కుంభ‌మేళా విశిష్టత..!

జనవరి 15 వతేదీ నుండి ప్రయాగరాజ్ లో నిర్వ‌హిస్తున్న‌ కుంభమేళా గురించి , దాని ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాము. దక్షిణాదిన మనందరకూ పుష్కరాలు, పుష్కరస్నానాలు, ఏయేనదులలో ఎప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసు కానీ ఈ కుంభస్నానాలనేవి కేవలం ఉత్తరదేశపు తీర్థాలకే సొంతం. మహా కుంభ మేళ అంటే ఏంటి? అసలు దాని చరిత్ర ఏంటి?
ప్రతి 12 యేళ్ళకు ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహా మేళా విశేషాలను లోతుగా పరిశీలిస్తే.. కుంభం అనగా కుండ లేదా కలశం. భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి (కుంభ రాశి). మేళా అంటే కలయిక లేదా జాతర. కుంభ రాశిలో నిర్వహించే ఉత్సవం కావడంతో దీన్ని కుంభమేళాగా పిలుస్తారని హిందూధర్మ శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

ఈ కుంభస్నానాలు..ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్ లలో జరుగుతాయి. మనవైపు పుష్కరాలు గురుగ్రహం యొక్క సంచారం లో ఒక్కొక్క రాశిప్రవేశంతో ప్రారంభమౌతాయి. 12రోజుల వరకూ కొనసాగుతాయి. అయితే ఈ కుంభస్నానాలు పైన పేర్కొన్న 4 చోట్ల ఖగోళీయ గ్రహగతుల ఆధారంగా ప్రారంభమ‌వుతాయి. పుష్కరస్నానాలకు గురుచారం ఒకటే ప్రాతిపదిక అయితే , ఈ కుంభస్నానాలకు గురుచారంతో పాటు రవి,చంద్రుల సంచారం కూడా ప్రాతిపదికగా తీసుకుని స్నానతేదీలను నిర్ణయిస్తారు.

ప్రయాగలో..కుంభస్నానాలు :
గురుడు మేషరాశిలో ఉండి రవి,చంద్రులు మకరరాశిలో ఉన్నపుడు అమావాస్య నాడు కుంభయోగం ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తరువాత, మకరసంక్రమణం నాడు మొదటి షాహీస్నాన్ తో కుంభస్నానాలు ప్రారంభమ‌వుతాయి. పై గ్రహస్థితి ప్రకారం 2013 న జనవరి 14 న మకరసంక్రమణం నాడు ప్రయాగలో కుంభమేళా ప్రారంభమైంది.

మరి ఇప్పుడు ఏమిటి..?
ఇది అర్ధకుంభ్. ప్రధాన కుంభమేళా 12 సంవ‌త్స‌రాల‌కోసారి వ‌స్తుంది. మధ్యలో 6 సంవ‌త్స‌రాల‌కోసారి అర్ధకుంభ్ ని నిర్వహించాలని కొన్ని శతాబ్దాలక్రితమే సాధు-సంత్ ల మండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అర్ధకుంభ్ కేవలం ప్రయాగ, హరిద్వార్ లలో మాత్రమే జరుగుతుంది. ఆయాచోట్ల ప్రధాన కుంభయోగానికి సరిగ్గా 6 సం.కు అర్ధకుంభ్ జరుపుతారు. అందువ‌ల్ల‌ 2013 లో కుంభ్ జరిగాక, 2019 లో అర్ధకుంభ్ జరుగుతోంది. అర్ధకుంభ్‌న‌కు ఖగోళ గ్రహగతులతో సంబంధం లేదు. ప్రధాన కుంభమేళా జరిగాక 6 సంవత్సరాలవ్వాలి. ఈ కుంభమేళా 2019 జనవరి 15 మంగళవారం సంక్రాంతి నుంచి 49 రోజుల పాటు మార్చి 4 మహాశివరాత్రి వరకు జరుగుతుంది.

ఈ కుంభమేళా గురించి..
భాగవతము, మహాభారతము, రామాయణము, విష్ణుపురాణము మొదలైన గ్రంధాలలో ఉన్నది. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన అమృత కలశం కోసం దేవతలు, రాక్షసులు యుద్ధం చేస్తుండగా ఆ కలశం ఒలికి నాలుగు చుక్కల అమృతం అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లలోని నదుల్లో ప‌డిన‌ట్లు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ నాలుగు ప్రదేశాలలో ఒక చోట ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. దీనిని సాధారణ కుంభమేళా అంటారు. 6 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే కుంభమేళాన్ని అర్ధకుంభమేళ అని, 12 సంవత్సరాలకు కొకసారి జరిగేదాన్ని పూర్ణ కుంభమేళ అంటారు. అలాగే 144 ఏళ్లకోసారి చేసే కుంభమేళాన్ని మహాకుంభ మేళా అంటారు. 2025 లో మరలా పూర్ణ కుంభమేళా జరగనుంది. అలాగే ప్రతి సంవత్సరము కొన్ని పుణ్యనదులకు పుష్కరాలు వస్తాయి. గురుడు ఏరాశిలో ప్రవేశిస్తే ఆనదికి పుష్కరము వస్తుంది. పుష్కరము అంటే 12 సంవత్సరాలు అని అర్ధము. ఈసారి గురుడు ధను రాశిలో ప్రవేసిస్తున్నాడు. కనుక 2019 నవంబర్ 5 మంగళవారం నుండి బ్రహ్మపుత్ర నదికి అనగా పుష్కరవాహిని నదికి పుష్కరాలు ప్రారంభమ‌వుతుంది. ఇక అర్ధకుంభమేళా విషయానికి వస్తే జనవరి 15 నుండి గంగ,యమున, సరస్వతినదుల త్రివేణి సంగమంలో ( అలహాబాద్) ప్రయాగ్ రాజ్ వద్ద జరుగుతాయి. ఈ అర్ధకుంభమేళాకి ఎన్నోలక్షల మంది అఘోరాలు,
సాధువులు స్నానము ఆచరిస్తారు.

వెయ్యి కార్తిక మాసస్నానాలు గంగలో చేసిన ఫలితం, వంద మాఘమాసస్నానాలు గంగలో చేసినఫలితం, వైశాఖ మాసస్నానాలు కోటిమారులు నర్మదా నదిలో చేసినఫలితాన్ని ఒక్కమారు కుంభస్నానంతో మానవుడు పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)