఓనర్.. టైర్ పంక్చరర్: వర్మ ట్వీట్‌పై పేలుతున్న జోకులు!

నటసార్వభౌముడు, తెలుగు ప్రజల అభిమాన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాన్ని ఆధారంగా తీసుకొని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. వెన్నుపోటు కాన్సెప్ట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను వర్మ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘వెన్నపోటు’ పాట తీవ్ర దుమారం రేపింది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం, లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవడం, అన్నగారికి చంద్రబాబునాయుడు షాక్ ఇవ్వడం ఈ అంశాలనే తన సినిమాలో వర్మ చూపించనున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా నందమూరి బాలక్రిష్ణ ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ అనే రెండు చిత్రాలను నిర్మించారు. ‘కథానాయకుడు’ ఇప్పటికే విడుదల కాగా.. ‘మహానాయకుడు’ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, బాలయ్య నటించిన ఈ చిత్రాలకంటే ప్రస్తుతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పైనే ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్‌కు జరిగిన నయవంచన, వెన్నుపోటు గురించి ఈ సినిమాలో చూపించనుండటమే దీనికి కారణం. ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని మరింత పెంచేందుకు చిత్రంలోని స్టిల్స్‌ను ఒక్కొక్కటిగా వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ లుక్‌‌ను విడుదల చేసిన వర్మ.. తాజాగా లక్ష్మీపార్వతి, చంద్రబాబు నాయుడు పాత్రధారులను కూడా పరిచయం చేశారు. ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు న‌టిస్తున్నారు. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి కనిపించనున్నారు. ముఖ్యమైన చంద్రబాబు నాయుడు పాత్రలో ‘వంగవీటి’ సినిమాలో దేవినేని నెహ్రూగా నటించిన శ్రీతేజ్ నటిస్తున్నారు. అయితే ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, చంద్రబాబు ఉన్న ఫొటోను బుధవారం వర్మ ట్వీట్ చేశారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఈ పాత్రలు ఎవరివో చెప్పండని ప్రేక్షకులను అడిగారు. వర్మ ప్రశ్నకు ఇప్పుడు ట్విట్టర్‌లో జోకులు పేలుతున్నాయి.

ఈ సరదా కామెంట్లలో ‘సైకిల్ ఓనర్, టైర్ పంక్చరర్’ అనే జోకు బాగా పేలింది. ప్రతి ఒక్కరూ తమకు తోచిన కామెంట్‌ను ఎంతో ఫన్నీగా పెడుతున్నారు. ‘పొడిచినోడు.. పొడిపించుకున్నోడు’, ‘సైకిల్ ఓనర్, సైకిల్ రోబర్’, ‘నందమూరి బాహుబలి వెనుక నారా కట్టప్ప’, ‘ఇంత కష్టమైన ప్రశ్న ఐఏఎస్‌లో కూడా అడగలేదు.. ప్లీజ్ క్లూ ఇవ్వరా’ ఇలా బోలెడన్నీ ఫన్నీ కామెంట్లు వర్మ ట్వీట్ కింద దర్శనమిస్తున్నాయి. కాగా, ఈ ఫొటోతో పాటు లక్ష్మీపార్వతి లుక్, టీడీపీ నేతలతో ఎన్టీఆర్ సమావేశమైన సన్నివేశానికి సంబంధించిన ఫొటోను వర్మ ట్వీట్ చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)