ప్రాణం తీసిన పరువు : కూతురిని కొట్టిచంపిన తండ్రి

కన్న తండ్రి క్షణికావేశం కుమార్తె ప్రాణాలను బలి తీసుకుంది. తండ్రి చేతిలోనే తనయ మృతి చెందడం చూసి తల్లి స్పృహ కోల్పోయింది. శుక్రవారం పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న యువతి శనివారం తిరిగిరాని లోకాలకు చేరుకోవడం విషాదాన్ని నింపింది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన తొండెపు కోటయ్య, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కోటయ్య వ్యవసాయం చేస్తుండగా పద్మావతి ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. వారి పెద్ద కుమార్తె చంద్రిక (22) గుడ్లవల్లేరులోని కళాశాలలో బీ ఫార్మసీ పూర్తి చేసుకుని ఉన్నత విద్య అభ్యసించడానికి సిద్ధమవుతోంది. శనివారం ఇంట్లో ఆమె సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా గమనించిన తండ్రి ఆగ్రహానికి గురై కర్రతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే కుమార్తె విగత జీవిగా మారడంతో తల్లడిల్లిన తల్లి స్పృహ కోల్పోయారు. చంద్రిక ప్రాణాలు కోల్పోయిందని గమనించిన తండ్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తాను ఒకరిని ప్రేమించానని, అతడినే వివాహం చేసుకుంటానని చంద్రిక చెప్పడంతో.. తండ్రి కోటయ్య ఆవేశంలో చంద్రికను కొట్టడంతో ఆమె మృతి చెందిందని తాతయ్య పారా రామారావు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)