చిత్తుకాగితాలు ఏరుకునేవాడు… వందలమందిని కాపాడాడు


Loading...

ఈరోజు ఓ వార్త బాగా నచ్చేసింది… అదేసమయంలో ఓ కంప్లయింటు కూడా..! ఆ వార్త ఏమిటంటే..? త్రిపురలో ఇటీవల భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోయి, అనేక ప్రాంతాల్లో భూమి కోసుకుపోయింది, అనేక చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి… అదే పరిస్థితి రైల్వే ట్రాకులకు కూడా… ఒకాయన పేరు స్వపన్ దిబ్రామ… ఓ బిడ్డ… ఇద్దరే… రోడ్లు పక్కన, రైల్వే ట్రాకు పక్కన కాగితాల్ని, ప్లాస్టిక్ డబ్బాల్ని అమ్ముకుని బతుకుతుంటాడు… ఈ ఫోటోలో కనిపిస్తున్నది తనే… పక్కన తన బిడ్డ… ఆయన తన రోజువారీ పనుల్లోలాగే కాగితాలు ఏరుకుంటుంటే ఓచోట ఒక రైల్వే పట్టా విరిగిపోయి కనిపించింది… పట్టాలు విరిగిపోవడం అనేది ఎక్కడైనా కామన్… కానీ వీళ్లకు ఆ పట్టా విరిగిపోయి కనిపించిన సమయంలోనే ఓ వైపు నుంచి ఓ ట్రెయిన్ వస్తున్నది…
Loading...

విరిగిన ఒక పట్టా ఎంత విధ్వంసాన్ని, ఎంత ప్రాణనష్టాన్ని కలిగించగలదో తనకు తెలుసు… కానీ ఏం చేయాలి..? ఎవరినైనా అలర్ట్ చేయాలని అనుకున్నా సరే ఆ రైలు వచ్చేస్తూ కనిపిస్తున్నది… టైమ్ లేదు… ముందు తన బిడ్డ వేసుకున్న చొక్కను విప్పాడు, తరువాత తన చొక్కాను కూడా విప్పాడు… నిజానికి అది చొక్కా కూడా అనిపించుకోబడదు… చీలికలుగా, పేలికలుగా తన ఒంటిని కప్పి, చలి నుంచి రక్షించే ఓ వస్త్రం… ఆ రైలుకు ఎదురుగా చొక్కాలు ఊపుతూ, కేకలు వేస్తూ పరుగులు తీయడం స్టార్ట్ చేశారు… ఒకవేళ రైలు డ్రైవర్ గనుక చూస్తే, అలర్టయితే, అప్పటికప్పుడు బ్రేకులు వేయగలిగితే ప్రమాదం తప్పుతుంది కాదని దిబ్రామ ఆశ… తాపత్రయం…
నిజంగానే రైలు డ్రైవర్‌కు వీళ్ల పరుగులు తీస్తూ వస్తున్న దృశ్యం, చొక్కాలు ఊపుతున్న తీరు చూసి, అనుమానమొచ్చి, బ్రేకులు అప్లయ్ చేసి, రైలు ఆపాడు… రైళ్లకు సడెన్ బ్రేకులు వేయటానికి వీల్లేదు… అది మెల్లిమెల్లిగా వేగం దగ్గి, ఆ విరిగిన రైలు పట్టాకు కొన్ని గజాల దూరంలోకి వచ్చి ఆగింది… ఏమైంది, ఏమైంది అంటూ పలువురు దిగారు… జరిగింది చూశారు… దిబ్రామను ప్రశంసించారు… కొందరు సెల్ఫీలు కూడా తీసుకున్నారు… ఇంతకీ ఆ రైలులో ఎందరు ఉన్నారో తెలుసా..? 2000 మంది ప్రయాణికులు…! మరి ఈ ఫోటో ఏమిటి..,?
ఈ విషయం తెలిసిన త్రిపుర మినిష్టర్ రాయ్ బర్మన్ వీళ్లను తన అధికారిక నివాసానికి పిలిపించుకున్నాడు… ఇద్దరికీ రెండేసి జతల కొత్త బట్టలు కొనిచ్చాడు… వీఐపీలు విందు చేసేచోటకు తీసుకెళ్లాడు… ఆ తండ్రీకూతుళ్లతోపాటు భోజనం చేశాడు… ఈవిషయం తెలిసిన ఇతర శాసనసభ్యులు అసెంబ్లీలో ప్రస్తావించారు… అసెంబ్లీ ఆ ఇద్దరినీ అభినందించింది… వీరు సౌకర్యంగా బతికేలా అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది… అంతేకాదు, రైల్వే శాఖ వీరికి ప్రత్యేక నగదు బహుమతిని ఇవ్వబోతున్నది… సమాజం మెచ్చుకుంటున్నది… బాగుంది… బాగుంది… ఆరోజు అనుకోకుండా ఆ ప్రమాదాన్ని తను తప్పించిన అవకాశం రాకుండా ఉండి ఉంటే…? అవే రోడ్లు, రైల్వే ట్రాకుల పక్కన అవే కాగితాలు ఏరుకుంటూ బతికేవాడు… చదువూసంధ్య లేక ఆ బిడ్డ తన వెంటే నడిచేది… అంతే కదా..? మరోవిషయం… వీళ్లిద్దరినీ అభినందించిన రైల్వే… ఒకటి మరిచిపోయింది… రైళ్ల రాకపోకలకు ముందు పట్టాల్ని గ్యాంగ్‌మెన్ చెక్ చేసుకుంటూ పోతారు… అక్కడ ఆ చెకింగు జరిగిందా..? పట్టా ఎలా విరిగింది..? చెకింగుకూ ఆ రైలు రాకకూ నడుమ సమయంలోనే పట్టా విరిగిందా..? అసలు ఈ దర్యాప్తు, బాధ్యులకు శిక్ష అవసరం కదా…! పట్టాల్ని ఎప్పటికప్పుడు సరిచూసే రొటీన్ కార్యక్రమాన్ని సమీక్షించుకోవడం అవసరం కదా..?
Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)