స్టూడెంట్ తల్లిని కోరిక తీర్చాలని వేధించిన ఉపాధ్యాయుడు

విద్యార్థులను మంచి విద్యను బోధించాల్సిన స్థానంలో ఉన్న ఓ ప్రధానోపాధ్యాయుడు.. వక్ర బుద్ధితో ఆలోచించాడు. తన కోర్కిక తీర్చకుంటే.. నీ కొడుకు భవిష్యత్తు పాడుచేస్తానంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...బెల్లంకొండ మండలానికి చెందిన బాధితురాలు దివ్యాంగుడైన తన కుమారుడిని బెల్లంకొండ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చదివిస్తోంది. వారంలో ఒకరోజు వెళ్లి కొడుకుని చూసి వస్తోంది. ప్రధానోపాధ్యాయుడు ఆమెను తన గదికి పిలిపించి విద్యార్థి బాగా చదువుతున్నాడని, తన కోరిక తీర్చితే మంచి చదువులకు పంపిస్తానని, కుటుంబానికి కష్టం కలగకుండా చూసుకుంటానని లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. కోరిక తీర్చకపోతే విద్యార్థి భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించాడు. పాఠశాలకు వచ్చిన ప్రతిసారీ లైంగిక వేధింపులు పెరగడంతో బాధితురాలు భర్త, అత్తమామలకు గోడు వెళ్లబోసుకుంది. భర్త దివ్యాంగుడు కావడం, అత్తమామలు పట్టించుకోకపోవడంతో వేధింపులు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనునాయక్‌ వేధింపులపై బాధితురాలు ఏపీ మానవ హక్కుల సంఘానికి ఈ నెల 12న ఫిర్యాదు చేసింది. అదేరోజు డీటీడబ్ల్యూవో అధికారి గ్రామంలో విచారణ నిర్వహించారు. విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్‌ తన బంధువైన ఓ తహసీల్దారు, స్నేహితుడుతో కలిసి బాధితురాలు ఇంటికి వెళ్లాడు. ఫిర్యాదును వెనక్కి తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. అత్తమామలకు డబ్బు ఆశ చూపి, వారి ద్వారా చిత్రహింసలకు గురిచేశాడు. హింసకు తాళలేక పుట్టింటికి చేరిన బాధిత మహిళ.. ఈ నెల 21న బెల్లంకొండ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అత్తమామల నుంచీ తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొంది.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు బెల్లంకొండ ఎస్సై డి.జయకుమార్‌ తెలిపారు.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)