ఒళ్లంతా ఎక్కడెక్కడో తడిమేవాడు. శరీరం కందిపోయేలా నొక్కేసేవాడు. కన్నతండ్రే తల్లిని చేశాడు. నాన్నంటే ఇలానే చేయాలి అని చెప్పాడు


Loading...

విజయ(పేరు మార్చాం) దక్షిణ కర్ణాటకలోని ఓ మారుమూల పల్లెటూరు అమ్మాయి. తల్లిదండ్రులిద్దరూ రోజువారీ కూలీలు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. ఒక్కగానొక్క కూతుర్ని ప్రభుత్వ పాఠశాలకే పంపేవారు. విజయకి చదువంటే చాలా ఇష్టం. పెద్దయ్యాక కలెక్టర్‌ అయి కన్నవారికి మంచి పేరు తేవాలని కలలు కనేది. అలాంటమ్మాయి ఉన్నట్టుండి పదో తరగతి పరీక్షలు దగ్గరపడ్డాక బడి మానేసింది. ఓ స్నేహితురాలు ఇంటికి వెళ్లి అడిగితే ‘కడుపు నొప్పిగా ఉంది. బడికి రాలేను’ అంది. ఇంట్లో విజయ తల్లి పనులకు వెళుతూ కూతుర్ని గమనించలేదు. తండ్రి మాత్రం కూతుర్ని చూస్తున్నాడు గానీ.. పట్టించుకోలేదు. ఓ పది రోజుల తరవాత ‘అమ్మా కడుపు నొప్పి భరించలేకపోతున్నా..’ అంటే అప్పుడా తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది.
Loading...

ప్రభుత్వాసుపత్రిలో విజయని పరీక్షించిన వైద్యులు ఐదో నెల గర్భవతి అని తెలిసి ఆశ్చర్యపోయారు. అదే మాట తల్లికి చెబితే విజయ జుట్టు పట్టి లాగి ‘ఎందుకింత తప్పు చేశావే.. నిన్ను చంపేస్తా... నా పరువు తీశావు’ అంటూ కొట్టబోయింది. చివరికి ఆ గర్భం తీసేయమని ఆమె వైద్యుల్ని కోరింది. కానీ అప్పటికే ఐదో నెల కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి. దాంతో వైద్యులు ఈ విషయాన్ని స్థానిక పోలీస్‌ల దృష్టికి తీసుకెళ్లారు. మైనర్‌ బాలిక కాబట్టి విషయం ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ వరకూ వెళ్లింది. అయినా విజయ నోరు తెరవలేదు. కూతురు గురించి తెలిస్తే ఊళ్లో పరువు పోతుంది. బంధువులు ముఖం చూడరని లబోదిబోమని మొత్తుకుంటోంది. భర్తకి విషయం చెబుదామంటే అతను ఫోన్‌ ఎత్తట్లేదు. ఇంతలో దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన సీడబ్ల్యూసీ అధికారి రెన్నీ డిసౌజా ఈ కేసును ప్రత్యేకంగా తీసుకున్నారు. విజయని తల్లిదండ్రులకు దూరంగా వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్స్‌(పోస్కో) చట్టం కింద రక్షణ కల్పించారు. అయినా ఎవర్నీ నమ్మలేక తనలో తనే కుళ్లికుళ్లి ఏడుస్తుండేది. మగవారు తనకి దగ్గర్లో కనిపిస్తే చాలు భయభయంగా ఉండేది. దాదాపు పదిరోజుల పాటు తనకి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా ఒక్క మాటా మాట్లాడలేదు. పదకొండో రోజు తన నోటి నుంచి వచ్చిన మాట..‘నాన్న’. అధికారులంతా ఆమె తండ్రిని చూడాలనుకుంటుందేమోనని.. అతడిని పిలిపించబోయారు. ఆ సమయంలో గట్టిగా ‘నాన్నే నన్నిలా చేశాడు..’ అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది. విజయ చెప్పింది విన్న ప్రతి ఒక్కరికీ నోట మాటరాలేదు. తనకు జీవాన్ని పోసిన నాన్నే.. ఆమెలో ఇంకో జీవికి బీజాన్ని వేశాడని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఆ చిట్టితల్లిని హత్తుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు. వెంటనే విజయ తండ్రిని అరెస్ట్‌ చేశారు. పలు రకాల వైద్యపరీక్షలు చేసి.. ప్రాథమికంగా అతడే కూతురు బిడ్డకు తండ్రి అని తేల్చారు.
Loading...

తండ్రి అరెస్ట్‌ అయ్యాకగానీ ఆమె ఏం జరిగిందో చెప్పింది. ‘నేను ఆరో తరగతిలో ఉన్నప్పట్నుంచీ నాన్న ఎప్పుడూ నన్ను దగ్గరకు తీసుకోవడం, హత్తుకోవడం చేసేవాడు. రాత్రిపూట కూడా తన పక్కనే పడుకోమనేవాడు. మొదట్లో ఏమీ అర్థమయ్యేది కాదు. ఒళ్లంతా ఎక్కడెక్కడో తడిమేవాడు. శరీరం ఎర్రబడి కందిపోయేలా నొక్కేసేవాడు. నోరు తెరవకుండా మూసేవాడు. ఎందుకు నాన్నా ఇలా చేస్తున్నావ్‌! అంటే నాన్నంటే ఇలానే చేయాలి అని చెప్పాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. చెబితే చంపేస్తా అని బెదిరించేవాడు. తరచూ అమ్మని ఏదో ఒక ఊరు పంపడం.. ఇంటి బయట పడుకోమనడం చేసేవాడు. రాత్రిళ్లు నాన్న చూపించే నరకం తట్టుకోలేక చాలాసార్లు చనిపోవాలనిపించేది. అలాంటి ప్రయత్నాలు చేస్తే మీ అమ్మని చంపేస్తా అని భయపెట్టాడు. ఈ బాధలన్నీ ఉన్నా చదువు మీదే దృష్టి పెట్టేదాన్ని. నాన్న నుంచి తప్పించుకోవాలని రాత్రుళ్లు మెలకువగా ఉండి చదువుకునేదాన్ని. అయినా వదిలిపెట్టేవాడు కాదు. నాలుగేళ్లు భరించా. ఇక పదో తరగతిలోకి వచ్చాక ఆరోగ్యం పాడైంది. వాంతులూ, వికారం, నీరసం.. అయినా అమ్మకి చెప్పలేదు. అలాంటి సమయంలో కూడా నాన్న నన్ను వదల్లేదు. శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు’ అంటూ బాధనంతా పూసగుచ్చింది.

రెండు కోరికలు: పలుసార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చిన తరవాత విజయ అధికారుల్ని రెండు కోరికలు కోరింది. మొదటిది తన తండ్రిని చట్టానికి అప్పగించి శిక్షపడేలా చూడాలి.. రెండోది తను బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవడానికి సాయం చేయాలని అడిగింది. నిజానికి విజయ అప్పటికి మానసికంగా చచ్చిపోయింది. తనకి పాఠాలు విన్న, చదివిన జ్ఞాపకం కూడా లేదు. అప్పటికే బడిలో ఆమె ఇక పరీక్షలు రాయదని ఉపాధ్యాయులు హాల్‌టికెట్‌ని వెనక్కు పంపేశారు. సీడబ్ల్యూసీ అధికారుల చొరవతో హాల్‌టికెట్‌ వచ్చింది. తనకోసం అధికారులు ప్రత్యేకంగా ఓ టీచర్‌నీ నియమించారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం సహకరించకపోయినా బలవంతంగా, కసిగా చదువు మీద దృష్టిపెట్టింది. కేవలం నలభై ఐదు రోజుల్లో పరీక్షలకు సిద్ధమైంది. తమ ప్రాంతంలోనే పరీక్షా కేంద్రం పడింది. అక్కడ తనకు తెలిసిన వాళ్ల మధ్యకు గర్భిణిగా వెళ్లి పరీక్ష రాయలేననీ, వేరే ఇంకెక్కడైనా రాసే అవకాశం ఇవ్వమని విజయ అధికారుల్ని కోరింది. దాంతో వెంటనే సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డును సంప్రదించి.. విజయ పరిస్థితిని వివరించారు. ఉన్నపళంగా బోర్డువారు స్పందించి బెంగళూరులోనే పరీక్ష రాసే అవకాశం ఇచ్చారు. అలా ఈ ఏడాది మార్చి 23న మొదలైన పదో తరగతి పరీక్షల్లో ఏడో నెల గర్భిణిగా నేల మీద కూర్చుని ఓపిగ్గా పరీక్షలు రాసింది. చాలామంది వైద్యులు మూడుగంటలు కింద కూర్చోవడం సాహసం, అలా చేయొద్దని చెప్పినా వినలేదామె. అంత కష్టపడింది.. ఎంతో వేధనని భరించింది కాబట్టే 360 మార్కులతో ఫస్ట్‌ క్లాస్‌లో పాసైంది. మరో రెండు వారాల్లో ఆమెకి ప్రసవం కానుంది. ఇంత చిన్న వయసులో తన జీవితం గురించి స్పష్టత తెచ్చుకుంది. కామర్స్‌ అంటే తనకి చాలా ఇష్టం. ఆ సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ చేయడం, సివిల్స్‌ సాధించడం తన కల.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)