(వీడియో) భయ్యా నీ ధైర్యానికి సలాం: ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించిన సామాన్యుడు

గుంటూరు నగరంలోని లక్ష్మీపురం ప్రాంతంలో ఓ కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది. అక్కడ చాలా మంది తమ బైకులను పార్కు చేశారు. అదేసమయంలో అటుగా వచ్చిన ట్రాఫిక్ పోలీసులు బైకులు పార్క్ చేసి ఆ ఓనర్లు అక్కడే ఉంటే వారికి చలానా రాస్తున్నారు. అక్కడ బైకు ఉండి ఓనర్లు లేకుంటే అలాంటి బైకులను ట్రక్కులోకి ఎక్కిచ్చి పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో ఆ పోలీసులకు అసలైన సామాన్యుడు తగిలాడు. తన బైకును కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఈ బైకును ఎలా తీసుకెళతారు...ఇక్కడ ఏమైనా నోపార్కింగ్ బోర్డు పెట్టారా...? మరి పెట్టనప్పుడు ఎలా తీసుకెళతారు... చలానా రాయాలంటే ఎస్సై ఉండాలి... ఎస్సై ఎక్కడ అన్న ప్రశ్నకు బిక్కమొహం వేయడం ట్రాఫిక్ పోలీసుల వంతైంది. అయినా వారు వదల్లేదు. ఏదైనా ఉంటే ఫైన్ కట్టి బండిని తీసుకెళ్లు అని చెప్పడంతో.. ఆ సామాన్యుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందుగా నిబంధనలు తెలుసుకోండి. ఎస్సై లేకుండా చలానా రాసే అధికారం మీకెవరిచ్చారు. నోపార్కింగ్ బోర్డు లేదు.. మరి చలానా ఎలా రాస్తారు...అంటూ పోలీసులకు మూడు చెరువుల నీళ్లు తాగించారు.
సామాన్యుడి ప్రశ్నల వర్షం తట్టుకోలేక అందరూ జరిమానా కడుతున్నప్పుడు నీకేంటి ప్రత్యేకం అని ప్రశ్నించగా... వెంటనే ఆ సామాన్యుడు ఇక్కడ నో పార్కింగ్ ఉన్న సంగతి మీకు తెలుసా అని అడిగాడు. దీంతో చుట్టు పక్కల వారు తెలీదు అని చెప్పగానే మరి జరిమానా కట్టొద్దంటూ వారిని వారించాడు . ఈ గొడవ అంతా తన ఫోన్ కెమెరాలో రికార్డు చేశాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పిన సదరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు పట్టించుకోలేదు. ఏదైనా ఉంటే స్టేషన్‌కు వచ్చి మాట్లాడండి అంటూ రొటీన్ డైలాగులు కొట్టారు. అంతేకాదు ఈ యువకుడు ప్రశ్నిస్తున్న తీరును అదేదో తప్పైనట్లు మరో కానిస్టేబుల్ వీడియో తీశాడు.
ఇంతా జరుగుతున్న చుట్టు పక్కల వారు ఆ సామాన్యుడికి అండగా నిలిచేందుకు ముందుకురాలేదు. దీనిపై నెటిజెన్లు ఒక్కింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను పోరాడేది అందరికోసమే కదా... ఎందుకు ఆయనకు సహకరించరు అని ప్రశ్నలు గుప్పించారు. మొత్తానికి సామాన్యుడు సంధించిన ప్రశ్నలకు ట్రాఫిక్ పోలీసులు అల్లాడిపోయారు. అయితే ట్రాఫిక్ ఎస్సై లేకుండా చలాన్లు ఎలా రాస్తారు...? నోపార్కింగ్ బోర్డు పెట్టకుండా ఫైన్లు ఎలా వేస్తారో అది ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులే సమాధానం చెప్పాలి.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)