సొం‍త చెల్లెలిపైనే లైంగిక అకృత్యాలు.. తల్లికి ఘోరం చెబితే.. తాయెత్తు కట్టించింది

కంటికి రెప్పలా కాపాడాల్సిన తోబుట్టువే కామంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తించాడు. సొం‍త చెల్లెలిపైనే లైంగిక అకృత్యాలకు పాల్పడి మానవత్వానికే మచ్చ తెచ్చాడు. ఈ ఘటన పంజాబ్‌లోని ఖరార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకోగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఇక్కడికి వలస వచ్చింది. కుటుంబంతో కలిసి ఉంటున్న పదకొండేళ్ల చిన్నారి (మూడో తరగతి)పై తన అన్నయ్య (22) పలు మార్లు అత్యాచారం చేశాడు.

లైంగిక దాడి జరిగిన మొదటి రోజే చిన్నారి ఈ విషయం తన తల్లికి చెప్పింది. కొడుకే కూతురుని ఇలా చేయడమేంటని ఆ తల్లి నమ్మలేదు. బిడ్డకు గాలి సోకిందని భూత వైద్యునితో తాయత్తు కట్టించింది. అయితే, చెల్లెలిని లైంగిక వేధింపులకు గురిచేస్తూ ఆ యువకుడు తల్లి కంటబడడంతో అతన్ని ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఈ విషయం బయటపడితే పరువు పోతుందనీ, ఎవరితో చెప్పొద్దొని కూతురికి తల్లి సర్ది చెప్పింది.

అయితే చిన్నారి చదువుతున్న స్కూల్లో అసహజ స్పర్శలు, లైంగిక పరమైన వేధింపులపై అవగాహన తరగతులు నిర్వహించారు. దీంతో బాధితురాలు తన సోదరుడు చేసిన పనిని స్నేహితురాళ్లకు చెప్పింది. ఆ విషయం టీచర్ల దృష్టికి రావడంతో​ ఘటన వెలుగుచూసింది. వారు చైల్డ్‌లైన్‌ సాయంతో పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడనీ ఐపీసీ, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.కాగా, పదకొండు మంది తోబుట్టువుల్లో బాధితురాలు చివరి సంతానం.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)