ఇది పక్కాలోకల్‌.. తింటే మామాజీ చేతి జిలేబీనే తినాలిరా.. ఏ నలుగురు కలిసినా ఇలా అనుకోవడం చాలా కామన్‌

పక్కాలోకల్‌ ‘మామా.. తింటే మామాజీ చేతి జిలేబీనే తినాలిరా!’ కరీంనగర్‌ టవర్‌సర్కిల్‌లో ఏ నలుగురు కలిసినా ఇలా అనుకోవడం చాలా కామన్‌. ఎందుకలా అంటే... మామాజీ చేసే జిలేబీ రుచి అలాంటిది మరి.
కరీంనగర్‌ టవర్‌ సర్కిల్‌లోకి వెళ్లి నిల్చుంటే వేడివేడి నేతి జిలేబీ వాసన గుప్పున తగులుతుంది.. రారమ్మంటున్నట్టుగా. చూస్తే మామాజీ జిలేబీ సెంటర్‌. రోజంతా ఉండే రద్దీ ఒకెత్తు.. సాయంత్రం ఐదింటి నుంచి ఉండే రద్దీ ఒకెత్తు. ఇక్కడ జిలేబీ ఒక్కటే కాదు, ముచ్చటైన ముగ్గేసినట్టుగా ఉండే ఎర్రెర్రని జాంగ్రీలు కూడా భలే నోరూరిస్తాయి. స్వచ్ఛమైన నేతిలో జాంగ్రీలు, జిలేబీలను చేత్తో చిత్రంగా తిప్పుతూ వేసే తీరు చూస్తే చాలు సగం కడుపు నిండిపోతుంది. నాణ్యత విషయంలో రాజీ ఉండదు. కిలో జిలేబీ ధర రూ.160.

ఇంతకీ మామాజీ ఎవరో చెప్పనే లేదు కదూ! ముఫ్పై సంవత్సరాల క్రితం రాజస్థాన్‌లోని పాలీ జిల్లా కొహ్లెర్‌ గ్రామం నుంచి మామాజీ బతుకుతెరువు కోసం కరీంనగర్‌ వచ్చాడు. అతనికి తెలిసిందల్లా మిఠాయిల తయారీ. ఆ పనే ఇక్కడా మొదలుపెట్టాడు. నాణ్యత, శ్రద్ధలో ఎక్కడా రాజీపడలేదు.. దాంతో అతను చేసే జిలేబీలకు ఎక్కడలేని డిమాండ్‌ పెరిగింది. ఆ శ్రద్ధ, ఆ రుచి.. శుచి వల్లే మామాజీ జిలేబీ లోకల్‌ బ్రాండ్‌గా నిలబడింది. మరో పదిమందికి ఉపాధి కల్పించింది. ‘ఒక్కోసారి డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయలేకపోతుంటాం. అలాంటప్పుడు వినియోగదారులు నిరాశతో వెనుదిరిగిన రోజులూ ఉన్నాయి’ అంటారు మామాజీ.

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)