ఇడియట్ జిందాబాద్.. పోకిరి జిందాబాద్.. మెహబూబా జండూబామ్.. నువ్వు అర్జెంటుగా ఛార్మి మత్తులోనుండి బయటపడాలని కోరుకుంటూ నీ వీరాభిమాని రాసిన రివ్యూ


Loading...

మెహబూబా చూసాను… చూసింతర్వాత ఓ నాలుగు ముక్కలు రాయడం అలవాటు. కానీ ఎందుకో రాయబుద్దికావడంలేదు. అందుకే రాయదల్చుకోలేదు. రాస్తే, పూరీ… నిన్ను ఒకపుడు పిచ్చిగా ఎందుకు ప్రేమించామో ఇప్పుడు ఎందుకు ప్రేమించలేకపోతున్నామో నీకేమైనా అర్దం అవుతోందా అని ప్రేమగా అడిగేస్తానేమోనని భయంగా ఉంది. అందుకే రాయదల్చుకోలేదు. 
Loading...

రాస్తే,
పూరీ… నీ పూరీకనెక్ట్ గుయ్యారం కిటికీలోంచి ఓ సారి బయటికి చూస్తే నిన్నువెనక్కు నెట్టేసి ముందుకు వెళ్లి పోయిన ప్రపంచం కనపడతది. ఓ సారి చూసి రీకనెక్ట్ కాగలవేమో చూడు అని కడిగేస్తానేమోనని ఆందోళనగా ఉంది. అందుకే రాయదల్చుకోలేదు.
రాస్తే,
పూరీ…అమ్మనాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే పూరీని ఎక్కడ పూడ్చిపెట్టావ్ వీలయితే అతన్నోసారి దుమ్ముదులిపి బయటకు తీయరాదా అని వంకరగా అడిగేస్తానేమోనని దిగులుగా ఉంది. అందుకే రాయదల్చుకోలేదు.
రాస్తే,
పూరీ… కొడుకును లాంచ్ చేసుకోవడం అవసరమే కానీ కొడుకంటే నీ తర్వాతి తరం వాడు కదా మరి అ, నీదీనాదీఒకేకథ, అర్జున్ రెడ్డి, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి నీ తర్వాతి తరం సినిమాలొకసారి చూసావా, చూసాక కూడా మెహబూబా ఎలా తీయగలిగావ్ అని కాలర్ పట్టుకుని నిలదీస్తానేమోనని అసహనంగా ఉంది. అందుకే రాయదల్చుకోలేదు
రాస్తే,
Loading...


పూరీ..మూగమనసులు సినిమాను పునస్రుష్టించాననుకుని నువు చెడగొట్టిన ప్రేమకథలో రెండు మతాలు రెండు దేశాల మధ్య ద్వేషాన్నే ఎక్కువ చూపావన్న స్రుహ నీకుందా అనే కోపాన్నిప్రదర్శించేస్తానేమోనని తిక్కగా ఉంది. అందుకే రాయదల్చుకోలేదు.
రాస్తే,
పూరీ …ఆ ముక్కుపచ్చలారని ముఖాన్ని అప్పుడే హీరోని చేయాలన్న తపన నీకుంటే ఉండొచ్చుకాక ..కానీ ఆ లేత గోరొంకకు ఓ ముదురు చిలకను జోడీ చేయాలన్న నీ ఎంపిక ఎంత పొరపాటో నీకెవరు చెప్తారు చెప్పు అని నిరసిస్తానేమోనని ఇబ్బందిగా ఉంది. అందుకే రాయదల్చుకోలేదు.
రాస్తే,
పూరీ…రెండు దేశాల మధ్య ఆ సరిహద్దు గొడవ వీధిపంపు దగ్గర బిందెల ఫైట్ గా ఎందుకు తీసావ్, ఆ ఆడ సైనికుల గయ్యాళి అరుపులేంటి, సంఝౌతా గేట్లను డీల్ చేసే పద్దతిదేనా అని నెత్తిన గోముగా మొట్టి, ఈసడిస్తానేమోనని బెంగగా ఉంది. అందుకే రాయదల్చుకోలేదు.
రాస్తే, 
పూరీ..నీకు శుభం కార్డు పడిపోయింది నీకిపుడు విశ్రాంతి అవసరం అని సూటిగా చెప్పేస్తానేమోనని దిగులుగా ఉంది. అందుకే రాయదల్చుకోలేదు. రాయదల్చుకోలేదంటూనే రాయాల్సిందంతా రాసేసానని మీకనిపిస్తే, రాయదల్చుకోకుంటేనే ఇలా ఉందంటే, రాయదల్చుకుంటే ఇంకెంత ఉంటుందో మీ ఊహకే వదిలేస్తూ…
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)