అక్రమ సంబంధానికి అడ్డు పడుతున్నాడనే కారణంతో కన్నతండ్రినే ప్రియుడితో కలసి కుమార్తె హత్య

అక్రమ సంబంధానికి అడ్డు పడుతున్నాడనే కారణంతో కన్నతండ్రినే ప్రియుడితో కలసి కుమార్తె హత్య చేసిన విషయం పోలీసుల దర్యాప్తులో నిగ్గుతేలింది. జులై 1వ తేదీన చల్లపల్లి మండలం పురిటిగడ్డ పంచాయతీ పరిధిలోని నిమ్మగడ్డ రోడ్డులో గుర్తు తెలియని మృతదేహం గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన కాజా కృష్ణప్రసాద్‌(62)గా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలు, సెల్‌ఫోన్‌ కాల్‌డేటా, సెల్‌టవర్‌ లొకేషన్‌లు పరిశీలించి చల్లపల్లి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన కృష్ణప్రసాద్‌(62) నూజివీడు మండలం తుక్కులూరులో కుమార్తె లింగమనేని శేషుకుమారి ఇంటివద్ద ఉంటున్నాడు. శేషుకుమారి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన వేముల వెంకటేశ్వరరావుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి మంచి పద్ధతి కాదని అడ్డుచెప్పాడు. తన అక్రమ సంబంధానికి తండ్రి అడ్డుపడుతున్నాడన్న కారణంతో ప్రియుడితో కలసి జూన్‌ నెలాఖరు రాత్రి పథకం రూపొందించుకొని తండ్రి కృష్ణప్రసాద్‌ను హతమార్చారు. వెంటనే మృతదేహాన్ని కారులో నూజివీడు మండలం తక్కులూరు ప్రాంతంలో ఏదైనా చెరకుతోటలో పడవేయాలని నిర్ణయించుకొని బయటకు రావడంతో రహదారుల్లో తిరుగుతూ కేసరపల్లి మీదుగా కారులో తిరుగుతూ ఎవరూ చూడని ప్రదేశంలో పడేయాలని తెల్లవార్లూ తిరుగుతూ చల్లపల్లి మండలం పురిటిగడ్డ పంచాయతీ నిమ్మగడ్డ రహదారి మార్గం చెరకు తోటల్లో మృతదేహాన్ని పడవేసే ప్రయత్నంలో అలికిడి కావడంతో రహదారి పక్కనే పడవేసి వెళ్లిపోయారు. నిమ్మగడ్డ రహదారిలో మృతదేహం లభించడంతో తొలుత అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. జులై 2వ తేదీన పత్రికల్లో కృష్ణప్రసాద్‌(62) మృతదేహం చిత్రం రావడంతో ఈ వ్యక్తి మీ తండ్రేనని కొందరు వ్యక్తులు చెప్పడంతో చల్లపల్లి పోలీసులను సంప్రదించి అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రి వచ్చి మృతదేహం తన తండ్రిదేనని పోలీసులకు చెప్పింది. పోలీసులకు ఇచ్చిన సమాచారంలో తన తండ్రి కృష్ణప్రసాద్‌ అంగలూరు వెళ్లి వస్తానని చెప్పాడని ఈ సంఘటన ఎలా జరిగిందో తెలియదని, తన తండ్రి పనిచేసే హోటల్‌ యజమాని ఫోన్‌చేస్తే సెల్‌ఫోన్‌ ఇంటిలోనే ఉన్నట్లు తెలిసిందని పోలీసులకు తెలిపింది. అయితే చల్లపల్లి పోలీసులు కేసు దర్యాప్తులో సెల్‌ఫోన్‌ ఇంటిలో ఉందన్న కుమార్తె చెప్పిన విషయంతో కాల్‌డేటా మొదట పరిశీలించారు. మృతుడి సెల్‌కు వచ్చిన కాల్స్‌ వివరాలు, కుమార్తె శేషుకుమారి సెల్‌ఫోన్‌ నుంచి వెళ్లిన కాల్స్‌ వివరాలతో పాటు సెల్‌టవర్‌ లోకేషన్‌లను పోలీసులు పరిశీలించారు. తండ్రి ఫోన్‌ తక్కులూరులోనే ఉందన్న సమయంలో ఆ సెల్‌ఫోన్‌ లోకేషన్‌ నిమ్మగడ్డ సమీపంలోని శ్రీకాకుళం టవర్‌ లోకేషన్‌ చూపినట్లు నిర్ధారణ కావడంతో కుమార్తె శేషుకుమారి సెల్‌ఫోన్‌ లోకేషన్‌ కూడా ఆ సమయంలో ఒకే ప్రాంతంలో చూపించడంతో విచారించగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణప్రసాద్‌ హత్యకేసులో నిందితులైన కుమార్తె శేషుకుమారిని, ఆమె ప్రియుడు వేముల వెంకటేశ్వరరావును బుధవారం అరెస్టు చేశారు. మృతదేహాన్ని తరలించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ సమావేశంలో అవనిగడ్డ డీఎస్పీ వి.పోతురాజు, సీఐ బి.జనార్ధన్‌లు వివరాలు తెలిపారు. దర్యాప్తులో కేసు వేగవంతానికి తోడ్పాటునందించిన కానిస్టేబుల్‌ కె.ఎన్‌.శివాజీని డీఎస్పీ, పోలీస్‌ అధికారులు అభినందించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)