భార్యను బీటెక్‌ వరకు చదివించి ఉద్యోగం ఇప్పిస్తే.. నా హోదాకు తగ్గ అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఇక నన్ను మర్చిపో అంటూ

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసిందని గురవారెడ్డి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. తెలిసో తెలియకో తప్పుచేసినా సరిదిద్దుకోమని చెప్పాడు. అయినా మాట వినలేదు. విషయాన్ని అత్తమామలకు చెప్పి మందలించి సరిదిద్దమన్నాడు. వారు కూడా కూతురు పక్షానే మాట్లాడి అల్లుడిని పోలీస్‌స్టేషన్‌లో పెట్టి కొట్టించారు. కూతురు చేసిన తప్పు సరిదిద్దుతారని వారికి చెబితే తనపైనే కేసు పెట్టి పోలీసులతో కొట్టించారనే తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విజయవాడ కృష్ణలంక గుంటూరువారివీధిలో నివాసముంటున్న గురువారెడ్డి (28) ఇంటర్‌ చదివి జెంజిసర్కిల్‌ వద్ద ఒక లాడ్జిలో గుమస్తాగా పనిచేస్తుంటాడు. ఎదురింట్లో నివాసముండే గాయత్రి ఇంటర్‌ చదువుతుండగా ఒకరంటే, ఒకరు ఇష్టపడ్డారు. ఆ ఇష్టం కాస్తా ప్రేమగా మారటంతో ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఐదేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. భార్య చదువుకుంటాను అంటే భర్త బీటెక్‌ వరకు చదివించి ఆమె కోరిక మేరకు హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం ఇప్పించాడు. భర్త నగరంలోనే ఉండగా ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా విజయవాడ వచ్చి వెళ్తుండేది. ఇటీవల ఆమె ప్రవర్తనలో తీవ్ర మార్పులు చోటుచేసుకోడం భర్త గమనించాడు. రోజూ ఫోన్‌చేసే భార్య అకస్మాత్తుగా మానేసింది. తాను చేస్తే స్పందించడంలేదు. ప్రతి నెలా వచ్చే భార్య రావటం పూర్తిగా ఆపేసింది.

దీంతో హైదరాబాద్‌ వెళ్లి భార్యను నిలదీస్తే భర్త గుండెలు పగిలే నిజాలు చెప్పింది. ‘నీవంటే నాకుఇష్టం లేదు... తెలిసీ తెలియని వయస్సులో నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను... నీతో ఉండటం నాకు ఇష్టం లేదు.. ఇక్కడ నా హోదాకు తగిన వ్యక్తిని ప్రేమిస్తున్నాను.. ఆయన్నే పెళ్లి చేసుకుంటాను.. నా గురించి ఆలోచించవద్దంటూ’ కరాఖండిగా తెలపడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. తెలిసో తెలియకో తప్పు చేశావు ప్రవర్తన మానుకొని వచ్చేయి... కలసి సంతోషంగా జీవిద్దామని భార్యను బతిమిలాడినా మాట వినలేదు.

దీంతో విషయం పెద్దల సమక్షంలో మాట్లాడుకుందామంటూ గత శనివారం గాయత్రిని తీసుకొని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. మొదటి నుంచి వీరి ప్రేమ వివాహం ఇష్టంలేని వారు కూతురు తరపునే మాట్లాడారు. తమ కూతురిని మర్చిపోవాలని, లేకపోతే వేధించినట్లు కేసు పెడతామంటు భయపెట్టారు. అదే రోజు రాత్రి నాట కీయ పరిణామాల మధ్య గాయత్రి, ఆమె అమ్మ, నాన్న, అన్నయ్యలు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో వారి బంధువులు ఆంధ్రా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

మరుసటి రోజు ఆదివారం గాయత్రి భర్త తనపై, తన కుటుంబంపై వేధింపులకు పాల్పడుతున్నారంటు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గురువారెడ్డిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విచారణ నిమిత్తం సోమవారం తిరిగి రావాలంటూ అదేశించడంతో భార్య చేసిన మోసంతో తీవ్ర మానసికక్షోభ అనుభవిస్తున్న గురువారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళితే వారు పెట్టే చిత్రహింసలకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని సోమవారం ఉదయం 11 గంటల తన చావుకు గల కారణాలను తెలియజేస్తు సెల్ఫీ వీడియోతీసి తన సోదరుడు, మిత్రులకు వాట్సప్‌చేసి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విచారణ పేరుతో సోమవారం ఉదయం ఇద్దరు కానిస్టేబుల్స్‌ ఇంటికి వచ్చి తన బిడ్డను తీసుకువెళ్లారని, అదే వాడి చివరి చూపు అని తమకు తెలియదని, రాత్రి 8 గంటలకు మీ బిడ్డ చనిపోయాడంటూ పోలీసులు తెలిపారన్నారు. గాయత్రి కుటంబసభ్యులు, పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి, నానయ్మ సీతమ్మలు బోరున విలపించారు. గురవారెడ్డి చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)