ఎండపై ఫిర్యాదు చేసిన శిఖర్ ధావన్..! వెంటనే మ్యాచ్‌ని నిలిపివేసిన అంపైర్లు..!

అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్ ఇప్పటి వరకూ వర్షం, వెలుతురులేమీ కారణంగా నిలిచిపోవడం మనం చూశాం. కానీ.. న్యూజిలాండ్‌ గడ్డపై నేపియర్‌ స్టేడియంలో భారత్, కివీస్ మధ్య ఈరోజు జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ ఎండ కారణంగా నిలిచిపోయింది. సూర్యాస్తమయ సమయంలో క్రీజులోని బ్యాట్స్‌మెన్‌ కళ్లలోకి నేరుగా ఎండ పడుతుండటంతో మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో ఎండ కారణంగా ధావన్ కనీసం బంతిని కూడా సరిగా చూడలేకపోయాడు. దీంతో.. ధావన్ ఫిర్యాదు మేరకు మ్యాచ్‌ని అంపైర్లు నిలిపివేశారు. 158 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన భారత్ జట్టు 10 ఓవర్లు ముగిసే సమయానికి 44/1తో నిలవగా.. క్రీజులో శిఖర్ ధావన్ (29 నాటౌట్: 32 బంతుల్లో 5x4), కెప్టెన్ విరాట్ కోహ్లి (2 నాటౌట్: 4 బంతుల్లో) ఉన్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (11: 24 బంతుల్లో 1x4) నిరాశపరిచాడు. మ్యాచ్ సమయం అరగంట వేస్ట్ అవడంతో.. ఆటని 49 ఓవర్లకి కుదించి లక్ష్యాన్ని 156 పరుగులుగా నిర్ణయించారు.

అంతకముందు కుల్దీప్ యాదవ్ (4/39), మహ్మద్ షమీ (3/19), చాహల్ (2/43) ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ జట్టు 38 ఓవర్లలోనే 157 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (64: 81 బంతుల్లో 7x4) ఒక్కడే భారత్ బౌలర్లకి ఎదురునిలిచి.. సొంతగడ్డపై పరువు నిలిపే ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (5: 9 బంతుల్లో 1x4) ఔటవడంతో రెండో ఓవర్‌లోనే క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ 34వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచి ఒక ఎండ్‌లో వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. కానీ.. అతను ఔట్ తర్వాత.. కివీస్ వరుసగా వికెట్లు చేజార్చుకుని నాలుగు ఓవర్లలోనే కుప్పకూలిపోయింది.

కివీస్ జట్టుని ఆరంభంలోనే టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ మార్టిన్ గప్తిల్ని ఔట్ చేయడం ద్వారా ఆత్మ రక్షణలోకి నెట్టిన షమీ.. ఆ తర్వాత నాలుగో ఓవర్‌లో మరో ఓపెనర్ కొలిన్ మున్రో(8)ని ఔట్ చేసి ఆ జట్టుకి ఊహించని షాకిచ్చాడు. ఇద్దరూ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వెళ్తున్న బంతిని వెంటాడే ప్రయత్నంలో బౌల్డయ్యారు. దీంతో.. 4 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ 18/2తో నిలవగా.. అనంతరం కొద్దిసేపటికే దూకుడుగా ఆడిన రాస్ టేలర్ (24: 41 బంతుల్లో 3x4), టామ్ లాథమ్ (11: 10 బంతుల్లో 1x4) ఒకే తరహాలో మణికట్టు స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యారు.

క్రీజు వెలుపలికి వచ్చి బంతిని అడ్డుకునేందుకు టేలర్, లాథమ్ ప్రయత్నించగా.. బ్యాట్‌ని తాకిన బంతి నేరుగా చాహల్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వచ్చిన హెన్రీ నికోలస్ (12)ని కేదార్ జాదవ్ బోల్తా కొట్టించగా.. దూకుడుగా ఆడిన మిచెల్ శాంట్నర్ (14: 21 బంతుల్లో 1x4, 1x6) షమీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆస్ట్రేలియా‌తో ఇటీవల ఆడిన ఆఖరి వన్డే జట్టులో కెప్టెన్ కోహ్లీ రెండు మార్పులు చేశాడు. దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజాపై వేటు వేసి వారి స్థానంలో అంబటి రాయుడు, కుల్దీప్ యాదవ్‌లను తీసుకున్నాడు.

భారత్ జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, అంబటి రాయుడు, విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ న్యూజిలాండ్ జట్టు: మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), హెన్రీ నికోలస్, మిచెల్ శాంట్నర్, డాగ్ బ్రాస్‌వెల్, టిమ్ సౌథీ, లూకీ ఫర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)