భర్తను హత్య చేయించిన కిలాడీ లేడీ ఎలా దొరికిందంటే.. పోలిసులు సూపర్ ఇంట్రాగేషణ్.. ఆధారాలు మాయం చేస్తాం తప్పించుకుంటాం అనుకునేవారికి ఇదో హెచ్చరిక


Loading...

నవ దంపతులపై దోపిడీ దొంగల బీభత్సం.. పెళ్లైన 9 రోజులకే యువకుడి దారుణ హత్య.. నవ వధువు మెడలో ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలు.. విజయనగరంలోని తోటపల్లిలో శంకర్రావు హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అరుదైన కేసు కావడంతో పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సరస్వతిని కలిసి కొన్ని వివరాలు సేకరించారు. సమీపంలోని పోలీస్ స్టేషన్లన్నింటికీ సమాచారం అందించి అలర్ట్ చేయించారు. కేసులో ఓ 3, 4 అంశాల విషయంలో పోలీసులకు అనుమానం కలిగింది. దంపతులిద్దరిపై దాడి జరిగినా.. అమ్మాయి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడం, ఆమెతో ప్రవర్తనతో పోలీసులకు అనుమానం కలిగింది. దొంగలు తనను బలవంతంగా లాగేశారు, తీవ్రంగా కొట్టి మెడలో చెయిన్, రింగ్ అపహరించుకెళ్లారు అంటూ చెప్పిన సరస్వతి పోలీసులు పలు కోణాల్లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా దొంగలు ఒరియాలో మాట్లాడారని ఒకసారి, తెలుగులో మాట్లాడారని మరోసారి.. ‘గివ్ మీ గోల్డ్..’ అంటూ ఇంగ్లిష్‌లో గట్టిగా గదమాయించారని ఇంకోసారి సరస్వతి చెప్పింది.
Loading...

ప్రయాణ సమయంలో సరస్వతి ఫోన్ స్విచ్ఛాఫ్‌లో పెట్టుకోవడం మరింత అనుమానం కలిగించింది. ఇదే సమయంలో కొంత మంది మీడియా వాళ్లు పోలీసులకు సరస్వతి పెళ్లి నాటి ఫొటోలను పంపించారు. అందులో ఆమె ముభావంగా ఉండటాన్ని గమనించారు. ఇంతలో మరో మీడియా పర్సన్ పంపిన వీడియోలను పరిశీలించగా.. దాడి గురించి సరస్వతి మూడు రకాలుగా చెప్పడం ఉంది. శంకర్రావుతో పెళ్లి ఇష్టంలేకే ఈ హత్య చేయించి ఉంటుందని భావించిన పోలీసులు ఆ కోణంలో విచారణ ప్రారంభించారు. ఇదే సమయంలో.. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ ఆటోలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పెదమానాపురం వద్ద ఎస్పీ పాలరాజు వాహనం, సదరు ఆటో పరస్పరం ఎదురుపడినట్లు ఆయన తెలిపారు. ఆటోలోని ముగ్గురు వ్యక్తులు మురళి, కిశోర్, శివను పక్కకు తీసుకెళ్లి విడివిడిగా ప్రశ్నించగా.. ఒక్కొక్కరూ ఒక్కో సమాధానం చెప్పారు. మీది ఏ ఊరు అంటే.. ఒకరు బొబ్బిలి అని, మరొకరు పార్వతీపురం అని బదులిచ్చారు. ఎక్కడికెళ్లారు అంటే.. ఒకరు పెళ్లికని, మరొకరు జాతరకు అని చెప్పారు. దీంతో ఆటోను సీజ్ చేసి వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో పోలీసులు.. సెల్ టవర్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. హత్య జరిగడానికి ముందు మురళి, శివతో సరస్వతి పలుమార్లు మాట్లాడినట్టు, వాట్సాప్ సందేశాలు పంపించుకున్నట్లు గుర్తించారు. ఇలా ఒక్కో అనుమానం తొలగిపోతూ వచ్చింది. సోమవారం రాత్రి జరిపిన ఇంటరాగేషన్‌లో ఊహకందని విషయం బయటకు వచ్చింది.
Loading...

మేన మామ కుమారుడు శంకర్రావుతో పెళ్లి ఇష్టంలేకే సరస్వతి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. మే 4న వైజాగ్‌కు వెళ్లినప్పుడే సరస్వతి తన ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను భర్త హత్య కోసం గోపీకి సుఫారీగా ఇవ్వడం గమనార్హం. కర్ణాటక నుంచి వైజాగ్‌కు ఉద్యోగం బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న శంకర్రావు.. దానికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూకు హాజరుకావడానికి భార్యతో కలిసి వైజాగ్ వెళ్లాడు. పక్కా ఆధారాలతో నిందితులు దొరికిపోయారని, వారికి అతి త్వరగా శిక్ష పడేలా ప్రయత్నం చేస్తామని ఎస్సీ పాలరాజు మీడియాతో అన్నారు. ఇదొక విషాదకరమైన సంఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉన్నత చదువు చదివిన ఒక యువతి సొంత మామకొడుకును దారుణంగా హత్య చేయించింది. దీంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం ఉంది. ఇందులో బీటెక్ విద్యార్థి కూడా ఉండటం మరో విషాదం’ అని ఆయన అన్నారు. ఎలాంటి నేరం చేసైనా తప్పించుకుంటాం, ఆధారాలను మాయం చేస్తాం అనుకునేవారికి ఇదో హెచ్చరిక లాంటిదని ఆయన చెప్పారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)