ఓ డాక్టర్‌కు ఊరంతా కన్నీటి వీడ్కోలు.. దాదాపు గంటసేపు ట్రాఫిక్ జామ్ అయ్యిందంటే ఆ డాక్టర్ గారు ఎలాంటివారో అర్ధం చేసుకోవచ్చు


Loading...

ఈయన ఓ డాక్టర్… పేరు కిషోర్ చంద్ర… కన్నీటిపర్యంతమవుతూ ఇలా గ్రామస్థులకు చేతులు జోడించాడేం..? నిజానికి వాళ్ల అభిమానాన్ని తట్టుకోలేక వెల్లువైన ఓ ఉద్వేగం అది… ఆ నమస్కారం వెనుక కేవలం ఓ సంతోషమో, ఓ విషాదమో లేవు… అంతకు మించిన ఏదో చెప్పలేని ఫీలింగ్… తనను ఎందుకు అంతగా అభిమానిస్తున్నారు వాళ్లంతా..? తను ఏం చేశాడు..? తను ఇలా కదిలిపోయిన సందర్భం ఏమిటి..? ఎందుకిలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు… అదే కాస్త వివరంగానే చెప్పాలి…
Loading...

ఇప్పుడు తన వయస్సు 32 ఏళ్లు… ఎనిమిదేళ్ల క్రితం తన డాక్టర్ చదువు అయిపోయాక ఒడిశాలోని తెంతుల్‌కుంటి ఫిర్కాలో… అంటే ఓ రిమోట్ ప్రాంతంలోని ఓ హాస్పిటల్‌కు వేశారు తనను… దాని పరిధిలో 70 వేల మంది వరకూ ప్రజలు… కొద్దిసేపు ఔట్ పేషెంట్లను చూసి, నాలుగు మందులు రాసేసి చేతులు దులిపేసుకోలేదు తను… ఒక డాక్టర్‌గా తన ధర్మం, ఒక వ్యక్తిగా తన ధర్మం ఏమిటో తెలుసుకుని, రెండింటినీ కలగలిపాడు… అంతే… ఇక అలుపు లేదు, వేళ లేదు… నిద్రపోయే సమయం తప్ప మొత్తం రోగుల సేవకే… రోగి హాస్పిటల్‌కే రావాలనేం లేదు… తనే వెళ్లేవాడు చాలాసార్లు… సింపుల్ మందులు అంతే…
Loading...

ఆ చిన్న పట్టణంలో అందరికీ తలలో నాలుకగా మారాడు… అందరికీ కావల్సినవాడయ్యాడు… తను పనిచేసిన ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఆ చిన్న హాస్పిటల్‌కు తన కృషి కారణంగా ఇప్పుడు ఒక ఏసీ డెలివరీ రూం, ఓ ఆపరేషన్ థియేటర్, ఆక్సిజెన్ కాన్సంట్రేటర్, ఇతరత్రా ఆధునిక పరికరాలు సమకూరాయి… ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చేవాళ్లు… ఎవరినీ టైం లేదని వెయిట్ చేయించేది లేదు… ఓపికగా అందరినీ పట్టించుకోవడం..! తన చుట్టూ గిరిగీసుకుని బతకలేదు తను… ఆ సమాజంలో పూర్తిగా ఓ సేవకుడిగా లీనమైపోయాడు…

చుట్టుపక్కల ఊళ్లలో ఏదైనా అంటువ్యాధో ప్రబలితే చాలు, తన టీంతో అక్కడ వాలిపోయేవాడు… యువకుల సహకారం తీసుకుని, దాన్ని కంట్రోల్ చేసేవరకూ ఆ పనిని వదిలిపెట్టేవాడు కాదు… వయస్సులో చిన్నోడే అయినా వాళ్లకు దేవుడు అయిపోయాడు… ఔను మరి, స్వార్థరహితంగా సేవ చేసే డాక్టర్లు దేవుళ్లే కదా మరి..! వాళ్లకొచ్చిన నష్టం లేదు కాబట్టి, లక్కీగా దుష్ట రాజకీయ నాయకులెవరూ తనకు అడ్డుగా తగల్లేదు… సొసైటీకి మంచి అనిపించేది రోజూ ఏదో ఒకటి చేయాలనేదే తన ఆలోచనగా ఈ ఎనిమిదేళ్లూ గడిపేశాడు… తను స్టడీ లీవ్ పెట్టాడు… ఆర్థొపెడిక్స్‌లో మాస్టర్స్ చేయటానికి భువనేశ్వర్ వెళ్లేందుకు మొత్తం సర్దుకున్నాడు… ఇది తెలిసి ఆ ఊరంతా కదిలివచ్చింది… అయ్యో, మమ్మల్ని వదిలివెళ్లిపోతున్నావా అంటూ అక్షరాలా ఈ ఊరుఊరంతా కన్నీరు పెట్టుకుంది… వందల మంది స్టేషన్ దాకా ఊరేగింపుగా వచ్చారు… ఈ అభిమానం చూసి తను కూడా కదిలిపోయి ఇలా కన్నీటితో గ్రామస్థులకు నమస్కారం పెడుతున్నాడు తను… మనం పైన చూసిన ఫోటో అదే… స్టేషన్ చేరుకునేలోపు చుట్టుపక్కల ఊళ్ల జనం కూడా రావడంతో అక్కడ దాదాపు గంటసేపు ట్రాఫిక్ జామ్… అందరి కోరికా ఒకటే… మళ్లీ మా ఊరికే పోస్టింగ్ వేయించుకో… ఇక్కడికే రా… శెభాష్ డాక్టర్ సాబ్… నీ బతుకు పంథాను మరవకు… వేలాది మంది డాక్టర్లు ఆ వృత్తిపైనే ఏవగింపు పుట్టేలా బతుకుతున్న ఈ అంధకారంలో ఒక వెలుగు దివ్వెలా అలాగే బతుకు… వృత్తికీ, బతుక్కీ ఓ సార్థకత తెచ్చుకుంటూ..!!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)