తన దగ్గర రోజుకి 5 గంటలు పని చేసే వ్యక్తికి 17 వేలు జీతం ఇస్తున్నాడు. పలువురికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువకుడు

సాంకేతిక పట్టాఉన్నా పాడిపైనే ఎంతో ఆసక్తి.. పలువురికి ఉపాధి కల్పిస్తున్న యువకుడు.. ఆదర్శంగా నిలుస్తున్న నాగరాజు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన గౌరవరపు నాగరాజు పాతికేళ్ల వయస్సులో అద్భుతాన్ని సృష్టించాడు. పోటీ ప్రపంచంలో దేనికి డిమాండ్‌ ఉందో గుర్తించి ఉన్నత దిశగా సాగుతున్నాడు. పాడి పరిశ్రమను ప్రారంభించి పలువురి మన్ననలు పొందుతున్నాడు. నాగరాజు బీటెక్‌ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. చిన్నప్పటి నుంచి నలుగురిలో కొత్తగా ఆలోచిస్తాడనే పేరుంది. టెక్నికల్‌ పట్టా చేతికి రాగానే జీవనోపాధి కోసం సింగరేణి సంస్థను ఆశ్రయించాడు. సబ్‌ కాంట్రాక్టరుగా పని ప్రారంభించాడు.
ఒక్క ఆవుతో ప్రారంభం.. నాగరాజు తమ నూతన గృహ ప్రవేశ సమయంలో తెలిసిన బంధువుల నుంచి ఆవును తీసుకువచ్చాడు. ఆ సమయంలో ఆవుకుఉన్న ప్రత్యేకతను పెద్దవారి నుంచి తెలుసుకుని ఆలోచనలో పడ్డాడు. కొన్ని రోజులకు ఆ ఆవును తనకు ఇవ్వండని సదరు యజమానికి అడిగి తెచ్చుకున్నాడు. అలా ఒక్క ఆవుతో పశుపోషణ ప్రారంభించాడు. పాలను విక్రయిస్తూ సంపాదన మొదలెట్టాడు.
ఆవు పాలకోసం చాలా మంది నాగరాజు ఇంటికి వచ్చేవారు. ఇలా వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో మూడు గేదెలను కొనుగోలు చేశాడు. వాటి కోసం ప్రత్యేకంగా షెడ్‌ను నిర్మించాడు. పాలకు ఉన్న డిమాండ్‌ను గుర్తించిన నాగరాజు పరిశ్రమను విస్తరించాడు. 30 గేదెలు, ఒక జర్సీ ఆవును తీసుకొచ్చాడు. ఆవు, గేదె పాలను విక్రయిస్తున్నాడు. స్వచ్ఛమైన పాలు సరఫరా చేస్తూ మన్ననలు పొందుతున్నాడు.

పలు జాగ్రత్తలు.. పశుపోషణ ప్రారంభించిన నాగరాజు పశువుల ఆరోగ్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పశువైద్యుల సలహాలను పాటిస్తూ లాభాలు సాధిస్తున్నాడు. లేగలు, దూడలు 30 వరకు ఉండటంలో వాటి పోషణకు అధిక మొత్తంలో వెచ్చిస్తున్నాడు. రోజు ఉదయం ఐదు గంటలకు పత్తి చెక్క, మిక్చర్‌ మేతగా వేసి పాలను పిండిన తర్వాత పచ్చగడిని మేత కోసం వాస్తాడు. తిరిగి మధ్యాహ్నం మూడు గంటలకు తవుడు, మిక్చర్‌, జొన్న అన్నం, కొబ్బరి పిండి వేస్తానని తిరిగి పాలను సేకరిస్తాడు. ఎండు గడ్డి వేసి పశువులను కట్టేస్తే ఆ రోజు దినచర్య పూర్తవుతుంది.

తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది: నాగరాజు
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఐటీఐ చదివాను. వెల్డర్‌ ట్రేడ్‌లో ఉద్యోగం వస్తుందని ఆశించాను. రాకపోవడంతో ఈ వృత్తినే ఎంచుకున్నాను. ఇప్పటి పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా.. నేను పాడి పరిశ్రమను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంతో మంది నన్ను అభినందించారు. ప్రతీరోజు ఉదయం 120 లీటర్లు, సాయంత్రం 110 లీటర్ల పాలను విక్రయిస్తున్నా. కల్తీ చేయకుండా శుద్ధమైన పాలనే వినియోగదారులకు అందిస్తున్నాను. కొన్ని పాలు పాలకేంద్రానికి సరఫరా చేస్తున్నాను. ఈ పాడి పరిశ్రమలో రాణించాలంటే పోషణతోపాటు పశుగ్రాసం అవసరం. లేని పక్షంలో రాణించలేం. నాతోపాటు ఇంకొంతమందికి మా పాడి పరిశ్రమలో ఉపాధి కల్పించా. గేదెలకు ఇన్సూరెన్స్‌ కంపెనీ వారు మా సౌకర్యం కల్పించారు.
20 లక్షల వరకు వెచ్చించాం.. - రమేష్‌, పాడి పరిశ్రమ వ్యవస్థాపకుడు
మాది వ్యవసాయ కుటుంబం. ఏ రంగంలోనైనా కష్టపడితే ఫలితాన్ని రాబట్టవచ్చని నా కొడుకు నిరూపిస్తున్నాడు. ఒక్కో గేదెను రూ.50వేల నుంచి రూ.70వేల వరకు వెచ్చించాము. మొత్తం పాడి పరిశ్రమ ఏర్పాటుకు 20లక్షల వరకు అతి కష్టం మీద ఏర్పాటు చేశాను. గేదెలకు ఎటువంటి అనారోగ్యం వచ్చిన మేమే వాటికి చికిత్స చేస్తాం. గేదెలను ఉత్పత్తిచేసే ప్రక్రియలో పది నెలలు, 11 రోజుల్లో ఒక ఈతలో ఒక దూడను జన్మనిస్తుంది.

కూలీ, యజమాని అని తేడా ఇక్కడ లేదు
-సాంబశివరావు, పాలు పితికే వ్యక్తి

పాలు పితకడానికి నాలుగేళ్లుగా వస్తున్నాను. అందరం సమానంగా కష్టపడతాం. కూలీ, యజమాని అని తేడా లేకుండా ఉండటం వల్లే ఈ పాడి పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. ఉదయం 4నుంచి 6.30గంటల వరకు పాలను పితుకుతాం. తిరిగి సాయంత్రం 4నుంచి 6.30 గంటల వరకు పని చేస్తాం. నా వృత్తికి న్యాయం చేస్తాను. రూ.17వేలజీతం అందిస్తున్న ఈ పాడి పరిశ్రమ యజమానులకు కృతజ్ఞతలు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)