మనిషన్నవాడు మాయమవలేదని మానవత్వం ఇంకా మిగిలే ఉందని చేతులు కలిపితేనే మనిషికి మనుగడ సాధ్యమని నిరూపించిన గొప్ప సంఘటన ఇది

మనిషి బతికే ఉన్నాడు! థాయ్‌లాండ్ లోని తామ్ లువాంగ్ గుహల్లో 18 రోజులపాటు చిక్కుకుపోయిన యువ ఫుట్ బాల్ బృందంలోని 13 మంది ఆటగాళ్లని ఇవ్వాళ రెస్క్యూ టీం రక్షించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఊపిరి బిగపట్టి చూసిన ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యి ఆ టీనేజ్ పిల్లలందరూ క్షేమంగా బయటికి రావడం మానవ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం. మనిషన్నవాడు మాయమైపోతున్నడని కవి ఊరికే అనలేదు. రోజూ పేపర్ తెరిచినా, టీవీ ఆన్ చేసినా, సోషల్ మీడియాలోకి తొంగిచూసినా కనిపించేది అంతా నెగెటివ్ ప్రపంచమే. కులం, మతం, దేశం, కలర్, జెండర్ … లెక్కలేనన్ని అడ్డుగోడలు. మతిలేని హింసాకాండ, సాటి మనిషి మీద నమ్మకరాహిత్యం. నీడను చూసి ఉలిక్కిపడేంత భయాందోళనలు, సాటి మనిషిని కూడా కొట్టి చంపేంత కౄరత్వం, అవసరం లేని ఆర్భాటాలు, పక్క వాడిని దాటి పైకి ఎగబాకాలనే కండూతి, చిన్న చిన్న వైఫల్యాలకే ఆవరించుకునే డిప్రెషన్ – ఒకటేమిటి, మన చుట్టూ ఉన్న వాతావరణం తరచూ బాధను, నిస్పృహను, అంతులేని నిరాశను కలుగజేస్తుంది. మానవాళి భవిష్యత్ గురించి బెంగటిల్లేలా చేస్తుంది.కానీ ఎప్పుడో ఒకసారి వస్తుంది ఇట్లాంటి అరుదైన సందర్భం.

ఆవరించుకున్న గాఢాంధకారంలో తటిల్లతలా,
ఏడారిలో గొంతెడుకుపోతుంటే కనిపించిన ఒయాసిస్సులా
ఊపిరాడని ఉక్కపోతలో చల్లని సమీరంలా
గూడుకట్టుకున్న విషాదం ఒక్కపెట్టున చెదిరిపోయి
మానవత్వం మీద మరోసారి నమ్మకం కలిగే సందర్భం.

కులాల, మతాల, రంగుల, నమ్మకాల, అంతరాల అడ్డుగోడలు చేధించి మనమంతా మనుషుల్లా ప్రవర్తించే ఆ ఘట్టం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇవ్వాళ తామ్ లువాంగ్ గుహల సాక్షిగా అవిష్కృతమైంది.

ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ఎందరో హీరోలు.

గుహలో చిక్కుకున్న పిల్లలను రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన థాయ్ నేవీ సీల్ సమన్ కునాన్ చేసిన త్యాగం అసమానం. గొప్ప సాహసం చేసి ఆ గుహలోపలికి వెళ్లి పిల్లలను తొలిసారి కనుక్కున్న బ్రిటిష్ డైవర్ రిచర్డ్ స్టాంటన్, జాన్ వోలంథెన్, పిల్లలను రక్షించేందుకు అహోరాత్రులు పని చెసిన దాదాపు వెయ్యి మంది నిష్ణాతులు (వీరిలో నేవీ సీల్స్, డాక్టర్లు, సైనికులు, ఇతర స్పెషలిస్టులు) ఉన్నారు.

అక్కడికి సహాయక చర్యల్లో పాల్గొనడానికి వచ్చిన ఒక నేవీ సీల్ మాట్లాడుతూ గుహలో చిక్కుకున్న పిల్లల్లో నా పిల్లలే ఉన్నారనే భావనతోనే పనిచేస్తున్నాని అనడం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది తల్లితండ్రుల స్పందనలా అనిపిస్తుంది.

ఈ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ కు ఎందరో సామాన్యులు అసామాన్యమైన సేవలు అందించారు. గుహల్లో పిల్లలు చిక్కుకుపోయారని తెలియగానే ప్రపంచం నలుమూలల నుండి అనేకమంది స్వచ్చంద కార్యకర్తలు అక్కడికి చేరుకుని తమవంతు సాయం చేయడానికి ప్రయత్నించారు. కొందరు అక్కడ నెలకొల్పిన తాత్కాలిక వంటశాల్లలో వంటలు చేయగా, కొందరు డ్రైవర్లు అక్కడికి వచ్చిపోయే వారికి ఉచిత రవాణా సౌకర్యం కలిపించారు. ఒకాయన అక్కడ వేచి చూస్తున్న వారికొరకు నూడిల్స్ తీసుకురాగా, మరొక పెద్ద మనిషి ఐస్ క్రీం అందించాడు. అడవుల్లో పిట్ట గూళ్లు ఏరుకునే తెగ వారు కూడా మేము సైతం అంటూ ఈ ఆపరేషన్ లో తమవంతు సాయం అందించారు.

గుహల్లోని నీటిని వందలాది మోటార్లు పెట్టి తోడిపోయడంతో చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ జలమయం అయ్యాయి. అక్కడున్న ఒక మహిళా రైతును మరి మీ పొలాలు పాడైపోయినయి కదా మీకు బాధగా లేదా అంటే ఆమె “పొలం పోతే మళ్లీ నాటుకోవచ్చు, పిల్లలు పోతే మళ్లీ తెచ్చుకోగలమా”? అని బదులివ్వడం నిజంగా కళ్లలో నీళ్లు తిరిగేటట్టు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సోషల్ మీడియాలో ఈ సంఘటన అప్‌డేట్స్ ఫాలో అయ్యారు. అమెరికా నుండి, జపాన్ దాకా, దేశాధ్యక్షుల నుండి సామాన్య పౌరుల దాకా అందరూ ప్రతిస్పందించారు. టెస్లా కార్ల సృష్టికర్త ఎలాన్ మస్క్ కూడా గుహలో పిల్లలని రక్షించేందుకు ఒక మిని సబ్‌మెరీన్ స్వయంగా తయారుచేసుకొచ్చాడు. సొషల్ మీడియాలో అనేకమంది ఈ సంఘటన తమకు మానవత్వం మీద నమ్మకాన్ని నిలబెట్టిందని వ్యాఖ్యానించారు. బంకర్లలో దాక్కున్న మనిషిని చంపే ఆయుధాలను కనిపెట్టగలిగిన మనిషి, గుహల్లో చిక్కుకుపోయిన చిన్నారులను కాపాడే పరికరాలు కనుగొనలేకపోవడం ఏమిటని ఒక ట్విట్టర్ యూజర్ సంధించిన ప్రశ్న మనకు సూటిగా గుండెల్లో గుచ్చుకుంటుంది.

సంఘటన జరిగిన వెంటనే థాయ్‌లాండ్ ప్రభుత్వం స్పందించిన విధానం, అనేక దేశాల సహకారంతో ఒక రెస్క్యూ టీం ను ఏర్పాటు చేసి, ఎటువంటి తొట్రుపాటు లేకుండా ఎంతో సమయస్ఫూర్తితో, సంయమనంతో, చాకచక్యంగా ఈ పిల్లలను రక్షించిన పద్ధతి, మీడియా కవరేజ్ ను నియంత్రించిన తీరు…నిజంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక పాఠ్యాంశంలా మిగిలిపోతుంది. మనబోటి దేశాలు ఎంతో నేర్చుకోవాలి అనిపించింది ఇదంతా చూశాక.

మనిషన్నవాడు మాయమవలేదని
మానవత్వం ఇంకా మిగిలే ఉందని
చేతులు కలిపితేనే మనిషికి మనుగడ సాధ్యమని
నిరూపించిన గొప్ప సంఘటన ఇది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)