షాకింగ్ ఘటన.. యూట్యూబ్ వీడియోలను చూసి ఇదేం పని

తమిళనాడులో జరిగిన ఓ విషాద ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. యూట్యూబ్ వీడియోలను చూసి.. వాటిలోని సూచనలు పాటించి ఇంట్లోనే బిడ్డకు జన్మనివ్వాలన్న ఆ దంపతుల వింత ఆలోచన కారణంగా నిండు ప్రాణం పోయింది. పురిటి నొప్పులతో బాధపడుతూ.. ప్రసవ వేదన అనుభవించిన ఆమె బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందింది. తమిళనాడులోని తిరుపూర్‌లో ఈ విషాదం జరిగింది. జూలై 22న జరిగిన ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాధితురాలిని తిరుపూర్‌లోని రత్నగిరీశ్వరనగర్‌కు చెందిన కృతిక(28)గా గుర్తించారు. ఆమె ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. కృతిక భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఇంతకు ముందే మూడు సంవత్సరాల వయసున్న పాప ఉంది. ఈ దంపతులిద్దరూ ఇంటిలోనే యూట్యూబ్ వీడియోలను ఫాలో అవుతూ బిడ్డకు జన్మనివ్వాలని ముందే నిర్ణయించుకున్నట్లు తెలిసింది.

‘యూట్యూబ్‌లో డెలివరీ సమయంలో ప్రెగెంట్ లేడీకి ఎలా సాయం అందించాలి’? అనే అంశానికి సంబంధించి పలు వీడియోలను చూశారు. అనుకున్నట్టే చేశారు. కానీ ప్రయోగం వికటించి.. ఒక నిండు ప్రాణం పోయింది. పురిటి నొప్పులు 2గంటలకు మొదలైతే ఆమెను 3.30కు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారని.. అప్పటికే ఆమె బిడ్డకు జన్మనిచ్చి.. మరణించిందని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆమె భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కృతిక స్నేహితురాలు లావణ్య సహజ ప్రసవాలు చేస్తుండేది. ఆమె సూచనతోనే ఈ దంపతులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)