కల్యాణ ఘడియల కోసం అబ్బాయిల ఎదురుచూపు.. పెరుగుతున్న పెళ్లికాని ప్రసాద్‌ లు.. ఆడపిల్లల ఆశకు హద్దు లేదు


Loading...

కొడుకే పుట్టాలని తమ ఇష్టదైవాలను కోరుకున్న తల్లిదండ్రులు ఇప్పుడు వారిని ఓ ఇంటివారిని చేయడానికి కనిపించిన దేవుడికల్లా మొక్కాల్సి వస్తోంది. జీవితాంతం కష్టపడి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేసిన తర్వాత పెళ్లి చేస్తే ఓ పనైపోతుందనుకుంటే ఎక్కడా సంబంధాలు కుదరడం లేదు. యువకుల సంఖ్యకు తగ్గట్లు యువతులు లేకపోవడం, ఉద్యోగం వచ్చి స్థిరపడే వరకు పెళ్లి ప్రస్తావన రాకపోవడం.. అబ్బాయిల విషయంలో అమ్మాయిలు రాజీ పడక పోవడం.. తదితర కారణాలతో జిల్లాలో పెళ్లికాని ప్రసాద్‌ సంఖ్య పెరిగిపోతోంది.
Loading...

ఆయనో ప్రభుత్వ ఉద్యోగి. రిటైర్డ్‌మెంట్‌కి మూడు నెలల సమయం ఉంది. ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి వివాహం చేసేందుకు రెండేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నాడు. పిల్లలకు వివాహాలు చేసి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామనుకుంటే కల్యాణ ఘడియలు రావడం లేదు. ఈ పరిస్థితి అతనొక్కడిదే కాదు.. పెళ్లీడొచ్చిన కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరిదీ. ఒకప్పుడు ఈడొచ్చిన ఆడపిల్లలను తల్లిదండ్రులు గుండెల మీద భారంగా భావించే వారు. పెళ్లి చేసి ఒకరి చేతిలో పెట్టాలంటే ఎన్నో సమస్యలు. కాలం మారింది.. ఇప్పుడు కొడుకులకు వివాహాలు చేసేందుకు సతమతమవుతున్నారు. యువకులకు కల్యాణ ఘడియలు సమీపించడం లేదు. అనేక కారణాలతో సంబంధాలు కుదరక లక్షల మంది యువకులు ఎదురు చూస్తున్నారు.
Loading...

పెరిగిన పెళ్లి వయస్సు - చదువులు, ఉద్యోగాలు, జీవిత భద్రత అంటూ యువతి, యువకులు సరైన సమయంలో పెళ్లి చేసుకోవడం లేదు. యువతులకు 23 –25 ఏళ్ల వయస్సు, యువకులు 28– 30 ఏళ్ల తర్వాతనే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. గతంలో వైద్య వృత్తి, ఫార్మసీ, డెంటల్, అగ్రిక్చలర్, ఇంజినీరింగ్, బీఎస్సీ అగ్రిక్చర్, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ వంటి కోర్సులు కేవలం కొన్ని వర్గాలకు చెందిన వారు మాత్రమే చదివేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వృత్తి విద్యా కోర్సులు చేస్తున్నారు. వీరిలో అమ్మాయిలే అధికంగా కన్పిస్తున్నారు. దీంతో అమ్మాయిల చదువు పూర్తయిన తర్వాతనే మంచి ఉద్యోగం ఉన్న యువకుడితో పెళ్లికి ఒప్పుకుంటున్నారు.

అమ్మాయి అభిప్రాయానికే ప్రాధాన్యత - ఒకప్పుడు అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకోకుండానే పెళ్లి ముహూర్తం ఖరారు చేసేవారు. ఇప్పుడు అమ్మాయి ఒకే అంటేనే పెళ్లి చూపులు. అమ్మాయికి అబ్బాయి నచ్చితేనే పెళ్లి.. ప్రస్తుతం అంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అబ్బాయి ఆస్తిపరుడైనా ప్రొఫెషనల్‌ కోర్సు చేసి ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు అబ్బాయిలు చదువులకు తగ్గ ఉద్యోగాలు లేకపోవడం, ప్రైవేటు రంగాల్లో, స్వయం ఉపాధివైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో యువకులకు పెళ్లి సంబంధాలు కష్టమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే యువకులకు మరీ కష్టమవుతోంది. ఎంత ఆస్తి ఉన్నా పల్లెటూరిలో తమ అమ్మాయి ఉండటం ఇష్టం లేక కొందరు తల్లిదండ్రులు వ్యవసాయం నేపథ్యం ఉన్న వారితో పెళ్లికి ఒప్పుకోవడం లేదు. మంచి ఉద్యోగం, ప్రధాన నగరాల్లో నివసించే సంబంధాలు వస్తే స్థాయికి మంచి కట్నం ఇస్తున్నారు. ఒక్కగానొక్క కుమార్తె ఉంటే తల్లిదండ్రులు కూడా ఎక్కడా రాజీ పడటం లేదు.

అమ్మాయిల డిమాండ్లు
  • జీవిత భాగస్వామి ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్, డాక్టర్‌ కావాలంటున్నారు.
  • ఒకడే కొడుకు ఉండాలంటున్నారు.
  • పెద్ద కుటుంబంలోని అబ్బాయితో పెళ్లి వద్దంటున్నారు.
  • అత్తమామలు లేకుంటే మరీ మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
  • ఫ్యామిలీ పట్టణాల్లోనే ఉండాలనుకుంటున్నారు. 
వివక్ష పోతేనే పెళ్లిళ్ల కష్టాలు దూరం - ఆడపిల్లలను చదివించడం, పెద్ద చేయడం, సంరక్షించడం, పెళ్లి చేయడం భారంగా కొంతమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో చట్టవిరుద్ధమైన గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయించి, ఆడబిడ్డయితే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. యువతీ, యువకుల నిష్పత్తిలో తేడా పెరగడానికి ఇదో ప్రధాన కారణం. ప్రతి వెయ్యి మంది పురుషులకు 986 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. సమాజంలో మార్పులు వచ్చి స్త్రీ, పురుషుల మధ్య నిష్పత్తి సమానంగా ఉంటేనే అబ్బాయిలకు సకాలంలో పెళ్లిళ్లు అవుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమ్మాయిల అభిరుచులు వేరు - పెళ్లి విషయంలో అమ్మాయిల అభిరుచులు వేరుగా ఉన్నాయి. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న అబ్బాయిని అల్లుడిగా చేసుకునేందుకు ముందుకువచ్చారు. తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేవారంటే ఇష్టపడటం లేదు. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో, పోతుందో తెలియకపోవడంతో ఒకింత వెనకడుగు వేస్తున్నారు. అబ్బాయి ఎంత సంపాదిస్తున్నా అమ్మాయిల అభిరుచికి తగినట్లుగా ఉంటేనే పెళ్లికి ఓకే అంటున్నారు.
– దీవి సుధాకిరణ్, మ్యారేజ్‌ బ్యూరో

ఆడపిల్లల ఆశకు హద్దు లేదు - అమ్మాయిల కోర్కెలకు హద్దులు ఉండటం లేదు. తనకు చదువు తక్కువ అయినా, కాబోయే భర్త ప్రభుత్వ ఉద్యోగైనా అయి ఉండాలి. లేదా రెండు కోట్ల రూపాయల ఆస్తికి వారసుడైనా కావాలని కోరుకుంటున్నారు. అత్త, మామలు లేకపోతే మరీ మంచిదనే భావన అమ్మాయిల్లో ఉంది. దీని వలన అబ్బాయిలకు వివాహాలు కావటం ఇబ్బందిగా తయారైంది.
– కనమర్లపూడి ప్రసాద్, మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకుడు, మార్కాపురం

ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటున్నారు - అమ్మాయిల తల్లిదండ్రులంతా తమ కుమార్తెకు ప్రభుత్వ ఉద్యో గం ఉన్న వరుడు కావాలని కోరుతున్నారు. దీని వల్ల అమ్మాయిలకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రయివేటు ఉద్యోగా లు చేస్తున్న అబ్బాయిలకు పెళ్లిళ్లు బాగా ఆలస్యంగా అవుతున్నాయి. అమ్మాయిలకు ఆలోచన మేరకే వరుడిని చూడమంటున్నారు.
– దాసరి తిరుపాలు,మ్యారేజ్‌ లింక్స్‌ నిర్వాహకుడు, ఉలవపాడు
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)