చదువులేకపోయినా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లా సంపాదించుకుంటున్నాం అని గర్వంగా చెబుతున్నారు


Loading...

అదో మారుమూల పల్లె. వంద కుటుంబాలుండే ఆ ఊళ్లో అందరూ చిన్న రైతులే. కానీ అక్కడి రైతులు పేదరికంలో మగ్గిపోవడం లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోవడంలేదు. ‘చదువులేకపోయినా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లా సంపాదించుకుంటున్నాం’ అని గర్వంగా చెబుతున్నారు. ఆ ఊరి నెల ఆదాయం అక్షరాలా అరకోటి మరి. ఈ విజయం ఎలా సాధ్యమైందంటే... పెట్టుబడి పెట్టి కూలీలను పెట్టుకుని పంట వేస్తే, సరైన సమయంలో వర్షాలు పడకపోతే ఓ బాధ. పంట చేతికొచ్చే సమయానికి పడితే మరో బాధ. ఆ మధ్యలో చీడపీడలతో తంటాలు. ఆ తర్వాత సరైన దిగుబడి వస్తుందో లేదోననే దిగులు. అన్నీ బాగున్నా గిట్టుబాటు ధర లేకపోతే కష్టమంతా బూడిదపాలే. రైతుకి మిగిలేది కన్నీరే. వర్షాలు తక్కువగా పడే రాయలసీమ ప్రాంతంలో ఈ సమస్యలు ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. చిత్తూరుజిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో ఉన్న మొటుకు గ్రామం కూడా అందుకు మినహాయింపు కాదు.
Loading...

అలాంటి పరిస్థితుల్లో గ్రామంలోని కొందరు రైతులు వ్యవసాయం మానేసి జెర్సీ ఆవుల్ని కొని పాడి పరిశ్రమ వైపు మళ్లారు. ఇందులో పెట్టుబడి ఒక్కసారి పెడితే చాలు, కూలీల అవసరం ఉండదు, నెలనెలా కచ్చితంగా ఆదాయం వస్తుంది. దాంతో కొద్దిరోజుల్లోనే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. అది చూసి గ్రామంలోని మిగిలినవాళ్లూ వారి బాటలోనే నడవడం మొదలుపెట్టారు. అలా 1975 ప్రాంతంలో మొటుకులో ఒకరిద్దరితో మొదలైన పాడి పశువుల పెంపకం తర్వాత్తర్వాత ఊరంతా వ్యాపించింది. ఇప్పుడక్కడ ఒక్కో కుటుంబం అయిదు నుంచి పది జెర్సీ ఆవుల్ని పోషిస్తోంది.

Loading...

ఉదయం, సాయంత్రం కలిపి వాటి నుంచి రోజుకి నలభై నుంచి డెబ్భై లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. ఊరు మొత్తమీద కలిపితే రోజుకి నాలుగు నుంచి అయిదువేల లీటర్ల పాలను డెయిరీలకు పోస్తారు. మామూలుగా ఓ మోస్తరు పల్లెటూరు అయితే పదిహేను రోజులకోసారి వచ్చే పాల బిల్లులు ఊరు మొత్తానికీ కలిపి లక్షా రెండు లక్షల రూపాయలుంటాయి. కానీ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మొటుకులో ఒక్కో కుటుంబమే పాల మీద నెలకు రూ. ముప్పైవేల నుంచి రూ.లక్ష వరకూ సంపాదిస్తోంది. ఊరందరికీ వచ్చే నెలవారీ పాల బిల్లు అయితే రూ.50లక్షలకు చేరిపోతుంది. ఆగస్టు- జనవరిల మధ్య జెర్సీ ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయి. కాబట్టి ఆ సమయంలో పాల దిగుబడి మరో వెయ్యి లీటర్ల వరకూ పెరిగి, ఆదాయం ఇంకా పెరుగుతుంది. కొత్తవాళ్లెవరైనా మొటుకు గ్రామానికొస్తే ఆ ఊరి పశు సంపదను చూసి ఆశ్చర్యపోవాల్సిందే. వంద ఇళ్లున్న ఆ పల్లెలో వెయ్యికి పైగా ఆవులూ దూడలూ ఉన్నాయంటేనే ఆ ఊరి పాడి పరిశ్రమ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జెర్సీ ఆవుల ధర ఎక్కువే. అయినా ఒక్కో ఆవూ పూటకి అయిదు నుంచి 15 లీటర్ల వరకూ పాలు ఇస్తుంది కాబట్టి, లాభం ఎక్కువ ఉంటుందని ఈ గ్రామంలో వారందరూ జెర్సీ ఆవుల్నే పెంచుతున్నారు. అంతేకాదు, ఇక్కడి రైతులు పశువులకు అవసరమైన గడ్డిని తమ పొలాల్లోనే సాగుచేస్తున్నారు. దీనివల్ల గడ్డి కొనడానికయ్యే ఖర్చు కూడా తగ్గుతోంది. ‘ఎనభైవేల రూపాయలు పెట్టుబడి పెట్టి రెండెకరాల్లో వంకాయ పంటను సాగుచేస్తే ధరల్లేక పొలంమీదే వదిలేయాల్సొచ్చింది. చివరికి మేతగా అన్నా ఉపయోగపడుతుందని పంటచేలోకి పశువుల్ని వదిలా. అదే పాడిలో అయితే, మనం పడిన కష్టానికి ఫలితం కచ్చితంగా ఉంటుంది. దాణా ఖర్చులు పోతే మిగిలింది లాభమే. అందుకే, ఆ రెండెకరాల్లో ఆవులకోసం గడ్డిని సాగు చేస్తూ పాడినే నమ్ముకున్నా. నెలనెలా సంపాదించుకుంటున్నా’ అంటాడు గ్రామానికి చెందిన రవికుమార్‌.
‘ఇంటర్మీడియెట్‌ అయ్యాక నాన్న మరణంతో చదువు ఆపేయాల్సొచ్చింది. మొదట్లో సేద్యం చేశా. లాభాలు రాలేదు. చేసేది లేక అయిదు ఆవుల్ని కొనుక్కున్నాను. రోజుకి నలభై లీటర్ల పాలను అమ్ముతూ చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే మా తమ్ముడితో పోటీగా సంపాదిస్తున్నా. పాడిని నమ్ముకున్నా కాబట్టే ఉద్యోగం లేదనే బాధ కూడా లేదు. పైగా ఉదయం రెండు గంటలూ సాయంత్రం రెండు గంటలే ఎక్కువ పని ఉంటుంది. మిగిలిన సమయంలో వేరే పని చేసుకోవచ్చు’ ఇది రమణారెడ్డి మనసులోని మాట. ఇలా... మొటుకులో పాడిని నమ్ముకుని పైకొచ్చిన వారూ పిల్లల్ని పై చదువులు చదివిస్తున్నవారూ ఎందరో ఉన్నారు. అందుకే, పాడి పరిశ్రమతో వారు సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తి మంత్రం అవుతోంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)